
ఇషాన్ కిషన్
ఐపీఎల్: తొలి బోణి కొట్టిన బెంగళూర్
బ్యాటింగ్ లో రాణించిన ఇషాన్ కిషన్, నిరాశ పరిచిన ఎస్ ఆర్ హెచ్ బౌలర్లు
ఐపీఎల్ పందోమ్మిదో సీజన్ తొలి మ్యాచ్ లో బెంగళూర్ బోణి కొట్టింది. సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. బెంగళూర్ లోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్ హెచ్ నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఆర్సీబీ కేవలం 15.4 ఓవర్లలోనే ఈ లక్ష్యాన్ని చేధించింది. విరాట్ కోహ్లీ(69) చివరి వరకూ క్రీజులో నిలబడి జట్టును గెలిపించాడు.
ఈ మ్యాచ్ లో ఆరెంజ్ ఆర్మీ అన్ని రంగాలలో విఫలం అయింది. ఒపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఈ సీజన్ లో మరోసారి నిరాశ పరిచారు. అభిషేక్ సిక్స్ తో ఖాతా తెరిచినప్పటికీ ఎప్పటిలాగే భారీ షాట్ ఆడబోయి వికెట్ కీపర్ జితేశ్ కు క్యాచి ఇచ్చి వెనుదిరిగాడు.
మరో ఓపెనర్ హెడ్ కూడా సాల్ట్ కు క్యాచి ఇచ్చి పెవిలియన్ చేరాడు. వన్ డౌన్ బ్యాట్స్ మెన్ నితీశ్ కుమార్ రెడ్డి కూడా భారీ షాట్ ఆడే ప్రయత్నంలో వికెట్ పారేసుకున్నాడు. ఈ మూడు వికెట్లు ఆర్సీబీ బౌలర్ డఫీ తన ఖాతాలో వేసుకున్నాడు.
కానీ వరల్డ్ కప్ నుంచి మంచి ఫామ్ లో ఉన్న కెప్టెన్ ఇషాన్ కిషన్ కు తోడుగా క్లాసెన్ ఇన్నింగ్స్ ను నిర్మించాడు. వీరిద్దరు భారీ షాట్లతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ముఖ్యంగా ఇషాన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 38 బంతుల్లోనే 80 పరుగులు సాధించాడు. చివర్లో అనికేత్ వర్మ భారీ షాట్ల తో విరుచుకుపడటంతో ఆరెంజ్ ఆర్మీ 20 ఓవర్లలో 201 పరుగులు చేసింది.
భారీ లక్ష్య చేధనలో బరిలోకి దిగిన ఆర్సీబీకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఫిల్ సాల్ట్ వికెట్ కీపర్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అయితే వన్ డౌన్ లో వచ్చిన దేవదత్ పడిక్కల్(61) వచ్చి రాగానే ఎదురుదాడి చేశాడు. తను ఎదుర్కొన్న తొలిబంతినే స్టాండ్స్ లోకి పంపాడు. వచ్చిన బంతిని వచ్చినట్లు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు.
పడిక్కల్ పెవిలియన్ చేరిన తరువాత కెప్టెన్ రజత్ పాటిదార్ కూడా తన సహజ శైలికి విరుద్దంగా బ్యాట్ ఝలిపించడం ప్రారంభించాడు. కేవలం 12 బంతుల్లోనే మూడు సిక్స్ లు, రెండు ఫోర్లతో 31 పరుగులు సాధించాడు. మరో వైపు కోహ్లీ కూల్ గా తన పని తను చేసుకుంటూ వెళ్లాడు. ఈ క్రమంలో అర్థ సెంచరీ సాధించాడు. తరువాత వేగంగా ఆడుతూ మరో రెండు సిక్స్ లు బాది విజయాన్ని పూర్తి చేశాడు.
Next Story

