
తెలంగాణ స్పోర్ట్స్‌కు బిగ్ బూస్ట్.. హైదరాబాద్‌లో రగ్బీ 2026 లీగ్
గచ్చిబౌలి స్టేడియంలో జూన్ 16 నుంచి రగ్బీ ప్రీమియర్ లీగ్ నిర్వహణ. అంతర్జాతీయ ఆటగాళ్లతో పోటీలు జరగనున్నాయి.
తెలంగాణ క్రీడా రంగంలో మరో కీలక ముందడుగు పడింది. అన్ని క్రీడల్లో తెలంగాణ తన మార్క్ చూపుతోంది. ఇప్పటికే పలు ఫేమస్ క్రీడలకు వేదికగా నిలిచిన హైదరాబాద్.. ఇప్పుడు రగ్బీ లీగ్‌ను కూడా హోస్ట్ చేయడానికి సన్నద్ధం అయింది. రగ్బీ ప్రీమియర్ లీగ్ 2026 రెండో ఎడిషన్‌కు వేదికగా హైదరాబాద్ ఎంపికైంది. తాజా ప్రకటనతో నగరం మళ్లీ జాతీయ క్రీడా కేంద్రంగా నిలుస్తోంది. జీఎంఆర్ స్పోర్ట్స్, రగ్బీ ఇండియా కలిసి ఈ లీగ్‌ను జూన్ 16 నుంచి 28 వరకు గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించనున్నట్లు వెల్లడించాయి.
ముంబైలో విజయవంతంగా జరిగిన తొలి సీజన్ తర్వాత, ఈసారి కూడా రగ్బీ 7s ఫార్మాట్‌లో పోటీలు జరుగుతాయి. ఆరు ఫ్రాంచైజీలు కొనసాగుతాయి. దేశీయ, అంతర్జాతీయ ఆటగాళ్లు పాల్గొని పోటీని మరింత ఉత్కంఠభరితం చేయనున్నారు. హైదరాబాద్‌ను వేదికగా ఎంపిక చేయడం ద్వారా ప్రపంచ స్థాయి క్రీడా వసతుల అభివృద్ధికి ఊతమిస్తామని నిర్వాహకులు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి స్పోర్ట్స్ సిటీ అభివృద్ధి దిశగా చేపట్టిన చర్యలకు ఇది కొనసాగింపుగా భావిస్తున్నారు.
ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, ఈ తరహా ఈవెంట్లు రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకువస్తాయని పేర్కొన్నారు. టూరిజం, ఆర్థిక రంగాలకు కూడా ఇవి మద్దతు ఇస్తాయని తెలిపారు. రాహుల్ బోస్ లీగ్ నాణ్యతను మెరుగుపరచడంపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. అభిమానులకు మెరుగైన అనుభవం అందించడమే లక్ష్యమని చెప్పారు. సత్యం త్రివేది హైదరాబాద్‌లో లీగ్ నిర్వహణపై సంతోషం వ్యక్తం చేశారు. నగరంలోని వసతులు, అభిమానుల ఆదరణ ఈ నిర్ణయానికి కారణమని తెలిపారు.
డాక్టర్ ఎ. సోనిబాలా దేవి ఈ పోటీలు యువ క్రీడాకారులకు మంచి అవకాశమని పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయి అనుభవం ద్వారా వారి ప్రతిభ మరింత మెరుగవుతుందని తెలిపారు. కొత్త వేదికతో రగ్బీ ప్రీమియర్ లీగ్ ఈసారి మరింత నాణ్యతతో సాగనుందని నిర్వాహకులు భావిస్తున్నారు.

