
ఐపీఎల్ మ్యాచ్ లో ఓ దృశ్యం
ధోని బ్యాటింగ్ ఆర్డర్ ను ప్రశ్నించే ధైర్యం సీఎస్కేలో లేదు: తివారీ
మనోజ్ తివారీ అభిప్రాయంతో విభేదించిన వీరేంద్ర సెహ్వాగ్
సీఎస్కే జట్టులో ఎవరూ కూడా ధోని బ్యాటింగ్ ఆర్డర్ ను మార్చే ధైర్యం చేయలేదని టీమిండియా మాజీ ఆటగాడు మనోజ్ తివారీ విమర్శించారు. ఈ పరిణామం వలనే ఆర్సీబీ చేతిలో జట్టు 50 పరుగుల తేడాతో దారుణ పరాజయం పాలైందని కోచింగ్ సిబ్బంది పై అసహనం వ్యక్తం చేశారు.
197 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్న సీఎస్కే, రెండో ఓవర్ లోనే రెండు వికెట్లు కోల్పోయిందని, పవర్ ప్లే పూర్తయ్యే సమయానికి కేవలం 30 పరుగులు మాత్రమే సాధించిందని, అప్పటికే మూడు వికెట్లు కోల్పోయిందని అన్నారు.
సీఎస్కే పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్నసమయంలో హార్డ్ హిట్టర్ అయిన ధోనికి పంపకుండా తాత్సారం చేశారని విమర్శించారు. మాజీ కెప్టెన్ ఏకంగా తొమ్మిదో నెంబర్ లో బ్యాటింగ్ దిగాడని అప్పటికే రన్ రేట్ దాదాపుగా 15 పైగా ఉందన్నారు. ఇది ఎలాంటి వ్యూహామో తనకు, చెన్నై అభిమానులకు అర్థం కాలేదన్నారు.
‘‘మాజీ కెప్టెన్ మరింత ముందు బ్యాటింగ్ చేయమని అడగడానికి కోచింగ్ సిబ్బందికి ధైర్యం చాలలేదు అనుకుంట. అతని అపారమైన అనుభవం జట్టు పరిస్థితిని మార్చివేసేది’’ అని క్రిక్ బజ్ తో మాట్లాడుతూ అభిప్రాయపడ్డారు.
‘‘16 బంతుల్లో 30 పరుగులు చేసిన ధోనిని ఇంకా కొంచెం ముందుకు పంపితే బాగుంటుంది. ధోని లాంటి ఆటగాడు ఎందుకు ముందు వరుసలో బ్యాటింగ్ కు రాకూడదు. అసలు మీరు గెలవడానికి ఆడుతున్నారా? ’’ అని తివారీ ప్రశ్నించాడు.
బహుశా ధోని అలా నిర్ణయించుకుని ఉండవచ్చని, అందుకే కోచ్ సిబ్బంది మళ్లీ అడిగే ధైర్యం చేసి ఉండరని అభిప్రాయపడ్డారు.
ఈ మ్యాచ్ లో 16 ఓవర్ లో బ్యాటింగ్ కు దిగిన ధోని, కృనాల్ పాండ్యా వేసిన ఓవర్లో రెండు భారీ సిక్సర్లు బాదాడు. కానీ అప్పటికే మ్యాచ్ సీఎస్కే చేతిలో నుంచి జారీ పోయింది. ఆర్సీబీ 50 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 2008 తరువాత తొలిసారి సీఎస్కేని చెన్నైలోనే ఆర్సీబీ ఓడించింది.
విభేదించిన సెహ్వాగ్..
ఈ కార్యక్రమంలో మాట్లాడిన మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, మనోజ్ తివారీ అభిప్రాయంతో విభేదించారు. నిన్న జరిగిన మ్యాచ్ లో సీఎస్కే పై ఆర్సీబీ పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శించిందని, ధోని బ్యాటింగ్ ఆర్డర్ లో ముందుకు వచ్చిన ఫలితం మారేదే కాదన్నారు.
ధోని తన బ్యాటింగ్ ఆర్డర్ లో ముందే ఏ స్థానంలో రావాలో నిశ్చయించుకున్నాడని, మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా అదే స్థానంలో బ్యాటింగ్ కు వచ్చాడని అన్నారు.
‘‘ఇది అతను(ధోని), టీమ్ మేనేజ్ మెంట్ నిర్ణయించుకున్న విషయం. అతను కొన్ని బంతులు మాత్రమే ఆడాలని నిర్ణయించుకున్నాడు. బ్యాటింగ్ ఆర్డర్ కాకుండా 17 లేదా 18 ఓవర్ లో మాత్రమే ధోని బ్యాటింగ్ రావాలని ప్రణాళిక వేసుకున్నారు. ఇప్పుడు అదే జరిగింది. ఇది నాకు ఆశ్చర్యం కలిగించలేదు. ఒకవేళ ముందుగానే బ్యాటింగ్ వచ్చిన ఫలితం మారేది కాదు’’ అని సెహ్వాగ్ అన్నారు.
Next Story