
మెస్సీ, ఆయన అభిమానులకు క్షమాపణ చెప్పిన పశ్చిమ బెంగాల్ సీఎం మమత
"చీకటి రోజు"గా అభివర్ణించిన గవర్నర్ సివి ఆనంద బోస్.
పశ్చిమ బెంగాల్(West Bengal) సీఎం మమతా బెనర్జీ(CM Mamata Banerjee) అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ(Lionel Messi)కి, ఆయన అభిమానులకు బహిరంగ క్షమాపణ చెప్పారు.
‘గోట్ టూర్ ఆఫ్ ఇండియా’ లో భాగంగా శనివారం తెల్లవారుజామున మెస్సీతో పాటు ఆయన సహచర ఆటగాళ్లు రోడ్రిగో డిపాల్, లూయిస్ సువారెజ్ విమానంలో కోల్‌కతాకు చేరుకున్నారు. ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో స్టే చేశాక ఉదయం 11.30 గంటల ప్రాంతంలో సాల్ట్ లేక్ స్టేడియానికి చేరుకున్నారు. అప్పటికే మెస్సీ చుట్టూ నిర్వాహక కమిటీ బృందం గుమిగూడడంతో వారి మధ్యలో మెస్సీ కనిపించలేదు. దీంతో స్టేడియంలో ప్రేక్షకులు "మాకు మెస్సీ కావాలి" అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో క్రీడాకారుల చుట్టూ భద్రతా సిబ్బంది రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశారు. ప్రేక్షకులు శాంతంగా ఉండాలని క్రీడామంత్రి అరూప్ బిశ్వాస్, ఈవెంట్ ముఖ్య నిర్వాహకుడు శతద్రు దత్తా కోరినా పరిస్థితి అదుపులోకి రాలేదు. కొంతమంది అభిమానులు కుర్చీలను ధ్వంసం చేసి గ్రౌండ్‌లోకి విసిరారు. వాటర్ బాటిళ్లను విసిరారు. బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్, క్రికెటర్ సౌరవ్ గంగూలీ వచ్చే ముందు ఉదయం 11.52 గంటలకు మెస్సీని మైదానం నుంచి బయటకు తీసుకెళ్లారు. ఉన్నట్టుండి మెస్సీని మైదానం నుంచి బయటకు తీసువెళ్లడం ప్రేక్షకులకు ఆగ్రహాన్ని తెప్పించింది. రూ. 12వేలు చెల్లించి టికెట్ కొన్నా.. ఫుట్‌బాల్ దిగ్గజాన్ని చూడలేకపోయామన్న అసంతృప్తి వారి కళ్లల్లో కనిపించింది. మెస్సీ కోలకతాకు రావడం ఇది రెండోసారి. 14 సంవత్సరాల క్రితం తొలిసారి వచ్చారు.
గందరగోళంపై విచారణకు ఆదేశం..
టీఎంసీ చీఫ్ మమతా లియోనెల్ మెస్సీ, అతని అభిమానులకు బహిరంగ క్షమాపణలు చెప్పారు. స్టేడియంలో పరిస్థితిని "నిర్వహణలో లోపం"గా అభివర్ణించారు. "సాల్ట్ లేక్ స్టేడియంలో ఈరోజు జరిగిన ఘటన నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనకు లియోనెల్ మెస్సీతో పాటు క్రీడా ప్రియులకు ఆయన అభిమానులందరికీ నేను హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాను" అని సీఎం మమతా పేర్కొన్నారు.
'చీకటి రోజు'గా అభివర్ణించిన గవర్నర్..
జరిగిన ఘటనను "చీకటి రోజు"గా అభివర్ణించారు గవర్నర్ సివి ఆనంద బోస్. ఈవెంట్ నిర్వాహకుడు శతద్రు దత్తాను అరెస్టు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. ప్రభుత్వం, పోలీసుల భద్రతా వైఫల్యాన్ని ఆయన తప్పుబట్టారు. సాల్ట్ లేక్ స్టేడియంలో మెస్సీని కలవాల్సిన ముఖ్యమంత్రి మమతా మధ్యలోనే తిరిగి రావాల్సి వచ్చిందన్న విషయాన్ని విని గవర్నర్ షాక్ అయ్యారని లోక్ భవన్ అధికారి ఒకరు తెలిపారు.
"ముఖ్యమంత్రి మధ్యలో తిరిగి రావాల్సి రావడం తీవ్రమైన విషయం. దీనిపై వెంటనే విచారణ జరిపి, నిందితులను అరెస్టు చేయాలి" అని బోస్ చెప్పినట్టు అధికారి తెలిపారు.
మెస్సీ రాక సందర్భంగా క్రీడాభిమానులు ఆయనను స్టేడియంలో చూసేందుకు టిక్కెట్లను కొనుగోలు చేశారు. రూ. 12వేలు చెల్లించి టికెట్ కొన్నా.. ఫుట్‌బాల్ దిగ్గజాన్ని చూడలేకపోయామన్న అసంతృప్తిని వారు వ్యక్తపరిచారు. మెస్సీ కోలకతాకు రావడం ఇది రెండోసారి. 14 సంవత్సరాల క్రితం తొలిసారి వచ్చారు.

