‘రోకో’ ద్వయంపై నాకు నమ్మకం ఉంది: కోచ్ గౌతం గంభీర్
టెస్టుల్లో వరుసగా విఫలం అవుతున్న విరాట్, రోహిత్ శర్మ కు కోచ్ గౌతం గంభీర్ అండగా నిలబడ్డారు. రాబోయే బోర్డర్ - గవాస్కర్ సిరీస్ లో ఈ ద్వయం కచ్చితంగా రాణిస్తారని..
కీలకమైన బోర్డర్ - గవాస్కర్ సిరీస్ ముందు ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న రో-కో ద్వయాన్ని కోచ్ గౌతం గంభీర్ వెనకేసుకు వచ్చాడు. ఇలాంటి సీనియర్లకు ఫామ్ లేమితో పెద్ద ఇబ్బంది ఉండదని, వారు ఆకలితో ఉంటారని చెప్పారు. రోహిత్, విరాట్ కచ్చితంగా బోర్డర్ - గవాస్కర్ ట్రోఫిలో రాణిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
న్యూజిలాండ్‌పై స్వదేశంలో భారత్ 0-3తో వైట్‌వాష్ అయిన తర్వాత తాను ఒత్తిడిలో ఉన్నాననే వార్తలను కూడా గంభీర్ తోసిపుచ్చాడు. ఆసీస్ పర్యటనకు ముంబైలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో గంభీర్ మాట్లాడుతూ, "డ్రెస్సింగ్ రూమ్‌లో అద్భుతమైన వాతావరణం ఉందని, అద్భుతమైన వ్యక్తులు ఉన్నారని చెప్పారు. "నేను ఎలాంటి ఒత్తిడి అనుభవించడం లేదు. భారత జట్టుకు కోచ్‌గా వ్యవహరించడం గౌరవం " అన్నారు. కాగా ఆస్ట్రేలియా నవంబర్ 22న పెర్త్‌లో తొలి టెస్టు ప్రారంభం కానుంది.
జట్టు పరివర్తనలో ఉన్నప్పుడు అంటే 2011 తరువాత కూడా భారత్ కు ఇలాగే అపజయాలు ఎదురయ్యాయి. అప్పుడు కోచ్ గా పనిచేసిన డంకన్ ప్లెచర్ తీవ్రంగా ఒత్తిడిని ఎదుర్కొన్నాడు. ఇప్పుడు గంభీర్ ను కూడా ఇదే ప్రశ్న అడగగా‘‘ నేను పరివర్తన ప్రక్రియ గురించి ఆలోచించడం లేదు. జరగబోయే ఐదు టెస్టుల గురించి మాత్రమే ఎదురు చూస్తున్నాం. పరివర్తన అనేది నా చేతిలో లేదు. జరగాలంటే జరగుతుంది. కానీ నేను కొన్నింటిని అద్భుతంగా చూస్తున్నాను. ఆ డ్రెస్సింగ్ రూమ్‌లో పాత్రలు మైదనంలో బాగా ఆడాలనే ఆకలితో ఉన్నారు " అని గంభీర్ చెప్పారు.
వ్యక్తిగత కారణాల వల్ల రోహిత్ శర్మ మొదటి టెస్టులో అందుబాటులో లేకుంటే, వైస్ కెప్టెన్‌గా జస్ప్రీత్ బుమ్రా జట్టుకు నాయకత్వం వహిస్తారని కోచ్ తెలియజేశాడు. ఓపెనర్ స్లాట్ కోసం కేఎల్ రాహుల్, అభిమన్యు ఈశ్వరన్‌లలో ఎవరో ఒకరిని తుది జట్టులోకి తీసుకుంటామని చెప్పారు.
పాంటింగ్ వ్యాఖ్యలపై కౌంటర్..
కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లి వరుసగా విఫలమవుతుండటంటపై ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాటింగ్ చేసిన వ్యాఖ్యలపై గంభీర్ స్పందించాడు. పక్క దేశాల క్రికెటర్ల గురించి ఆలోచించే బదులు, తన దేశ క్రికెట్ భవిష్యత్ పై దృష్టి పెడితే బాగుంటుందని చురకలంటించాడు. రోహిత్, కోహ్లి గత ఐదు సంవత్సరాలలో కేవలం రెండు సెంచరీలు మాత్రమే సాధించాడని, వారి ఫామ్ జట్టుకు భారంగా మారిందని పాంటింగ్ వ్యాఖ్యానించారు.
"భారత క్రికెట్‌తో పాంటింగ్‌కు సంబంధం ఏమిటి? అతను ఆస్ట్రేలియా క్రికెట్ గురించి ఆలోచించాలని నేను భావిస్తున్నాను. మరీ ముఖ్యంగా, విరాట్, రోహిత్ గురించి నాకు ఎలాంటి ఆందోళనలు లేవు" అని ఆస్ట్రేలియాకు బయలుదేరే ముందు మీడియాతో గంభీర్ చెప్పాడు.
విరాట్ ప్రదర్శన..
కాన్పూర్ టెస్టులో బంగ్లాదేశ్‌పై 70 పరుగులతో కోహ్లి ఈ ఏడాది కేవలం ఒక ఫిఫ్టీ మాత్రమే సాధించాడు, కోహ్లి చివరి టెస్టు సెంచరీ జూలై 2023లో వెస్టిండీస్‌పై చేశాడు. 2016 నుంచి 2019 వరకు టెస్ట్ క్రికెట్‌లో 50 కంటే ఎక్కువ సగటు ఉన్న కోహ్లికీ గత 34 టెస్టులలొ కేవలం 31.68 సగటుతో 1838 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇందులో కేవలం రెండు సెంచరీలు మాత్రమే సాధించాడు. ఈ ఏడాది ప్రదర్శన మరీ తీసికట్టుగా తయారైంది. ఆరు మ్యాచ్‌ల్లో 22.72 సగటు మాత్రమే పరుగులు సాధించాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆసీస్ లోని బౌన్సీ పిచ్ ల మీద పరుగులు ఎలా సాధిస్తాడని పాంటింగ్ అనుమానం వ్యక్తం చేశాడు.
Next Story