
ఆనందంలో భారత జట్టు
ఓవల్ టెస్ట్ లో మియా మ్యాజిక్.. టెండూల్కర్- ఆండర్సన్ ట్రోఫి సమం
అచ్చంగా ఇది సిరాజ్ విజయమే, ఈ పర్యటనలో 200 ఓవర్లు బౌలింగ్ చేసిన హైదరాబాదీ
ఇంగ్లాండ్ లో సుదీర్ఘ సిరీస్ ను టీమిండియా విజయంతో ముగించింది. ఓవల్ టెస్ట్ లో ఆరు పరుగులతో విజయం సాధించి టెండూల్కర్- ఆండర్సన్ ట్రోఫిని 2-2 తో సమం చేసింది.
ఈ విజయంలో భారత బ్యాట్స్ మెన్ ప్రతిభ ఎంత ఉందో బౌలర్ల కష్టం అంతే ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ పేసర్ మియా భాయ్ సిరాజ్ పాత్ర మాటల్లో చెప్పలేనిది. వరుసగా ఐదు టెస్టులు ఆడిన సిరాజ్ చివరి టెస్ట్ లో రెండు ఇన్నింగ్స్ లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా కేవలం 224 పరుగులకే చాపచుట్టేసింది. ఇంగ్లీష్ జట్టు తొలి వికెట్ కు 90 పరుగులు జోడించింది. ఇంకేముంది ఆ జట్టుకు మూడు వందల పరుగుల ఆధిక్యం ఖాయమని అంతా అనుకున్నారు. లంచ్ వరకు జరిగిన తొలి సెషన్ లో ఇంగ్లీష్ ఓపెనర్లు సిరాజ్ టార్గెట్ గా బాదటం మొదలు పెట్టారు.
దీనితో సిరాజ్ 7 ఎకానమీతో పరుగులు సమర్పించుకున్నాడు. టీ20 లో స్థాయిలో పరుగులు సమర్పించుకోవడంతో మిగిలిన బౌలర్లు కూడా డీలా పడిపోయారు. కానీ రెండో స్పెల్ లో బౌలింగ్ దిగిన సిరాజ్ ఆకాశమే హద్దుగా చెలరేగి ప్రత్యర్థి బ్యాట్స్ మెన్ కు చుక్కలు చూపించాడు.
ఈ సెషన్ లో కీలకమైన నాలుగు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. ఇందులో కీలకమైన జో రూట్ తో సహ కెప్టెన్ ఓలీపోప్ వంటి కీలక ఆటగాళ్ల వికెట్లు ఉన్నాయి. సిరాజ్ జోష్ తో మిగిలిన బౌలర్లు కూడా తమ వంతు చేయి వేయడంతో ఇంగ్లీష్ జట్టు 247 పరుగులకే ఆలౌట్ అయింది.
రెండో ఇన్నింగ్స్ లో భారత బ్యాట్స్ మెన్ అసాధారణంగా పోరాటం చేయడంతో భారత్ ఇంగ్లీష్ జట్టు ముందు 374 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. అయితే ప్రత్యర్థి జట్టులో జో రూట్, హ్యరీ బ్రూక్ సెంచరీలతో చెలరేగడంతో విజయం వైపు ఆ జట్టు దూసుకుపోయింది. దీనితో మనకు మరో పరాజయం తప్పదని అంతా అనుకున్నారు.
చివరి సెషన్ లో అనూహ్యంగా ఫుంజుకున్న టీమిండియా బౌలర్లు చివర్లో బ్రూక్, రూట్, బెతెల్ ను పెవిలియన్ పంపడంతో భారత జట్టు ఒకసారిగా రేసులోకి వచ్చింది. అయితే వర్షం వల్ల ఆట అర్థాంతరంగా నిలిపివేయాల్సి వచ్చింది.
కానీ ఐదో రోజు ఆటలో భారత్ బౌలర్లపైకి ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ ఎదురుదాడికి ప్రయత్నించాడు. ప్రసిద్ద్ కృష్ణ తొలి ఓవర్ తొలి రెండు బంతులను ఓవర్టన్ ను బౌండరీ తరలించడంతో అభిమానుల్లో కలవరం చెలరేగింది.
కానీ తరువాత ఓవర్ బౌలింగ్ కు దిగిన సిరాజ్ ప్రతిబాల్ వికెట్ పడుతుందా అన్న తరహాలో బంతులు సంధించాడు. ప్రారంభంలోనే స్మిత్ ను పెవిలియన్ పంపి వికెట్ వికెట్ల పతనాన్ని ప్రారంభించాడు. ఆట్కిన్సన్ ను సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేసి పర్యటనను విజయవంతంగా ముగించాడు.
ఈ సిరీస్ లో సిరాజ్ ఏకంగా 200 ఓవర్లు వేశాడు. ఇంగ్లాండ్ బజ్ బాల్ వ్యూహం మన జట్టు ముందు పనిచేయలేదు. భారత అభిమానులు సోషల్ మీడియాలో దీన్ని బెగ్ బాల్ గా కామెంట్ చేయడం తెలిసిందే.
Next Story