ఇండియా-సౌత్ ఆఫ్రికా మ్యాచ్ లో స్పిన్నర్లే ఆదుకోవాలా ?
x
Indian spinners in action(File Photo)

ఇండియా-సౌత్ ఆఫ్రికా మ్యాచ్ లో స్పిన్నర్లే ఆదుకోవాలా ?

స్పిన్ త్రయం అక్షర్, యాదవ్, వరుణ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తే చాలు


సూపర్ 8 మ్యాచ్ లు ముగియటంతో ఇపుడు దేశంలోని అభిమానుల చూపులు అహ్మదాబాద్ లోని మొతేరా స్టేడియంపైనే నిలిచాయి. మొతేరా స్టేడియంపైన ఎందుకంటే వచ్చే ఆదివారం నాడు భారత్-దక్షిణాఫ్రికాల మధ్య మొదటి మ్యాచ్ జరగబోతోంది కాబట్టే. రాబోయే మ్యాచ్ కు బుధవారం నెదర్లాండ్స్ తో ముగిసిన మ్యాచ్ వార్మప్ మ్యాచ్ లాంటిదే అనుకోవాలి. ఎందుకంటే అహ్మదాబాద్ స్టేడియంలో పరుగులు చేయటం అంత వీజీ అయితే కాదు. ఈ విషయం నెదర్లాండ్స్ మ్యాచ్ లో స్పష్టంగా బయటపడింది. ఎందుకంటే ముందు పిచ్ పేసర్లకు తర్వాత స్నిన్నర్లకు అనుకూలిస్తుంది కాబట్టే.

50 ఓవర్ల మ్యాచ్ అయితే కథ వేరేవిధంగా ఉంటుంది. కాని ఇపుడు ఆడుతున్నది టీ20 మ్యాచ్ లు కాబట్టి బ్యాట్స్ మెన్ వచ్చిన దగ్గర నుండి బంతిని బాది పరుగులు రాబట్టాలనే ఆతృతలోనే ఉంటారు. అయితే ఈ ఆతృతలో కొందరు సక్సెస్ అయితే మరికొందరు ఫెయిలవుతారు. సక్సెస్ కి, ఫెయిల్యూర్లకు మధ్య తేడా ఏమిటంటే ఓపిక. ఆచితూచి బంతిని ఆడాలన్న ఆలోచన కోల్పోవటమే. అందుకనే ఎక్కువమంది బ్యాట్స్ మెన్ బంతిని రీడ్ చేయటంలో తప్పుచేసి ఔట్ అవుతుంటారు.

స్పిన్నర్ల పాత్రే కీలకమా ?

ఇపుడు విషయం ఏమిటంటే మొతేరా పిచ్ ముందు పేసర్లకు బాగానే ఉన్నా తర్వాత స్పిన్నర్లకు బాగా అనుకూలిస్తుంది. అందుకనే దక్షిణాఫ్రికా మ్యాచ్ లో గెలుపు ఎక్కువగా స్పిన్నర్ల మీదే ఆధారపడుంది. భారత్ జట్టులో అక్షర్ పటేల్, కులదీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి బాగానే బౌలింగ్ చేస్తున్నారు. పిచ్ ను బట్టి ఎవరైనా ఫెయిలవుతున్నా మెజారిటి మ్యాచ్ లో పర్వాలేదు అన్నట్లుగానే బౌలింగ్ చేస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే టీ20 మ్యాచ్ లన్నదే బ్యాటర్ల కోసం. బ్యాట్స్ మెన్ ఎన్ని పరుగులు చేస్తే అభిమానులు అంతగా ఊగిపోతారు. బ్యాట్స్ మెన్ సిక్సులు, ఫోర్ల వరద పారిస్తుంటే స్టేడియంలో అభిమానులకు పూనకాలే అనటంలో సందేహంలేదు.

నెదర్లాండ్స్ మ్యాచ్ లో సివందూబే సిక్సులు, ఫోర్లు బాదుతుంటే స్టేడియంలో జనాలు ఊగిపోయిన విషయం చాలామంది టీవీల్లో చూసుంటారు. రాబోయే మ్యాచ్ లో కూడా అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్, సూర్యకుమార్ యాదవ్, పాండ్యా, దూబేలు చెలరేగిపోవాలని కోరుకోని అభిమానులుంటారా ? అయితే స్పిన్నర్ల పాత్రే కీలకమైనపుడు దక్షిణాఫ్రికాలో కూడా స్పిన్నర్లు ఆడం జంపా లాంటి వాళ్ళున్నారు. ఆదివారం మ్యాచ్ లో ఎవరిని తీసుకుంటారో ఇప్పుడే చెప్పటం కష్టం.

చివరి ఐదు మ్యాచ్ లు

మొతేరా స్టేడియంలో చివరి ఐదు మ్యాచ్ లను తీసుకుందాము. 2025, ఫిబ్రవరి 12వ తేదీన ఇండియా-ఇంగ్లాండ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ బౌలర్ ఆదిల్ రషీద్ పది ఓవర్లలో 45 పరుగులిచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. పది ఓవర్లలో 45 పరుగులు అంటే బాగానే బౌలింగ్ చేసినట్లే. 2023, నవంబర్ 19వ తేదీన ఆస్ట్రేలియాతో వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. కంగారూల జట్టులోని స్పిన్నర్లు ఆడమ్ జంపా 44 పరుగులిచ్చి వికెట్ తీసుకున్నాడు. అలాగే గ్లెన్ మ్యాక్స్ వెల్ వికెట్లు తీసుకోకపోయినా 35 పరుగులిచ్చాడు. ఇక రవీంద్ర జడేజా వికెట్ తీసుకోకుండా 43 పరుగులిచ్చాడు. కుల్ దీప్ యాదవ్ వికెట్లు తీసుకోకుండానే 56 పరుగులిచ్చాడు.

ఆఫ్ఘనిస్ధాన్-సౌతాఫ్రికా మధ్య 2023, నవంబర్ 10న జరిగిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికా స్పిన్నర్లు కేశవ్ మహరాజ్ 27 పరుగులిచ్చి 2 వికెట్లు, తబ్రియాజ్ షమ్సి 46 పరుగులిచ్చి ఒక వికెట్ తీసుకున్నారు. వీరిలో కేశవ్ మహరాజ్ బౌలింగులో మనవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఇండియా-పాక్ మధ్య 2023, అక్టోబర్ 14న మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో కులదీప్ యాదవ్ 35 పరుగులిచ్చి 2 వికెట్లు, జడేజా 38 పరుగులిచ్చి 2 వికెట్లు తీసుకున్నారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే టీ 20లో పరుగులు చేయకుండా బ్యాట్స్ మెన్ ను ఆపటం చాలా కష్టం. కాబట్టి ఇలాంటి మ్యాచ్ లో వికెట్లు తీయకపోయినా పర్వాలేదు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయగలిగితే అంతేచాలు.

అయితే సౌతాఫ్రికా స్పిన్నర్లు కేశవ్ మహరాజ్, తబ్రియాజ్ ను మొతేరా పిచ్ పైన ఎదుర్కోవటం అంత వీజీ అయితే కాదు. జాగ్రత్తగా ఆడితేనే పరుగులు రాబట్టగలరు. ఇక భారత జట్టులో ముందే చెప్పుకున్నట్లు స్పిన్ త్రయం అక్షర్, యాదవ్, వరుణ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తే చాలు. వికెట్లు తీయలేకపోయినా పరుగులను నియంత్రించగలిగితే అదే పదివేలు. టీ 20 మ్యాచ్ లు ఉద్దేశ్యమే పరుగుల వరదను పారించటం. అందుకని బౌలర్లు ఓవర్ కు 5 పరుగులకన్నా తక్కువ ఇస్తే ఎకానమి బాగానే ఉన్నట్లు లెక్క. ఈ లెక్క చూసుకుంటే మన స్పిన్నర్లు వికెట్లు తీయలేకపోయినా పరుగులను నియంత్రించగలిగితే బ్రహ్మాండంగా బౌలింగ్ చేసినట్లుగానే భావించాలి. ముఖ్యంగా 6వ ఓవర్ నుండి 15వ ఓవర్ మధ్యలో స్పిన్నర్లు గనుక పిచ్ నుండి అడ్వాంటేజ్ తీసుకుంటే ప్రత్యర్ధిని గట్టిగానే కట్టడి చేయచ్చు. మరి మనస్పిన్నర్లు ఏమిచేస్తారో చూడాల్సిందే.

Read More
Next Story