
ఇండియా గెలవాలని అభిమానుల హోమాలు
మ్యాచ్ లో ఎవరు ఎప్పుడు ఎలాగ ఆడుతారో ఎవరూ ఊహించనుకూడా లేరు
టీ20 ఛాంపియన్ షిప్పులో ఇండియా జట్టు గెలవాలని అభిమానులు హోమాలు చేస్తున్నారు. ఆదివారం రాత్రి అహ్మదాబాద్ స్టేడియంలో న్యూజిల్యాండ్ తో టీ20 టోర్నమెంటు ఫైనల్ మ్యాచ్ జరగబోతున్న విషయం తెలిసిందే. రాత్రి 7 గంటలకు మొదలవబోతున్న ఫైనల్ మ్యాచ్ విషయంలో అభిమానుల్లో ఆసక్తి పెరిగిపోతోంది. అందుకనే వరంగల్ నగరంలోని అభిమానులు ఫైనల్ మ్యాచ్ లో ఇండియా గెలవాలని ఉదయం నుండి హోమాలు చేస్తున్నారు. మామూలుగా ఇలాంటి పూజలు, హోమాలు, యాగాలంటు ఉత్తరభారతంలోనే చాలా హడావుడి కనబడుతుంటుంది. అలాంటిది ఇపుడు తెలంగాణలోని వరంగల్ నగరంలో కూడా హోమాల హడావుడి మొదలవ్వటం ఆశ్చర్యంగా ఉంది.
ఈ టోర్నమెంటులో ఇప్పటివరకు ఓటమి ఎరుగని జట్టుగా న్యూజిల్యాండ్ చరిత్ర సృష్టించింది. అలాంటి అజేయ జట్టును భారత జట్టు ఢీకొనబతోంది. రెండు జట్ల బలాబలాను భేరీజువేస్తే న్యూజిల్యాండ్ జట్టుదే పై చేయిగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కారణం ఏమిటంటే ఆ జట్టులోని బ్యాట్స్ మెన్, బౌలర్లలో సమతూకం కనబడుతోంది. బ్యాట్స్ మెన్ పని బ్యాట్స్ మెన్ చేస్తుంటే బౌలర్ల పని బౌలర్లు చేస్తున్నారు. న్యూజిల్యాండ్ ఫీల్డింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే న్యూజిల్యాండ్ ఫీల్డింగులో ఔట్ స్టాండింగ్ అని కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. టోర్నమెంటులో అత్యంత కఠినమైన ప్రత్యర్ధితో భారత్ ఢీ కొనబోతోంది.
దక్షిణాఫ్రికాను చాలా తేలికగా ఓడించిన కవీస్ జట్టులో ఓపెనర్లు ఫిన్ అలెన్, సీఫర్డ్ భీకరమైన ఫామ్ లో ఉన్నారు. వీళ్ళని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఔట్ చేయకపోతే భారత్ బౌలర్లకు చుక్కలు కనబడటం ఖాయం. వీళ్ళకు తోడు రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్ మన్, మిషెల్ తో బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. అలాగే బౌలర్లు కెప్టెన్ శాంటర్న్, హెన్రీ, ఫెర్గూసన్, మెకన్సీ బ్రహ్మాండమైన ఫామ్ లో ఉన్నారు. ఇక ఆల్ రౌండర్లు డఫీ, పేస్, నీషమ్ ఎలాగూ అదరగొడుతున్నారు.
ఇక, భారత్ విషయం చూస్తే బ్యాట్స్ మెన్లలో ఎప్పుడు ఎవరు పరుగులు చేస్తారో కూడా తెలీదు. ఓపెనర్ అభిషేక్ శర్మ వరుసగా ఫెయిలవుతునే ఉన్నాడు. సంజూ శాంసన్ చివరి రెండు మ్యాచ్ లో అదరగొట్టాడు. అదే ఫామ్ కంటిన్యు అయితే సంతోషమే. అలాగే ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ బ్యాటింగులో స్ధిరత్వంలేదు. హార్డిక్ పాండ్యా, దుబె పర్యాలేదన్నట్లుగా ఆడుతున్నారు. కాని వీరిపైన పూర్తిగా నమ్మకం పెట్టుకునేందుకు లేదు. ఇక బౌలర్ల ఫామ్ కూడా అంతంతమాత్రంగానే ఉంది. అక్షర్ పటేల్ పర్వాలేదంతే. వరుణ్ చక్రవర్తి పూర్తిగా తేలిపోతున్నాడు. బుమ్రా పర్వాలేదు కాని అర్షదీప్ సింగ్ మరీ అన్యాయంగా బౌలింగ్ చేస్తున్నాడు. వరుణ్ ను తీసుకుంటారా లేకపోతే కులదీప్ యాదవ్ కు ఛాన్సు ఇస్తారా చూడాలి.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ‘క్రికెట్ ఈజ్ ఎ గేమ్ ఆప్ అన్సెర్టెనిటి’. అంటే మ్యాచ్ లో ఎవరు ఎప్పుడు ఎలాగ ఆడుతారో ఎవరూ ఊహించనుకూడా లేరు. బ్రహ్మాండంగా ఆడుతున్న న్యూజిల్యాండ్ బ్యాట్స్ మెన్ ఒక్కసారిగా ఫెయిలైపోవచ్చు. అలాగే అంతంతమాత్రంగా బౌలింగ్ చేస్తున్న అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి అద్భుతంగా రాణించచ్చు చెప్పలేము. కాబట్టి మ్యాచ్ మ్యాచ్ లోకి దిగేదాక ఎవరు ఎలాగ ఆడుతారో చెప్పలేము. అందుకనే అభిమానులు ఎవరికి వాళ్ళు ఇండియా గెలవాలని హోమాలు చేస్తున్నది.

