
వెస్టిండీస్ అద్భుతమైన వ్యూహాన్ని భారత్ ఛేదించగలదా ?
మొదటి 8 ఓవర్లలో వికెట్లు పోగొట్టుకోకుండా కాపాడుకుంటున్న వెస్టెండీస్ చివరి 12 ఓవర్లో ఊహించని విధంగా విరుచుకుపడుతోంది
ఇపుడు జరుగుతున్న టీ20 టోర్నమెంటులో ఒక విషయం చాలా స్పష్టంగా కనబడుతోంది. అదేమిటంటే వెస్టిండీస్ జట్టు అద్భుతమైన వ్యూహంతో మ్యాచులను గెలుస్తోంది. దక్షిణాఫ్రికాతో ఓడిపోయిన మ్యాచ్ లో కూడా తన అద్భుతమైన బ్యాటింగ్ వ్యూహంతో ప్రత్యర్ధిని వణికించేసింది. అలాంటి అద్భుతమైన వెస్టిండీస్ వ్యూహాన్ని భారత్ విజయవంతంగా ఛేదించగలిగితేనే గెలవగలదు. మంచి ఊపుమీదున్న వెస్టిండీస్ జట్టును భారత్ జట్టు అడ్డుకోగలదా ? వ్యూహాన్ని ఛేదించగలదా ? అన్నదే ఇపుడు కీలకమైంది.
ఇంతకీ వెస్టిండీస్ అమలుచేస్తున్న, విజయాలు సాధిస్తున్న అద్భుతమైన వ్యూహం ఏమిటి ? రెండు రకాల వ్యూహాలను వెస్టిండీస్ జట్టు అమలుచేస్తోంది అదేమిటంటే మొదటిది 20 ఓవర్ల మ్యాచ్ లో మొదటి 8 ఓవర్లను జాగ్రత్తగా ఆచితూచి ఆడటం. బ్యాట్స్ మెన్ వీలైనంత జాగ్రత్తగా ఆడుతు వికెట్లను పోగొట్టుకోకుండా ప్రత్యర్ధిని ఇబ్బంది పెట్టడం. అవసరమైతే మంచి బంతులను గౌరవించటం. అంటే బౌలర్ మంచి బంతులను విసిరినపుడు అవి లైన్ అండ్ లెగ్త్ లో ఉంటే విచక్షణా రహితంగా ఆడటం కాకుండా జాగ్రత్తగా ఎదుర్కోవటమే.
భారీ షాట్లకు పోకుండా జాగ్రత్తగా అంటే ఒకటి, రెండు పరుగులు చేయటం వల్ల బౌలర్లు, ఫీల్డర్లలో అసహనం పెరిగిపోతుంది. అలాగే చెత్త బంతులను వీలున్నంతలో బౌండరీలు కొట్టడమే కాకుండా బౌండరీలకు అవతల పడేట్లు కొట్టడమే. ఈ విధంగా మొదటి 8 ఓవర్లలో వికెట్లు పోగొట్టుకోకుండా కాపాడుకుంటున్న వెస్టెండీస్ చివరి 12 ఓవర్లో ఊహించని విధంగా విరుచుకుపడటం రెండో వ్యూహం.
బ్యాటింగే వెస్టిండీస్ బలం
వెస్టిండీస్ జట్టు ప్రధాన బలం ఏమిటంటే బలమైన బ్యాటింగ్. బౌలర్లు వేరు బ్యాట్స్ మెన్ వేరుగా ఉండరు ఈ జట్టులో. వెస్టిండీస్ జట్టులోని 11 మందిలో దాదాపు 9 మంది బౌలింగ్ చేయగలరు అలాటే బ్యాట్ తో విరుచుకపడగలరు. మొదటి 8 ఓవర్లలో ఆచితూచి బ్యాటింగ్ చేసిన బ్యాట్స్ మెన్ చివరి 12 ఓవర్లలో మాత్రం ఆకాశమేహద్దుగా చెలరేగిపోతున్నారు. ఒకరు కాకపోతే మరొక బ్యాట్స్ మెన్ అన్నట్లుగా 9 మందిలో కనీసం ఐదుగురు బ్యాట్స్ మెన్ రెచ్చిపోయి ఆడుతున్నారు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్ లో ఒకదశలో 83 పరుగులకు 7 వికెట్లు కోల్పోయినా చివరకు 176/8 వికెట్లతో మ్యాచ్ ను ముగించింది. దీంతోనే బ్యాట్స్ మెన్ లోని పరుగులు చేయాలన్న కసి ఎంతుందో అర్ధమవుతోంది. వీరిలో హెట్ మెయిర్ కీలకమైన బ్యాట్స్ మెన్ అనటంలో సందేహంలేదు.
6 మ్యాచ్ లు ఆడిన షిమ్రెన్ హెట్ మెయిర్ 221 పరుగులు చేసి మంచి ఊపుమీదున్నాడు. అలాగే ఇంగ్లాండ్ లో 76 పరుగులతో అజేయంగా నిలిచిన షెర్ఫేన్ రూథర్ ఫర్డ్, ఆడిన ఒక మ్యాచ్ లో 59 పరుగులు చేసిన రోమాన్ పోవెల్, ఒక మ్యాచ్ ఆడి 75 పరుగులు చేసిన షై హోప్ కూడా భయంకరమైన బ్యాట్స్ మెన్ అనే చెప్పాలి. వెస్టిండీస్ బ్యాట్స్ మెన్ లో ఎప్పుడు ఎవరు ఎలాగ రెచ్చిపోయి ఆడుతారో ఎవరూ ఊహించలేరు. అలాగే బౌలర్లలో జేసన్ హోల్డర్ 3 మ్యాచ్ లు ఆడి 7 వికెట్లు, రొమారియో షెపర్డ్ 2 మ్యాచ్ లు ఆడి 6 వికెట్లతో నిలకడైన బౌలింగ్ చేస్తున్నారు.
వ్యూహాత్మకంగా ఆడితేనే
ఇక భారత్ జట్టును చూస్తే ఎప్పుడెవరు ఎలాగ ఆడుతారో చెప్పటం కష్టమే. ఓపెనర్లు అభిషేక్ శర్మ వరుసగా మూడు మ్యాచ్ లో డకౌట్ అయి మొన్నటి జింబాబ్వే జట్టుపైన 50 పరుగులు చేశాడు. అలాగే సంజూ శాంసన్ మొదటి మ్యాచ్ లో 30+ పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అలాగే సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివందుబే కూడా హార్డ్ హిట్టర్లే అనటంలో సందేహంలేదు. వీరికి అక్షర్ పటేల్ మద్దతుగా నిలవగలడు. అయితే పైన చెప్పిన బ్యాట్స్ మెన్లలో కనీసం నలుగురు నిలబడి గట్టిగా ఆడితేనే భారత్ గౌరప్రదమైన స్కోరు చేయగలదు. ఇక బౌలర్లలో పోయిన మ్యాచ్ లో బుమ్రా, అర్షదీప్ సింగ్, హార్దిక్, వరుణ్ చక్రవర్తి పరమచెత్తగా బౌలింగ్ చేశారు. 3 వికెట్లు తీసినా అర్షదీప్ బౌలింగ్ ఏమాత్రం బావోలేదు.
వికెట్లు తీయకపోయినా పర్వాలేదు లైన్ అండ్ లెగ్త్ తో బౌలింగ్ చేయగలిగితే అంతేచాలు. ఎప్పుడైతే బౌలర్లు జాగ్రత్తగా బౌలింగ్ చేస్తారో అప్పుడే ప్రత్యర్ధి జట్టులో అసహనం పెరిగిపోతుంది. ఆ అసహనంలోనే ప్రత్యర్ధి బ్యాటర్లు ఇష్టం వచ్చినట్లు ఆడి వికెట్లు పోగొట్టుకునే అవకాశముంది. కాబట్టి మంచి ఫీల్డింగ్ చేయటమే కాకుండా వెస్టిండీస్ జట్టులో బౌలర్లను జాగ్రత్తగా ఎదుర్కుంటు, బ్యాట్స్ మెన్ ను కూడా జాగ్రత్తగా బౌలింగ్ తో కట్టడి చేయగలిగితేనే ఇండియా జట్టు విజయం సాధించగలదు.

