ఫ్రీ వికెట్ శర్మ..నెటిజన్ల దారుణ ట్రోలింగ్
x
Opener Abhishek Sarma

ఫ్రీ వికెట్ శర్మ..నెటిజన్ల దారుణ ట్రోలింగ్

కీలకమైన మ్యాచ్ లో కూడా నిర్లక్ష్యంగా ఆడి వికెట్ పారేసుకోవటంలో శర్మ తర్వాతే ఇంకెవరైనా అనే రేంజిలో ఆడుతున్నాడు


నెటిజన్లు క్రికెటర్ అభిషేక్ శర్మను చాలా దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎక్కడచూసినా శర్మ బ్యాటింగ్ పైనే తీవ్రస్ధాయిలో చర్చలు జరుగుతోంది. కారణం ఏమిటంటే శర్మ బ్యాటింగ్ తీరని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. కీలకమైన మ్యాచ్ లో కూడా నిర్లక్ష్యంగా ఆడి వికెట్ పారేసుకోవటంలో శర్మ తర్వాతే ఇంకెవరైనా అనే రేంజిలో ఆడుతున్నాడు. వరుసగా ఇన్ని మ్యాచుల్లో ఫెయిలవుతున్నా మేనేజ్మెంట్ ఇంకా శర్మను కంటిన్యు చేస్తుండటమే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తాజాగా ముంబాయ్ వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండుతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో మన జట్టు అదృష్టం మీద గెలిచిందే కాని ప్రతిభవల్ల కాదని అందరికీ తెలుసు.

సెమీఫైనల్ మ్యాచ్ అని తెలిసీ, ఎంతో బాధ్యతగా ఆడాల్సిన విషయం తెలిసి కూడా శర్మ ఎంతో నిర్లక్ష్యంగా ఆడి కేవలం తొమ్మిదిపరుగులకే ఔటైపోయాడు. స్లో బౌలర్లు ముఖ్యంగా స్పిన్నర్లను శర్మ సరిగా ఆడలేడన్న విషయాన్ని ఇంగ్లాండ్ జట్టు బాగానే గ్రహించింది. అందుకనే మొదట్లోనే స్పిన్నర్ ను రంగంలోకి దింపింది. స్పిన్నర్ వేసిన బంతుల్లో తొమ్మిదిపరుగులు చేయగానే ఒక బంతిని అమాంతం గాలిలోకి లేపి క్యాచ్ ఇచ్చి శర్మ ఔటైపోయాడు. అప్పటినుండి శర్మ మీద దారుణమైన ట్రోలింగులు జరుగుతునే ఉన్నాయి. ఈ టోర్నమెంటు మొదటి మూడు మ్యాచుల్లో శర్మ వరుసగా డకౌట్లయ్యాడు. నాలుగో మ్యాచ్ లో 15, ఐదో మ్యాచ్ లో 55, ఆరవ మ్యాచ్ 10, ఏడవ మ్యాచ్ లో 9 పరుగులకే ఔట్ అయ్యాడు.

బలహీనతే కొంపముంచేస్తోంది


నిజానికి శర్మ బ్యాటింగులో మంచి టెక్నిక్ ఉంది. శారీరకంగా కూడా ధృడంగానే ఉంటాడు. ఫుట్ వర్క్ కూడా బాగానే ఉంటుంది. అయితే ఇదే సమయంలో బలహీనతలు కూడా ఉన్నాయి. అదేమిటంటే స్లో బౌలర్లను, స్పిన్నర్లను సరిగా ఆడలేకపోవటం. ఎడమచేతి బ్యాట్స్ మెన్ కు ఉండే సహజసిద్ధమైన అడ్వాంటేజ్ ను కూడా శర్మ ఉపయోగించులేకపోతున్నాడు. అందుకనే శర్మను నెటిజన్లు ‘ఫ్రీ వికెట్ శర్మ’ అని సోషల్ మీడియాలో ఎద్దేవా చేస్తున్నారు. శర్మకు ఎవరైతే బౌలింగ్ చేస్తారో వాళ్ళకు ప్రైజ్ వికెట్ అన్నట్లుగా అయిపోయింది. తన బలహీనతను అధిగమించలేకపోవటమే పెద్ద మైనస్ అయిపోయింది శర్మకు.

శర్మ ఇంతదారుణంగా విఫలమవుతున్నా మేనేజ్మెంట్ ఇంకా ఎందుకు కంటిన్యు చేస్తోందో అర్ధంకావటంలేదు. 55 పరుగులు చేసిన మ్యాచ్ లో శర్మ ఓపెనర్ కాదు. మిడిల్ ఆర్డర్ లో వచ్చిన శర్మ 55 పరుగులతో పర్వాలేదు అన్నట్లుగా బ్యాటింగ్ చేశాడు. అదే పద్దతిలో తర్వాత మ్యాచ్ లో కూడా మిడిల్ ఆర్డర్లోనే పంపకుండా మళ్ళీ రెండు మ్యాచ్ లో ఓపెనర్ గా నే పంపింది. శర్మ బ్యాటింగ్ కు దిగగానే ప్రత్యర్ధి జట్టు స్పిన్నర్లతో బౌలింగ్ చేయించి వికెట్ లాగేసుకుంటోంది. అందుకనే తర్వాత ఆడిన రెండు మ్యాచ్ లో 10,9 కొట్టి ఔట్ అయిపోయాడు.


ఇంగ్లాండ్ కే అర్హతుందా ?


నిజానికి సెమీఫైనల్ మ్యాచ్ లో గెలవాల్సింది ఇంగ్లాండ్ జట్టే అనటంలో సందేహంలేదు. కాకపోతే ఏదో అదృష్టంకొద్దీ ఇండియా గెలిచిపోయింది. 20 ఓవర్లో ఇండియా 253 పరుగులు చేస్తే ఇంగ్లాండ్ జట్టు 246 పరుగులు చేసి ఔటయ్యింది. అంటే ఇండియా గెలిచింది కేవలం 7 పరుగుల తేడాతో మాత్రమే. అదికూడా చివరి ఓవర్లోనే ఇండియా గెలిచింది. చివరి ఓవర్లో బౌలింగ్ చేసిన శివందుబె ఒక్క ఓవర్లోనే 22 పరుగులు సమర్పించుకున్నాడు. అదే ఓవర్లో దుబె గనుక ఒక నోబాల్ లేదా మూడు వైడ్లు వేసుంటే ఇండియా పని అయిపోయేదే అనటంలో సందేహంలేదు. ఎందుకంటే పోయిన మ్యాచ్ లో బౌలింగ్ చేసిన దుబె ఒక ఓవర్లో ఏకంగా 26 పరుగులు ఇచ్చుకున్నాడు. ఇందులో నాలుగు వైడ్లున్నాయి. అదే పద్దతిలో గురువారం మ్యాచ్ లో కూడా రెండో, మూడో వైడ్లు వేసుంటే ఇంగ్లాండ్ గెలిచిపోయేదే అనటంలో సందేహంలేదు.

మొత్తంమీద అదృష్టం ఇండియా పక్షాన ఉండటంతోనే సెమీ ఫైనల్లో గెలిచింది. ఫైనల్స్ లో న్యూజిల్యాండ్ తో ఆడబోతోంది. న్యూజిల్యాండ్ జట్టు చాలా డిసిప్లిన్ తో ఆడుతుందనే పేరుంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో కవీస్ జట్టు చాలా ప్రొఫెషనల్ గా ఉంటుంది. కివీస్ తో పోల్చుకుంటే ఇండియా బౌలింగ్, ఫీల్డింగ్ లో బాగా వెనకబడుంది. బ్యాటింగులో ఘోరంగా విఫలమవుతున్న శర్మ కనీసం బౌలింగ్, ఫీల్డింగులో అయినా బ్రహ్మాండంగా ఉన్నాడా అంటే అదీలేదు. బౌలింగ్ ఇప్పటివరకు చేయలేదు కాబట్టి చేయలేడని అర్ధమవుతోంది. ఇక ఫీల్డింగ్ కూడా చెత్తగానే ఉంటుంది. ఆడిన మ్యాచ్ లో కొన్ని క్యాచులను వదిలేశాడు. అలాగే ఫీల్డింగ్ కూడా ఏమంత గొప్పగా ఉండదు. ఫైనల్ మ్యాచ్ లో మేనేజ్మెంట్ శర్మను ఆడిస్తుందో లేదో ఆడించినా ఎప్పుడు బ్యాటింగుకు పంపుతుందో చూడాల్సిందే.

Read More
Next Story