Asia Cup Finale | గెలిచినా టీమిండియా కప్ తీసుకోదా..!
x

Asia Cup Finale | గెలిచినా టీమిండియా కప్ తీసుకోదా..!

పాక్‌ను తేలికగా తీసుకోవద్దని టీమిండియాను హెచ్చరించిన వెటరన్ ప్లేయర్.


ఈసారి ఆసియా కప్ ఫైనల్స్‌ నెవ్వర్ బిఫోర్ అనేలా ఉండనుంది. 41ఏళ్ల ఆసియా కప్ టోర్నీ హిస్టరీలో తొలిసారి దాయాది దేశాలయిన భారత్, పాకిస్థాన్.. ట్రోఫీ కోసం తలపడనున్నాయి. అయితే ఇప్పుడు ఈ మ్యాచ్‌‌లో భారత్ గులుస్తుందా అన్నదానికంగా గెలిచినా ట్రోఫీని స్వీకరిస్తుందా? లేదా? అనేది అత్యంత ఉత్కంఠ రేపుతోంది. దీనిపైన సోషల్ మీడియా వేదికగా భారీ భారీ డిబేట్‌లు కూడా నడుస్తున్నాయి. అందుకు కారణం కూడా బలమైనదే ఉంది. అదేంటంటే ఆసియా కప్ విజేతకు ట్రోఫీని ఆసియా క్రికెట్ కౌన్సిల్(ACC) అధ్యక్షుడు మోసిన్ నఖ్వీ అందిస్తారన్న వార్తలు. ఆయన ట్రోఫీని అందిస్తే భారత జట్టు దానిని స్వీకరిస్తుందా? లేదా.. నిరాకరించి ట్రోఫీ లేకుండా కేవలం విజేతలుగానే బయటకు వస్తుందా? అనేది ప్రస్తుతం అత్యంత కీలకంగా మారింది. అంతేకాకుండా అనేక చర్చలకు కూడా దారితీస్తోంది.

బీసీసీఐ నిర్ణయమేంటి..

ఆసియా కప్ 2025 ట్రోఫీని విజేతలకు తానే ఇస్తానంటూ ఏసీసీ అధ్యక్షుడు మోసిన్ నఖ్వీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారుతున్నాయి. పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ చీఫ్‌ కూడా ఆయనే. భారత్, పాక్ మధ్య వాతావరణం ప్రస్తుతం ఏమంతబాగాలేదు. ఈ రెండు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్ సందర్బంగా పాక్ ఆటగాళ్లకు భారత ప్లేయర్స్ కరచాలనం ఇవ్వకపోవడం ఎంత పెద్ద వివాదంగా మారిందో అందరికీ తెలుసు. రెండో మ్యాచ్ తర్వాత కూడా రెండు జట్ల మధ్య వాతావరణం మరింత వేడెక్కింది. ఒకరిపై ఒకరు పరస్పరం ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. వీటన్నింటితో పాటుగా పాక్ కెప్టెన్ సల్మాన్ అఘాతో కలిసి ఫొటో షూట్‌కు కూడా భారత్ నో చెప్పింది. అలాంటిది ఇప్పుడు మోసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరిస్తుందా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

అయితే ఈ అంశంపై బీసీసీఐ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు. కాగా నఖ్వీతో కలిసి వేదికను పంచుకోకూడదన్న ఆలోచనలోనే భారత్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఇంకా కొన్ని గంటల సమయమే ఉన్న క్రమంలో ఏం జరుగుతుందో? అన్న టెన్షన్ ఆడియన్స్‌లో పెరిగిపోతోంది.

పట్టు ఒకరిది.. పరువు ఇంకొకరిది..

టీమిండియా, పాకిస్థాన్ జట్ల మధ్య జరగనున్న ఈ ఫైనల్ అత్యంత రసవత్తరంగా మారడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో ఈ మ్యాచ్‌లో గెలవడం ఒకరికి పట్టు, ఆధిపత్యం నిరూపించుకోవడం అయితే మరొకరికి పరువు నిలబెట్టుకోవడం. అయితే ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే వాతావరణం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. టోర్నీలో దాయాదుల మధ్య జరిగే ప్రతి మ్యాచ్ కూడా ఫైనల్స్‌ను తలపిస్తాయి. అలాంటిది ఈ టోర్నీలో భారత్, పాక్ ఇప్పటికి రెండు సార్లు తలపడ్డాయి. వాటిలో రెండు సార్లు కూడా భారత్ విజయం సాధించింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఫైనల్స్‌లో తలపడనున్నాయి. దీంతో ఈ మ్యాచ్‌లో కూడా విజయం సాధించి పట్టు సాధించడమే కాకుండా పాక్‌పై హ్యాట్రిక్ విజయం నెలకొల్పాలని టీమిండియా భావిస్తోంది.

అదే సమయంలో ఈ మ్యాచ్‌లో గెలిచి పరువు కాపాడుకోవాలని పాక్ అనుకుంటుంది. అంతేకాకుండా లీగ్, సూపర్ 4 మ్యాచ్‌లలో ఓడించడం కాదు.. ఫైనల్స్ ఓడిస్తే ఆ కిక్కే వేరే ఉంటుందని కూడా పాక్ భావిస్తోంది. ఈ ఫైనల్స్‌లో గెలవడం ద్వారా భారత్‌కు తమ సత్తా చూపాలని కూడా పాక్ జట్టు వ్యూహాలు రచిస్తోంది.

క్రిక్కిరిసిన దుబాయ్ స్టేడియం..

ఆసియా కప్ ఫైనల్స్‌లో తొలిసారి దాయాది దేశాలు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌ను వీక్షించడానికి ప్రేక్షకులు భారీ సంఖ్యలో రెడీ అయ్యారు. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటికే రెండు మ్యాచ్‌లు జరిగినా.. వాటిలో వేటికీ రానంత అధిక సంఖ్యలో ఆడియాన్స్ ఈ ఫైనల్స్ చూడటానికి వస్తున్నారు. దుబాయ్ స్టేడియం కెపాసిటీ 28వేల సీట్లు. ఇప్పటికే స్టేడియం హౌస్ ఫుల్ కూడా అయిపోయింది. గత రెండు మ్యాచ్‌లకు మాత్రం ఇంత స్థాయిలో ప్రేక్షకులు రాలేదు. గ్రూప్ దశలో జరిగిన మ్యాచ్‌కు 20వేల మంది ప్రేక్షకులు వస్తే, సూపర్ 4లో భారత్, పాక్ మధ్య జరిగిన మ్యాచ్‌కు ప్రేక్షకుల సంఖ్య 17వేలకు పడిపోయింది. అలాంటిది ఇప్పుడు మాత్రం స్టేడియం హౌస్ ఫుల్ అయిపోయి ప్రేక్షకులతో క్రిక్కిరిసింది.

పాక్‌ను తేలికగా తీసుకోవద్దు: మాంటీ పనేసర్

భారత్, పాక్ మధ్య జరగనున్న హైఓల్టేజ్ మ్యాచ్‌పై ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ స్పందించారు. హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్న భారత్‌కు అతడు కీలక సూచనలు చేశారు. పాక్‌ను తక్కువ అంచనా వేయొద్దని హెచ్చరించాడు. ఇప్పటి వరకు రెండుసార్లు విజయం సాధించినా.. ఫైనల్స్‌లో అంతా తలకిందులు అయ్యే అవకాశం లేకపోలేదని అన్నాడు. ‘‘పాక్ చాలా డేంజరస్ టీమ్. ఈ మ్యాచ్‌లో ఓడిపోయినా వాళ్లకు పోయేదేమీ లేదు. కానీ భారత్‌కు అలా కాదు. ఇప్పటి వరకు టోర్నీలో ఓటమి అంటే తెలియని జట్టుగా టాప్‌కు వచ్చింది. ఈ మ్యాచ్‌లో పాక్ తన సర్వశక్తులు ఒడ్డిపోరాడే అవకాశాలు ఉన్నాయి. దానిని భారత్ గుర్తుంచుకోవాలి’’ అని చెప్పారు.

అంతేకాకుండా పాక్ ఇప్పుడు కాస్తంత బలహీనపడి ఉన్నా.. భారత్‌ను ఓడించలేనంత స్థితిలో అయితే లేదు అన్నాడు. కాబట్టి ఏం కాదులే, విజయం మనదే అన్నట్లు భారత్ ఉండకూడదని, చాలా అంటే చాలా అప్రమత్తంగా ఉండాలని టీమిండియాకు మాంటీ హితబోధ చేశాడు.

టీమిండియా: సూర్యకుమార్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య, శివమ్ దూబె, జితేశ్ శర్మ, అక్షర్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్షదీప్ సింగ్, కుల్‌దీప్ యాదవ్, సంజూ శాంసన్, హర్షిత్ రాణా, రింకూ సింగ్

పాక్ టీం: సల్మాన్ అలీ ఆఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రాఫ్, ఫకార్ జమాన్, హారిస్ రవూఫ్, హసన్ అలీ, హసన్ నవాజ్, హుస్సెయిన్ తలాత్, ఖుష్ది్ల్ షా, మొహమ్మద్ హ్యారిస్, మొహమ్మద్ నవాజ్, మొహమ్మద్ వసీమ్, సాహిబ్‌జాదా ఫర్హాన్, సయిమ్ అయూబ్, సల్మాన్ మిర్జా, షాహీన్ అఫ్రీదీ, సూఫియాన్ మొకీమ్.

Read More
Next Story