
బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహ్మన్
టీ20 ప్రపంచకప్ నుంచి వైదొలిగిన బంగ్లాదేశ్
సెక్యూరిటీ కారణాలు చూపిన బీసీబీ, రెహమాన్ ను ఐపీఎల్ నుంచి తీసివేయడమే ప్రధాన కారణం
భద్రత కారణాలను సాకుగా చూపిస్తూ వచ్చే నెల భారత్- శ్రీలంక వేదికగా జరగబోయే టీ20 ప్రపంచకప్ నుంచి బంగ్లాదేశ్ తప్పుకుంది. రెండు రోజుల క్రితం బీసీసీఐ సూచనల మేరకు బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ కేకేఆర్ విడుదల చేసింది.
ఈ నిర్ణయం నేపథ్యంలో భద్రతా సమస్యలు, ప్రభుత్వ సలహాల కారణంగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ) ఆదివారం తన జాతీయ జట్టును వచ్చే నెలలో జరిగే టీ20 ప్రపంచకప్ కోసం భారతదేశానికి పంపకూడదని నిర్ణయించింది.
శనివారం రెహమాన్ విడుదల చేయాలనే నిర్ణయంతో బంగ్లాదేశ్ ఆగ్రహంగా ఉంది. రెండు దేశాల మధ్య ప్రస్తుత సంబంధాలను బీసీసీఐ స్పష్టంగా ఉదహరించినప్పటికీ చుట్టూ జరుగుతున్న దానివల్ల ఈ చర్య జరిగిందని తెలుస్తోంది.
ఐపీఎల్ నుంచి బంగ్లాదేశ్ పేసర్ రెహమాన్ నాటకీయంగా బహిష్కరించబడిన నేపథ్యంలో రాత్రి బీసీబీ అత్యవసరం సమావేశం ఏర్పాటు చేసింది. ఒక రోజు తరువాత బోర్డు మళ్లీ సమావేశమై ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభమయ్యే టీ20 ప్రపంచకప్ కోసం జాతీయ జట్టు భారత్ కు వెళ్లకూడదని ప్రకటించింది.
‘‘గత 24 గంటల్లో జరిగిన పరిణామాలను పరిగణలోకి తీసుకుని భారత్ లో జరగబోయే మ్యాచ్ లలో బంగ్లాదేశ్ జాతీయ జట్టు పాల్గొనడం చుట్టూ ఉన్న మొత్తం పరిస్థితులపై బోర్డు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది’’ అని బీసీబీ ఒక ప్రకటనలో తెలిపింది.
‘‘భారత్ లో బంగ్లాదేశ్ జట్టు భద్రతకు సంబంధించిన పెరుగుతున్న ఆందోళనలు, ప్రస్తుత పరిస్థితి అంచనా వేసిన తరువాత బంగ్లాదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చిన సలహాలను పరిగణలోకి తీసుకుని బంగ్లా జట్టును భారత్ కు పంపకూడదని నిర్ణయించుకున్నాం.’’ అని తెలిపింది. ఐసీసీ ఈ సమస్యను పరిష్కరించాల్సి ఉంటుందంది.
వేదిక మార్పు..
పాకిస్తాన్ తో ఒప్పందం లాగానే బంగ్లాదేశ్ కూడా తమ అన్ని మ్యాచ్ లను అతిథ్య దేశమైన శ్రీలంక కు మార్చాలని కోరుతోంది. ‘‘ఈ నిర్ణయం నేపథ్యంలో బంగ్లాదేశ్ అన్ని మ్యాచ్ లు మరో ఆతిథ్య దేశమైన శ్రీలంకకు మార్చాలని బీసీబీ అధికారికంగా ఐసీసీని అభ్యర్థించింది’’ అని తెలిపింది.
ఐపీఎల్ ప్రసారాలు నిలిపివేత..
బంగ్లాదేశ్ లో ఐపీఎల్ ప్రసారాలు నిలిపివేయాలని బంగ్లాదేశ్ ప్రసార మంత్రిత్వ శాఖ సలహ కోరినట్లు ప్రభుత్వ సలహదారు నజ్రుల్ చెప్పారు. ‘‘బంగ్లాదేశ్ లో ఐపీఎల్ ప్రసారాన్ని కూడా నిలిపివేయాలని నేను సమాచార, ప్రసార సలహదారుని అభ్యర్థించాను.
బంగ్లాదేశ్ క్రికెట్, క్రికెటర్లు లేదా బంగ్లాదేశ్ ను అవమానించడాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో సహించము. బానిసత్వ రోజులు ముగిశాయి’’ అని ఆయన అన్నారు. ఢాకాలో జరిగిన మాజీ ప్రధాని ఖలీదా జియా అంత్యక్రియల తరువాత భారత్- బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు మెరుగుపడుతున్న సూచనలు కనిపించాయి. కానీ రెహమాన్ విడుదలతో అపనమ్మకం మళ్లీ చోటు చేసుకుంది.
‘‘భారత్, బంగ్లాదేశ్ పర్యటన షెడ్యూల్ ను బీసీబీ ప్రకటించింది. ఎందుకంటే అక్కడ సానుకూల భావన ఉంది. కానీ ఇప్పుడు ముస్తాఫిజుర్ ఒప్పందం ఎందుకు రద్దు చేశారో భారత క్రికెట్ బోర్డు నుంచి అధికారిక నిర్ధారణ కావాలి’’ అని బీసీబీ వర్గాలు జాతీయ మీడియాకు తెలిపాయి.
Next Story

