కాంగ్రెస్ లో చేరికని అడ్డుకున్న బీఆర్ఎస్ కి పోచారం స్ట్రాంగ్ కౌంటర్
x

కాంగ్రెస్ లో చేరికని అడ్డుకున్న బీఆర్ఎస్ కి పోచారం స్ట్రాంగ్ కౌంటర్

మాజీ స్పీకర్ బాన్సువాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు.


తెలంగాణ మాజీ స్పీకర్, బాన్సువాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పార్టీ కండువా కప్పి ఇద్దరినీ పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిశామన్నారు. పెద్దలుగా అండగా నిలబడాలని వారిని కోరామన్నారు.

రైతుల సంక్షేమం కోసం అందరినీ కలుపుకుపోతాం...

తెలంగాణ రైతుల సంక్షేమం కోసం పోచారం కాంగ్రెస్ లో చేరారు అని రేవంత్ చెప్పారు. రైతుల సంక్షేమంపై వారి సలహాలు సూచనలు తీసుకుని ముందుకెళతామన్నారు. రైతు రుణమాఫీ విధివిధానాలపై ఇవాళ మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నామన్నారు. భవిష్యత్ లో పోచారం శ్రీనివాస్ రెడ్డికి సముచిత గౌరవం ఇస్తామని ప్రకటించారు. నిజామాబాద్ జిల్లాలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు ఆయన సహకారం తీసుకుంటాం అని రేవంత్ తెలిపారు.

ఇది రైతు రాజ్యం.. రైతు సంక్షేమ రాజ్యం.. రైతు సంక్షేమం కోసం అవసరమైన అందరినీ కలుపుకుని పోతామని సీఎం వెల్లడించారు. శ్రీనివాస రెడ్డి చేరిక శుభసూచికమన్న రేవంత్.. ఆయన సలహాలు, సూచనలతో రైతు సమస్యల పైన దృష్టి పెడతామన్నారు. "పోచారం శ్రీనివాస రెడ్డి చేరికను అడ్డుకున్నది ఎవరో నాకు ఇంకా సమాచారం రాలేదు. ఇటువంటి వాటి పైన త్వరలోనే స్పందిస్తాను. ఈరోజు రైతు రుణమాఫి పైనే దృష్టి పెట్టాము, రైతులకు శుభసూచకం జరుగుతుంది. కేబినెట్ నిర్ణయం కూడా అదే" అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

నేనేమీ చిన్న పిల్లోడిని కాదు... పోచారం

తానే స్వయంగా సీఎం రేవంత్ రెడ్డిని ఇంటికి ఆహ్వానించానని చెప్పారు పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఆయన పరిపాలన చాల బావుంది,, మరో 20 యేండ్లు రాష్ట్రాన్ని నడిపించగల నాయకుడు రేవంత్ రెడ్డి అని ప్రశంసించారు. తన చేరికను అడ్డుకునేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ నేతల వ్యవహారంపై స్పందిస్తూ... తెలుగుదేశం నుండీ బిఆర్ఎస్ లోకి వచ్చినప్పుడు బిఆర్ఎస్ నాయకులకు తెలియదా.. అని పోచారం నిలదీశారు. "నేనేమీ చిన్న పిల్లోడిని కాదు, నా పుట్టుకనే కాంగ్రెస్ పార్టీ. నా ఇష్ట ప్రకారమే కాంగ్రెస్ పార్టీలో చేరిన.." అని పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.

ఇంకా ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే..

రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత జరుగుతున్న పరిణామాలను గమనించిన పిమ్మట ఈరోజు నేను వారిని మా ఇంటికి మనఃస్పూర్తిగా ఆహ్వానించాను. ఆయన రైతు పక్షపాతి, రైతు సంక్షేమంతో పాటుగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం వారు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజా ఆమోదయోగ్యమైనవి. నేను స్వయంగా రైతును. రైతుల కష్టసుఖాలు నాకు తెలుసు. అందుకే రేవంత్ రెడ్డి రైతాంగానికి చేస్తున్న మంచి కార్యక్రమాలకు అండగా ఉండాలని ఆలోచించి ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను.

కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గత ఆరు నెలలుగా చేస్తున్న పనులను గమనిస్తున్నాను, చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. కొత్త ప్రభుత్వంలో సమస్యలు సహజం, అయినప్పటికీ చిన్న వయసులోనే రేవంత్ రెడ్డి దైర్యంతో వాటిని అధిగమించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళుతున్నారు. వారిని, రాష్ట్ర మంత్రి వర్గాన్ని అభినందిస్తున్నాను. నేను కూడా మంచి ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీలోకి రావాలనే నిర్ణయం తీసుకున్నాను. నా జీవితంలో రాజకీయంగా ఆశించడానికి ఏమి లేదు. నేను ఆశించేది రైతుల సంక్షేమం.

నా రాజకీయ జీవితంలో ఎక్కువగా రైతులతో సంబంధం ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి, సహకార వ్యవసాయ బ్యాంకు చైర్మన్ గా చేశాను. నా రాజకీయ జీవితం కాంగ్రెస్ పార్టీతోనే మొదలైంది. తరువాత టిడిపి, బీఆర్ఎస్ లలో పనిచేశాను. ఇప్పుడు చివరకు మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చాను. రేవంత్ రెడ్డికి ఇంకా ఇరవై ఏళ్ళు రాష్ట్రానికి నాయకత్వం వహించే సామర్థ్యం ఉన్నది. ఆయన చేస్తున్న మంచి పనులకు మెచ్చి నాకు వ్యక్తిగతంగా నచ్చి వారి నాయకత్వాన్ని బలపరచాలని, వారి నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయం తీసుకున్నాను. రాష్ట్ర ప్రగతికి చేదోడు వాదోడుగా ఉంటూ రైతుల సంక్షేమం కోసం అందరం సమిష్టిగా కృషి చేస్తాం అని పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు.

పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటి ముందు ఉద్రిక్తత

హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటి ముందు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆయన పార్టీ మారేందుకు వీల్లేదంటూ బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలుద్దామని ఇంటికి వెళ్లిన బాల్క సుమన్ ని, ఆందోళన చేపట్టిన శ్రేణుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Read More
Next Story