ఎయిర్ ఇండియాపై క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఫైర్..
x

ఎయిర్ ఇండియాపై క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఫైర్..

బెంగళూరులో ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల ఆలస్యంగా నడిచిన విమానాలు..


Click the Play button to hear this message in audio format

ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ (David Warner) ఎయిర్ ఇండియా(Air India) సేవలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పైలట్ లేకుండానే ప్రయాణికులను విమానంలో ఎక్కించారని, గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చిందని శనివారం ఎక్స్‌లో ఆయన పోస్టు్ చేశారు.

"మమ్మల్ని పైలట్ లేని ఫ్లైట్‌లో ఎక్కించారు. గంటల తరబడి అందులోనే కూర్చుండిపోయాం. పైలట్ లేనిప్పుడు ప్రయాణికులను ఎక్కించడమేంటీ?" అంటూ ఎయిర్ ఇండియాను ట్యాగ్ చేశారు.

వార్నర్ ట్వీట్‌పై స్పందించిన ఎయిర్ ఇండియా..

"ప్రియమైన మిస్టర్ వార్నర్.. ఈ రోజు బెంగళూరు(Bengaluru)లో ప్రతికూల వాతావరణం కారణంగా చాలా విమానాలను దారి మళ్లించారు. అందువల్లే మీ విమానాన్ని నడిపే పైలెట్ రావడం ఆలస్యమైంది. అందుకే విమాన బయలుదేరడం కూడా ఆలస్యం అయింది. మీ సహనానికి కృతజ్ఞతలు, " అని రిప్లై పంపింది.

బెంగళూరులో భారీ వర్షం.

బెంగళూరులో శనివారం ఉదయం 8:30 నుంచి రాత్రి 8:30 వరకు భారీ వర్షం కురిసింది. 3.6 మిమి వర్షపాతం నమోదైంది. నగరంలో చెట్లు నేలకొరిగాయి, లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. బెంగళూరు రూరల్‌లోని హోసకోటలో వడగళ్ల వర్షం కురిసింది.

విమానాల దారి మళ్లింపు..

ప్రతికూల వాతావరణ పరిస్థితులు వల్ల 19 విమానాలను దారి మళ్లించారు. ఇందులో 11 ఇండిగో, 4 ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, 2 ఆకాసా, 2 ఎయిర్ ఇండియా విమానాలున్నాయి. పదికి పైగానే విమానాలు ఆలస్యమయ్యాయి.

IPLలో లేని వార్నర్..

గతేడాది జెడ్డాలో జరిగిన మెగా వేలంలో అమ్ముడుపోకపోవడంతో డేవిడ్ వార్నర్ 2025 ఐపీఎల్‌కు దూరంగా ఉన్నారు. అయినప్పటికీ భారత్‌లోనే ఉన్న ఆయనకు విమాన ప్రయాణంలో ఎదురైన ఇబ్బందిని ఎక్స్ వేదికగా పంచుకున్నారు.

అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితులున్నపుడు, తమకు సమాచారం ఇవ్వాలని కొంతమంది ప్రయాణికులు ఎయిర్ ఇండియాపై మండిపడుతున్నారు.

Read More
Next Story