మరోసారి ప్రైజ్ మనీ వదులుకున్న ద్రావిడ్.. ఎందుకంటే..
x

మరోసారి ప్రైజ్ మనీ వదులుకున్న ద్రావిడ్.. ఎందుకంటే..

భారత్ వరల్డ్ కప్ గెలవడంతో బీసీసీఐ రూ. 125 కోట్ల భారీ ప్రైజ్ మనీని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ద్రావిడ్ తనకు బీసీసీఐ ఇచ్చే రూ. 5 కోట్ల మొత్తంలో..


భారత హెడ్ కోచ్ గా వ్యవహరించి దశాబ్దం తరువాత ఐసీసీ ట్రోఫి గెలవడంలో కీలక పాత్ర వహించిన ద్రావిడ్ మరో నిర్ణయం తీసుకున్నాడు. తనకు బీసీసీఐ ప్రకటించిన రూ. 5 కోట్ల ప్రైజ్ మనీలో సగం వదులుకోవడానికి సిద్దపడ్డాడు. తన సహచర కోచ్ లు రూ. 2.5 కోట్లు మాత్రమే రావడంతో తనకు కూడా అంతే మొత్తంలో ఇవ్వాలని కోరారు.

17 సంవత్సరాల విరామం తర్వాత టీ20 టైటిల్‌ను కైవసం చేసుకోవడంతో బీసీసీఐ రూ. 125 కోట్ల భారీ నజరానా ప్రకటించిన సంగతి తెలిసిందే. వీటిని 15 మంది ప్రధాన ఆటగాళ్లు, కోచ్ లు, సహాయక సిబ్బందికి పంచనున్నారు.
ప్రధాన కోచ్ ద్రవిడ్‌కు ₹5 కోట్లు, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్‌లకు ఒక్కొక్కరికి ₹2.5 కోట్లు అందుకుంటారని తెలిసింది. ఆటగాడిగా తనకు తానుగా ఉన్నత ప్రమాణాలు ఏర్పరచుకున్న రాహుల్ ద్రవిడ్, ఆటగాడిగా కెరీయర్ ముగిసిన తరువాత కూడా జట్టులోని ఇతర కోచ్‌ల మాదిరిగానే తనకు కూడా బోనస్ ఇవ్వడానికి ఇష్టపడతానని క్రికెట్ బోర్డుకు నివేదించినట్లు సమాచారం. ఆయన మనోభావాలను గౌరవించాలని బోర్డు నిర్ణయించింది.
ద్రవిడ్ ఇలా చేయడం ఇదే తొలిసారి కాదు. 2018లో, అతను ప్రపంచ కప్ గెలిచిన U-19 భారత జట్టుకు ప్రధాన కోచ్‌గా ఉన్నాడు. BCCI ద్రవిడ్‌కు ₹50 లక్షలు, ఇతర సహాయక సిబ్బందికి ₹20 లక్షల బోనస్‌ను ప్రకటించింది. ఆ సందర్భంలో కూడా, "జెంటిల్‌మన్ క్రికెటర్" మిగిలిన సహాయక సిబ్బంది కంటే ఎక్కువ బోనస్‌ని తీసుకోవడానికి నిరాకరించాడు. తదనంతరం, ద్రవిడ్‌తో సహా సహాయక సిబ్బందికి బీసీసీఐ ఒక్కొక్కరికి ₹25 లక్షలు ప్రదానం చేసింది.
ద్రావిడ్ కోచ్ గా ప్రయాణం ముగించాడు. రెండున్నర సంవత్సరాలుగా ఆయన భారత క్రికెట్ జట్టును ఉన్నత శిఖరాలు తీసుకెళ్లాడు. టెస్ట్ ఛాంపియన్ షిప్, 2023 వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమి తరువాత కోచ్ గా తన పదవిని వదులుకోవడానికి సిద్ధపడ్డారు. కానీ బీసీసీఐ ద్రావిడ్ ను టీ20 వరల్డ్ కప్ వరకూ కొనసాగాలని కోరింది. అందుకు తగ్గట్లుగా ఆయన ఆటగాడిగా తను అందుకోలేకపోయిన వరల్డ్ కప్ ను కోచ్ గా అందుకున్నాడు. తాజాగా భారత హెడ్ కోచ్ గా గౌతం గంభీర్ బాధ్యతలు చేపట్టారు.


Read More
Next Story