
వైభవ్ సూర్యవంశీ
రోజుకు ఆరువందల బంతులు ఎదుర్కోవడం నుంచి ఐపీఎల్ సెంచరీ వరకూ..
అత్యంత పిన్న వయస్సులో టీ20 సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ
పాలబుగ్గల పసివాడు అనచ్చు..చూస్తే కాస్త అలాగే ఉన్నాడు. పసితనం ఛాయలు ఇంకా పూర్తిగా పోలేదు. కానీ నిన్న ఆర్ ఆర్ వర్సెస్ జీటీ మ్యాచ్ లో సీనియర్ క్రికెటర్లు సైతం స్ఫూర్తి పొందేలా సిక్స్ లు బాదేశాడు.
రాకెట్ వేగంతో బంతిని బౌండరీ లైన్ దాటించాడు. సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో పరుగుల సునామీ సృష్టించాడు. ఈ ఉపోద్ఘాతం ఎవరి గురించో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతడే 14 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ.
ఈ బీహార్ కుర్రాడు ఐపీఎల్ చరిత్రలోనే కాదు.. మొత్తం టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్సులో టీ20 సెంచరీ సాధించాడు. అత్యంత వేగవంతమైన సెంచరీ విండీస్ వీరుడు క్రిస్ గేల్ పై ఉంది. ఈ దిగ్గజం 30 బంతుల్లోనే సెంచరీ సాధించి కాస్త ముందున్నాడు.
వైభవ నిన్న గుజరాత్ తో జరిగిన మ్యాచ్ కేవలం 35 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఐపీఎల్ లో అతి తక్కువ బంతుల్లో సెంచరీ సాధించిన మొట్టమొదటి భారతీయుడిగా రికార్డుల్లోకి ఎక్కాడు.
అతని ఇన్సింగ్స్ లో ఏకంగా 11 భారీ సిక్స్ లు ఉన్నాయి. వైభవ్ విధ్వంసం తో గుజరాత్ నిర్దేశించిన 210 పరుగులు భారీ లక్ష్యం కేవలం 15 ఓవర్లలోనే రాజస్థాన్ రాయల్స్ ఛేదించింది.
ఏ దేశంలో నైనా 14 ఏళ్ల పిల్లలు ప్రస్తుతం వేసవి సెలవుల కోసం సమాయత్తం అవుతుంటారు. స్కూల్ పరీక్షలు పూర్తి చేసి మంచి తదుపరి సంవత్సరం కోసం ముందస్తు తరగతులకు హజరవడానికి సమాయత్తం అవుతున్నారు.
కానీ ఈ ఎడమ చేతి వాటం సమస్తిపూర్ ఆటగాడు మాత్రం మైదానంలో అగ్రశ్రేణి బౌలర్లకు చుక్కలు చూపించాడు. భారత సీనియర్ జట్లకు ప్రాతినిధ్యం వహించిన ఇషాంత్ శర్మ, మహ్మాద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ, విదేశీ ఆటగాళ్లు రషీద్ ఖాన్, జన్నత్ వంటి బౌలర్లను లెక్క చేయకుండా ఎడాపెడా బౌండరీలు బాదేశాడు.
ఇషాంత్ శర్మ 2006 లో టెస్ట్ క్రికెట్ అరంగ్రేటం చేశాడు. అప్పటికి సూర్యవంశీ ఇంకా పుట్టలేదు. కానీ ఈ మ్యాచ్ లో ఇషాంత్ వేసిన ఓ ఓవర్ లో ఏకంగా24 పరుగులు సాధించాడు.
ఈ మ్యాచ్ లో మరో చిచ్చర పిడుగు యశస్వి జైస్వాల్ బాగా ఆడినప్పటికీ పూర్తి క్రెడిట్ వైభవ్ కే దక్కింది. దీనికి కారణం అతని బ్యాటింగే అని చెప్పవచ్చు.
పాట్నలో సాధన..
పాట్నాలో పది సంవత్సరాల వయస్సు నుంచి రోజుకు కనీసం 600 బంతులను ఆడి, గంటల తరబడి మైదానంలో గడిపి క్రికెట్ లో ప్రత్యేక నైపుణ్యాలు నేర్చుకున్నాడు. ఆ ఫలితం నిన్న సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో కనిపించింది.
తన తండ్రి సంజీవ్ సూర్యవంశీ కోసం శ్రమించే నెట్ బౌలర్ల కోసం పది అదనపు టిఫిన్ బాక్స్ లు తీసుకుని ఇచ్చేవాడు. తన కొడుకు క్రికెట్ ఆశయాలను నేరవేర్చడానికి కుటుంబానికి జీవనాధారమైన వ్యవసాయ భూమిని అమ్మేశాడు. ఇలా ఉన్న ఆస్తులన్నీ పోగు చేసి కొడుకు కోసం ఖర్చు చేశాడు.
వైభవ్ కూడా క్రికెటర్ కావడానికి తనకు ఇష్టమైన ఆహారాన్ని త్యాగం చేశాడు. ఇలా ఆడుతున్న తరుణంలోనే రాజస్థాన్ రాయల్స్ కోచ్, ది వాల్ రాహుల్ ద్రావిడ్ దృష్టిలో పడ్డాడు. గత ఏడాది జరిగిన ఐపీఎల్ లో వైభవ్ ను రూ. 1.10 కోట్లకు కొనుగులు చేశారు.
కానీ అతడికి చాలా ఆలస్యంగా జట్టులో చోటు దక్కింది. కానీ వచ్చిన అవకాశాలను రెండు చేతులా అందుకున్నాడు. అందుకే కుర్రాడి సెంచరీ చేయగానే రాహుల్ ద్రావిడ్ సైతం లేచి చిన్నపిల్లాడిలా డగ్ అవుట్ లో సంబరాలు చేసుకున్నాడు.
వైభవ్ బ్యాటింగ్ లో ఒకరకమైన వేగం, కచ్చితత్వ ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఐపీఎల్ లో తాను ఆడిన తొలిబంతినే అతడు సిక్స్ గా మలిచాడు. నిన్నటి మ్యాచ్ లో కూడా సిరాజ్ బౌలింగ్ లో లాంగ్ ఆన్ మీదుగా సిక్స్ కొట్టి పరుగుల వేట ప్రారంభించాడు.
ఇషాంత్ వేసిన ఓ బంతిని స్క్వేర్ లెగ్ మీదుగా స్టాండ్ లోకి పంపాడు. ఈ సీజన్ లో తొలి మ్యాచ్ ఆడుతున్న కరీం జనత్ వేసిన ఓవర్లలో సిక్స్ లు, ఫోర్లతో విరుచుపడిన వైభవ్.. ఏకంగా 30 పరుగులు తన ఖాతాలో వేసుకున్నాడు. రషీద్ బౌలింగ్ లో ఓ భారీ సిక్స్ ను బాదీ, సెంచరీ పూర్తి చేశాడు.
ప్రసిద్ద్ బౌలింగ్ అతను క్లీన్ బౌల్డ్ అయినప్పటికీ అప్పటికే మ్యాచ్ దాదాపు ముగింపు దశకు చేరుకుంది. జీటీ కెప్టెన్ శుభ్ మన్ గిల్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. వైభవ్ ను ప్రశంసలతో ముంచెత్తాడు. అతను హిట్టింగ్ బాగుందని వ్యాఖ్యానించారు.
జైస్వాల్ మాట్లాడుతూ.. ఇది నమ్మశక్యం కానీ ఆట, నేను చూసిన అత్యుత్తమ ఇన్సింగ్స్ లలో ఇది ఒకటి. నేను నీ సహజ సిద్దమైన ఆటను కొనసాగించమని చెప్పానని వివరించాడు.
ఓ అన్ కట్ వజ్రం
ప్రస్తుతం భారత క్రికెట్ కు ఓ అద్భుత అన్ కట్ వజ్రం లభించింది. దీనిని సానబెట్టడం మన బాధ్యతే. ఇంతకుముందు లక్ష్మణ్ శివరామకృష్ణన్, మణీందర్ సింగ్, సదానంద్ విశ్వనాథ్, వినోద్ కాంబ్లీ, పృథ్వీ షా అద్భుత ప్రతిభ కనపరిచినప్పటికీ తరువాత దానిని కొనసాగించడంలో విఫలం అయ్యారు. కానీ సూర్యవంశీ ప్రయాణం ఇప్పుడే మొదలైంది.
Next Story