ప్రముఖ ఐపీఎల్ ఫ్రాంచైజీ అయిన ఆర్సీబీని ఆదిత్య బిర్లా గ్రూప్ నేతృత్వంలోని కన్సార్టియం దాదాపు 1.78 బిలియన్ డాలర్ల( రూ. 16,600 కోట్లు)కు కొనుగోలు చేసింది. గత సంవత్సరం ఆర్సీబీ తొలిసారిగా ఐపీఎల్ టైటిల్ చేజిక్కించుకుంది. ఇప్పుడు ఈ ఫ్రాంచైజీకి ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార్ మంగళం బిర్లా కుమారుడైన ఆర్యమాన్ బిర్లా చైర్మన్ గా నియమితులయ్యారు.
ఆర్యమాన్ 28 ఏళ్ల వయసులోనే అత్యంత కీలకమైన పదవిని దక్కించుకున్నాడు. తను కూడా స్వయంగా ఓ ఐపీఎల్ క్రీడాకారుడు. అయితే 22 ఏళ్లకే తన రిటైర్ మెంట్ ప్రకటించి వార్తల్లో నిలిచాడు. నిజానికి, మధ్యప్రదేశ్ తరఫున ఎడమచేతి వాటం బ్యాటర్‌గా ఫస్ట్-క్లాస్, లిస్ట్ ఎ మ్యాచ్‌లు ఆడి, ఒక సెంచరీ కూడా సాధించిన ఆర్యమాన్, 2018లో రాజస్థాన్ రాయల్స్‌తో ఒప్పందం కుదుర్చుకుని రూ. 30 లక్షల ఐపీఎల్ కాంట్రాక్ట్‌ను పొందాడు. అయితే, అతను ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండా, మరుసటి ఏడాదే ఆటకు "నిరవధిక విరామం" తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
"నేను చిక్కుకుపోయినట్లు భావించాను. ఇప్పటివరకు అన్ని రకాల బాధలను తట్టుకుని ముందుకు సాగాను, కానీ ఇప్పుడు నా మానసిక ఆరోగ్యం, శ్రేయస్సుకు అన్నింటికన్నా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందనిపిస్తోంది," అని ఆర్యమాన్ అప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకున్నాడు.
‘‘నా అన్వేషణలలో ఒక లక్ష్యాన్ని వెతుక్కోవడానికి ఈ సమయాన్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నాను." అని చెప్పుకొచ్చాడు. మాజీ క్రికెటర్ అయిన బిర్లా ఇప్పుడు కోహ్లీ లాంటి ప్రపంచ స్టార్ ఆటగాళ్లు ఆ జట్టులో ఉన్నారు. ఆర్‌సిబి యాజమాన్యంలో భారీ మార్పులు చోటుచేసుకున్న నేపథ్యంలో, ఆర్యమాన్ ఇప్పుడు తిరిగి వచ్చారు. కేవలం క్రికెట్‌కే పరిమితం కాకుండా వ్యాపారం, వారసత్వానికి కూడా సంబంధించిన నాయకత్వ పాత్రను చేపట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు.
ఆర్యమాన్ బిర్లా గురించి
పూర్తి పేరు ఆర్యమాన్ విక్రమ్ బిర్లా అయిన ఆర్యమాన్, దేశంలోని అత్యంత ప్రముఖ వ్యాపార కుటుంబాలలో ఒకటైన బిర్లా గ్రూప్ కుటుంబ సభ్యుడు. ఆయనకు కార్పొరేట్ ప్రపంచం కొత్తేమీ కాదు. 1857 నాటి చరిత్ర కలిగిన ఆదిత్య బిర్లా గ్రూప్‌కు చెందిన ఫ్యాషన్, పెయింట్స్, రియల్ ఎస్టేట్ వంటి అనేక వ్యాపారాలలో ఆయన నాయకత్వ పాత్రలు పోషించారు. ఆయన ఆ బహుళ వ్యాపార సంస్థ అత్యున్నత సంస్థ అయిన ఆదిత్య బిర్లా మేనేజ్‌మెంట్ కార్పొరేషన్‌లో సభ్యుడు.
బిర్లా వారసుడు గ్రాషిమ్ ఇండస్ట్రీస్, ఆదిత్య బిర్లా ఫ్యాషన్ & రిటైల్, దాని డిజిటల్-ఫస్ట్ ఫ్యాషన్ ప్లాట్‌ఫామ్ అయిన TMRW వంటి గ్రూప్‌కు చెందిన అనేక కీలక కంపెనీల బోర్డులలో కూడా సభ్యుడిగా ఉన్నారు. దేశీయ క్రికెట్‌లో 450 పరుగులు చేసి, స్పిన్ బౌలింగ్ చేసిన ఆర్యమాన్, కంపెనీ హాస్పిటాలిటీ ప్లాట్‌ఫామ్ అయిన 'ఆదిత్య బిర్లా న్యూ ఏజ్ హాస్పిటాలిటీ'ని, వివిధ అభివృద్ధి చెందుతున్న రంగాలలో వేగంగా అభివృద్ధి చెందుతున్న స్టార్టప్‌లలో పెట్టుబడులపై దృష్టి సారించే దాని వెంచర్ క్యాపిటల్ విభాగం అయిన 'ఆదిత్య బిర్లా వెంచర్స్'ను స్థాపించారు.
కొన్ని నివేదికల ప్రకారం అతని సంపద సుమారు రూ. 70,000 కోట్లుగా అంచనా ఉంది. ఆర్యమాన్ హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి ఆనర్స్‌తో ఎంబిఏ పూర్తి చేయడంతో పాటు, యూకేలోని బేస్ బిజినెస్ స్కూల్ నుంచి గ్లోబల్ ఫైనాన్స్‌లో మాస్టర్స్ డిగ్రీని కూడా పొందారు. ఆయన ముంబై విశ్వవిద్యాలయం నుంచి కామర్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ కూడా పొందారు.
ఆర్సీబీని తదుపరి దశకు..
ఆర్‌సిబి చీఫ్‌గా తన కొత్త పాత్రను చేపట్టిన తర్వాత, ఆర్యమాన్ పత్రికా ప్రకటన ఇచ్చారు. “ఆర్‌సిబి తదుపరి వృద్ధి దశకు రూపకల్పన చేయడానికి ఈ భాగస్వామ్యంలో కలిసి రావడం ఒక గౌరవం. ఈ భాగస్వామ్యం క్రీడలు, మీడియా, వినియోగదారు వ్యాపారాలపై లోతైన అవగాహనను ఒకచోట చేర్చుతుంది. కలిసి, మనం పిచ్‌పై, సమాజంలో ఆర్‌సిబిని ఈ స్థాయికి తీసుకువచ్చిన అభిమానుల కోసం 'ప్లే బోల్డ్'ను కొనసాగిస్తాము.” అన్నారు.
ఫ్రాంచైజీ వ్యవహారాల్లో ఆ వారసుడి ప్రమేయం చూస్తుంటే, అతను లక్షల కోట్ల రూపాయల విలువైన తన కంపెనీకి తదుపరి తరం నాయకత్వాన్ని సిద్ధం చేయడమే కాకుండా, 2025లో సంచలనాత్మక టైటిల్ విజయం తర్వాత ఆర్‌సిబిని తదుపరి స్థాయికి తీసుకెళ్లాలని కూడా చూస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్యమాన్ ఆర్‌సిబి ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించడంలో ఒక ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, మధ్యప్రదేశ్ జట్టులో అతని మాజీ సహచరులైన రజత్ పాటిదార్, వెంకటేష్ అయ్యర్, ఆటగాళ్లుగా అదే పాత్రలలో కాకపోయినా, ఆర్‌సిబిలో అతనితో తిరిగి కలుస్తారు.