
ఐపీఎల్ మ్యాచ్‌కు ముస్తాబవుతున్న ఉప్పల్ స్టేడియం..
ల్యాప్ టాప్ లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, అగ్గిపెట్టెలు, పదునైన వస్తువులు, బయట నుంచి తెచ్చే తినుబండారాలు, వాటర్ బాటిల్స్ వంటి వాటికి నో ఎంట్రీ.
ఇండియాలో ఐపీఎల్-2025 జాతర ఈరోజు నుంచి మొదలైంది. ఈరోజు కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడుతున్నాయి. కాగా రేపు అంటే ఆదివారం హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్ ఛాలెంజర్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడటానికి సిద్ధమవుతోంది. ఈ మ్యాచ్ కోసమే ఉప్పల్ స్టేడియం ముస్తాబవుతోంది. ఈ మ్యాచ్ జరగనున్న క్రమంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు, ప్రేక్షకులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు రాజకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. ఉప్పల్ స్టేడియంగా ప్రఖ్యాతిగాంచిన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియమ్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వివరించారు. దాదాపు 3వేల మంది పోలీసులను సెక్యూరిటీ డ్యూటీలో ఉంచుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. మార్చి 23 నుండి మే 21 వరకు ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో తొమ్మిది ఐపిఎల్ మ్యాచ్‌లు జరగనున్నాయని, వాటన్నింటి గట్టి భద్రత ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు.
మ్యాచ్‌ల నిర్వహణకు అవసరమైన అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ‘‘భధ్రతాపరమైన ఉల్లంఘనలకు, అవాంఛనీయ సంఘటనలకు అవకాశం ఇచ్చే ల్యాప్ టాప్ లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, అగ్గిపెట్టెలు, పదునైన వస్తువులు, బయట నుంచి తెచ్చే తినుబండారాలు, వాటర్ బాటిల్స్ వంటి వాటిని స్టేడియంలోనికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదని అధికారులను ఆదేశించారు. భారీ సంఖ్యలో క్రికెట్ అభిమానులు హాజరయ్యే అవకాశం ఉండటం వల్ల ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని, కార్లు, ద్విచక్ర వాహనాలకు విశాలమైన పార్కింగ్ ఏర్పాటు చేయాలి. సాధారణ వాహనదారుల రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా, ఉప్పల్ ప్రధాన రహదారి మీద ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా ఏర్పాట్లు చేయాలి. స్టేడియం చుట్టూ దాదాపు 450 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నాం. వాటి ద్వారా స్టేడియం పరిసరాలను ఎలక్ట్రానిక్ నిఘా నీడలో ఉంచనున్నట్టు, ప్రతీ ఒక్కరి కదలికలూ సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తం అవుతాయి. సివిల్, ట్రాఫిక్, రిజర్వ్ పోలీసులు, ఎస్ఓటి వంటి పలు విభాగాల అధికారులు, సిబ్బంది బందోబస్తు విధుల్లో ఉంటారు. టికెట్ల పంపిణీలో ఎటువంటి గందరగోళం లేకుండా చూడాలి’’ అని సుధీర్ బాబు సూచించారు.
ఈ స్టేడియంలో తొమ్మిది మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ క్రమంలో మహిళల భద్రత కోసం షీటీమ్స్‌ను కూడా నియమించాం. అందులో భాగంగానే మ్యాచ్ తర్వాత ప్రేక్షకులు తిరిగి వెళ్లడానికి వీలుగా మెట్రోను ఎక్కువసేపు నడపాలని అభ్యర్థించామని చెప్పారు. అదే విధంగా అన్ని రకాల భద్రతా చర్యలను పకడ్బంధీగా చేపడుతున్నట్లు వివరించారు.
ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్‌ల వివరాలివే:
23 మార్చి 2025, సర్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్యాహ్నం 3:30 గంటలకు
27 మార్చి 2025 రాత్రి 7:30 గంటలకు సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జయంట్స్
12 ఏప్రిల్ 2025 రాత్రి 7:30 గంటలకు సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్
23 ఏప్రిల్ 2025 రాత్రి 7:30 గంటలకు సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్
5 మే 2025 రాత్రి 7:30 గంటలకు సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్
10 మే 2025 రాత్రి 7:30 గంటలకు సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్
20 మే 2025 రాత్రి 7:30 గంటలకు క్వాలిఫయర్ 1
21 మే 2025 రాత్రి 7:30 గంటలకు ఎలిమినేటర్