ఆ‘రేంజ్’ అందుకోలేని హైదరాబాద్, లక్నో చేతిలో ఓటమి
x

ఆ‘రేంజ్’ అందుకోలేని హైదరాబాద్, లక్నో చేతిలో ఓటమి

ఉప్పల్ లో విధ్వంసం సృష్టించిన పూరన్, రాణించిన మార్ష్, శార్ధూల్ ఠాకూర్


సన్ రైజర్స్ కు లక్నో సూపర్ జెయింట్స్ షాక్ ఇచ్చింది. ఉప్పల్ వేదికగా జరిగిన నాలుగో ఐపీఎల్ మ్యాచ్ లో బౌలింగ్, బ్యాటింగ్ విభాగంలో సమష్టిగా రాణించిన ఎల్ఎస్జీ ఐదు వికెట్ల తేడాతో ఎస్ఆర్ హెచ్ ను ఓడించింది.

ఆరేంజ్ ఆర్మీ వీరులు రెండు విభాగాల్లో చేతులెత్తేయడంతో పాటు, ప్రత్యర్థి బ్యాట్స్ మెన్ నికోలస్ పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో సన్ రైజర్స్ నిర్ధేశించిన 191 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా మరో నాలుగు ఓవర్లు ఉండగానే ఛేదించింది.

ఆరంభంలోనే షాక్..
రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లో దంచి కొట్టిన ఎస్ ఆర్ హెచ్ బ్యాట్స్ మెన్లను ఈసారి ఎల్ ఎస్జీ బౌలర్లు తెలివిగా కంట్రోల్ చేశారు. టాస్ గెలిచిన లక్నో కెప్టెన్ పంత్ బౌలింగ్ ఎంచుకున్నాడు.
దీనితో ఈసారి హైదరాబాద్ ఐపీఎల్ లో తొలిసారిగా 300 పరుగుల మార్క్ ను చేరుకుంటుందని అభిమానులు ఆశించారు. కానీ లక్నో బౌలర్లు ఎక్కడ హైదరాబాద్ బ్యాట్స్ మెన్లకు అవకాశం ఇవ్వలేదు.
ముఖ్యంగా ఈసారి మెగా వేలంలో అన్ సోల్డ్ ప్లేయర్ గా మిగిలిన శార్ధూల్ ఠాకూర్ వరుస బంతుల్లో అభిషేక్, ఇషాన్ కిషన్ అవుట్ చేసి షాక్ గురి చేశాడు.
భారీ షాట్ కు యత్నించి శర్మ పెవిలియన్ చేరగా, లెగ్ సైడ్ వెళ్తున్న బంతికి గత మ్యాచ్ సెంచరీ హీరో ఇషాన్ అవుట్ అయ్యాడు. దీంతో స్టేడియం ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది.
ఆ తరువాత కూడా లక్నో బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ పోయారు. దీనితో ఎస్ఆర్ హెచ్ నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి 190 పరుగులు మాత్రమే చేయగలిగింది. ట్రావిస్ హెడ్ అత్యధికంగా 47 పరుగులు సాధించాడు.
పూరన్ విధ్వంసం.. మార్ష్ సహకారం..
హైదరాబాద్ బౌలర్లకు ఆనందం ఏదైన ఉందంటే అది కేవలం తొలి రెండు ఓవర్లు మాత్రమే. తొలి ఓవర్ అభిషేక్ శర్మ వేసి కేవలం నాలుగు పరుగులు మాత్రమే ఇవ్వగా, తరువాత వచ్చిన షమీ, ఓపెనర్ మార్ర్కమ్ ను పెవిలియన్ పంపాడు.
కానీ తరువాత క్రీజులోకి వచ్చిన పూరన్ తొలి బంతి నుంచి ఎదురుదాడి మొదలు పెట్టాడు. బౌలర్ ఎవరనేది చూడకుండా సిక్సర్ల మోత మోగించాడు. మొదట సిమర్జింగ్ బౌలింగ్ లో వరుస సిక్సర్లు బాదిన పూరన్, తరువాత అభిషేక్ శర్మ, షమీ, కమిన్స్ ఇలా ఏ బౌలర్ ను విడిచిపెట్టకుండా ఉతికి ఆరేశాడు. ఇతనికి ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన మార్ష్ చక్కని సహకారం అందించాడు. ఈ జోడి కేవలం 41 బంతుల్లోనే 100 పరుగులు జోడించి విజయానికి బాటలు వేశారు.
పూరన్ కేవలం 26 బంతుల్లోనే ఆరు ఫోర్లు, ఆరు సిక్స్ లతో 70 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఈ వెస్టీండిస్ బ్యాట్స్ మెన్ అవుట్ అయినా, మార్ష్ మాత్రం క్రీజులో కొనసాగి ఎడా పెడా బౌండరీలు బాది రన్ రేట్ ఎక్కడా 12 కి తగ్గకుండా చూసుకున్నాడు. చివరకు అర్థ సెంచరీ సాధించి పెవిలియన్ చేరుకున్నాడు.
ఈ ఆసీస్ బ్యాట్స్ మెన్ అవుట్ అయ్యేసరికి కేవలం బంతికోక పరుగు చొప్పున మాత్రమే సాధించాల్సిన పరుగులు ఉన్నాయి. దీనితో మిగిలిన పనిని డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్ పూర్తి చేశారు.
ట్రావిస్ హెడ్ జోరు..
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఎస్ఆర్ హెచ్ ఆ మాత్రం పరుగులు అయినా సాధించిందంటే కారణం కేవలం ట్రావిస్ హెడ్ దూకుడే అని చెప్పవచ్చు. ఈ ఆసీస్ విధ్వంసక ఒపెనర్ బౌలర్ ఎవరని చూడకుండా బంతిని బౌండరీని పంపడమే లక్ష్యంగా బ్యాటింగ్ చేశాడు.
పవర్ ప్లే ముగిసే సమాయానికి జట్టు స్కోర్ 70 పరుగులు దాటించి సురక్షిత స్థానానికి చేర్చాడు. అయితే ధాటిగా ఆడే క్రమంలో ప్రిన్స్ యాదవ్ వేసిన అద్భుత బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్ లో క్లాసెన్, అనికేత్ వర్మ, మనోహార్ తో పాటు అప్పటికే క్రీజులో నితీష్ కుమార్ రెడ్డి ఉండటంతో కనీసం 220 నుంచి 240 వరకు పరుగులు సాధిస్తుందని అభిమానులు ఆశించారు. కానీ ఫామ్ లో ఉన్న క్లాసెన్ దురదృష్టవశాత్తూ రనౌట్ కావడంతో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది.
నితీష్ క్రీజులో ఉన్న ధాటిగా ఆడలేకపోయాడు. కానీ మరో ఎండ్ లో ఉన్న అనికేత్ వర్మ మాత్రం తన బ్యాటింగ్ పవర్ చూపించి ఐదు సిక్స్ లు బాదడంతో అభిమానుల్లో ఆశలు చిగురించాయి.
కానీ ఓ చెత్త షాట్ తో అతను మిల్లర్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తరువాత కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా మూడు సిక్స్ లతో స్కోర్ ను పెంచే ప్రయత్నం చేశాడు. అతడిని శార్దూల్ ఠాకూర్ తెలివిగా పెవిలియన్ పంపాడు.
ప్రారంభం.. ఎండ్ లో శార్దూల్.. మిడిల్ లో ప్రిన్స్
ఈ మ్యాచ్ లో లక్నో బౌలర్లు మంచి వ్యూహం ప్రకారం గ్రౌండ్ లోకి దిగారని తెలుస్తోంది. హైదరాబాద్ బ్యాట్స్ మెన్ కు ఎక్కడా పరుగులు సాధించే అవకాశం ఇవ్వకుండా కట్టుదిట్టమైన బంతులు సంధించాడు.
ముఖ్యంగా ఆరంభంలో శార్ధూల్ రెండు వికెట్లు తీయడం తో ఆ జట్టుకు బాగా కలిసి వచ్చింది. ఇక మిడిల్ ఓవర్లలో ప్రిన్స్ యాదవ్ అద్భుతంగా బంతులు సంధించాడు. ముఖ్యంగా ట్రావిస్ హెడ్ ను క్లీన్ బౌల్డ్ చేయడం ఆకట్టుకుంది. తన లైన్ అండ్ లెంగ్త్ , స్లో డెలివరీ, ఆఫ్ స్టంప్ కు దూరంగా బంతులు సంధిస్తూ హైదరాబాద్ స్పీడ్ కు బ్రేక్ లు వేశాడు.
ఇతనికి స్పిన్నర్ దిగ్వేష్ సింగ్ మంచి సహకారం అందించాడు. సునీల్ నరైన్ ల బంతిని వెనకాల దాచిపెడుతూ.. ఇమ్రాన్ తాహిర్ యాక్షన్ తో బంతులు సంధిస్తూ పరుగులు కట్టడి చేశాడు. మళ్లీ చివర్లో బౌలింగ్ కు దిగిన శార్దూల్ మరో రెండు వికెట్ల తన ఖాతాలో వేసుకుని తన ఐపీఎల్ కెరియర్ అత్యుత్తమ ప్రదర్శన (4/34) కనపరిచాడు.
స్కోర్ బోర్డు:
సన్ రైజర్స్ హైదరాబాద్: 190/9 ( 20 ఓవర్లు)
ట్రావిస్ హెడ్ 47(28)
అనికేత్ వర్మ36(13)
నితీష్ కుమార్ రెడ్డి 32(28)
శార్థూల్ ఠాకూర్ 4/34
ప్రిన్స్ యాదవ్ 1/29
దిగ్వేష్ సింగ్ 1/40
లక్నో సూపర్ జెయింట్స్
నికోలస్ పూరన్ 70 (26)
మిచెల్ మార్ష్ 52 (31)
అబ్దుల్ సమద్ 22 (8)
ప్యాట్ కమిన్స్ 2/29
హర్షల్ పటేల్ 1/28
షమీ 1/37
Read More
Next Story