‘ఆరోసారి’ ప్రపంచకప్ ను ఒడిసిపట్టిన భారత్
x
అండర్-19 ప్రపంచకప్ తో భారత జట్టు

‘ఆరోసారి’ ప్రపంచకప్ ను ఒడిసిపట్టిన భారత్

అండర్ -19 ఫైనల్ లో భారత్ చేతిలో ఇంగ్లాండ్ చిత్తు, విధ్వంసం సృష్టించిన వైభవ్ సూర్యవంశీ


భారత్ అండర్-19 ప్రపంచకప్ ను మరోసారి ఒడిసిపట్టింది. ఇంగ్లాండ్ U-19 జట్టును 100 పరుగుల తేడాతో ఓడించి రికార్డు స్థాయిలో ఆరో ప్రపంచ టైటిల్‌ను సాధించింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ 80 బంతుల్లో 175 పరుగులు చేయడంతో మొదట బ్యాటింగ్ చేసిన మెన్ ఇన్ బ్లూ జట్టు 50 ఓవర్లలో 9 వికెట్లకు రికార్డు స్థాయిలో 411 పరుగుల భారీ స్కోర్ చేసింది.

412 పరుగుల టార్గెట్ ఛేదనకు దిగిన ఇంగ్లాండ్ 311 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత్ వంద పరుగుల తేడాతో విజయం సాధించింది. అండర్ 19 క్రికెట్ లో భారత్ ఇది ఆరో టైటిల్.
ఫైనల్ లో విధ్వంసక శతకం సాధించిన ఒపెనర్ వైభవ్ సూర్యవంశీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తో పాటు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కు ఎంపికయ్యాడు. ఈ టోర్నీలో వైభవ్ 439 పరుగులు చేసి ఒక వికెట్ తీసుకున్నాడు.
ఈ ఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ కూడా ధీటుగానే స్పందించింది. ఓపెనర్ బెన్ డాకిన్స్ (56 బంతుల్లో 66; ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లు) వన్ డౌన్ బ్యాట్స్ మెన్ బెన్ మేయస్ (28 బంతుల్లో 45; ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లు) మంచి ఆరంభాన్ని ఇచ్చారు.
అయితే మిడిల్ ఆర్డర్ వైఫల్యంతో ఆ జట్టు జోరు తగ్గింది. అయితే కాలేబ్ ఫాల్కనర్ 67 బంతుల్లో (తొమ్మిది ఫోర్లు, ఏడు సిక్సర్లు) 115 పరుగులు సాధించి భారత శిబిరంలో ఒక దశలో గుబులు రేపాడు.
జేమ్స్ మింటో(28) ఫాల్క్ నర్ కు అండగా నిలిచాడు. భారత్ తరఫున, కుడిచేతి వాటం పేసర్ ఆర్ఎస్ అంబ్రుస్ మూడు వికెట్లు పడగొట్టాడు. దీపేష్ దేవేంద్రన్, ఆఫ్-బ్రేక్ బౌలర్ కనిష్క్ చౌహాన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.
అంతకుముందు కెప్టెన్ ఆయుష్ మాత్రే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మొదట్లో నెమ్మదిగా ఆడిన వైభవ్, కుదురుకున్నాక ఒక్కసారి గేర్ మార్చి ఎడాపెడా సిక్స్ లు, ఫోర్లతో హోరెత్తించాడు.
దీనితో భారత స్కోర్ బోర్డు బుల్లెట్ వేగంతో దూసుకుపోయింది. టోర్నమెంట్ ప్రారంభించిన 28 సంవత్సరాల చరిత్రలో ఓ జట్టు ఫైనల్ లో 400 పైలుకు పరుగులు సాధించడం ఇదే ప్రథమం.
దేశవాళీలో దుమ్ముదులుతున్న ఈ బీహార్ కుర్రాడు.. వరల్డ్ కప్ లోనూ తన జోరును కొనసాగించాడు. టోర్నమెంట్ లో ఇప్పటి వరకూ తన స్థాయికి తగిన ప్రదర్శన చేయడం లేదని ఉన్న విమర్శలను ఫైనల్ లో కనపరిచిన ఆటతీరుతో తొలగించేశాడు. టైటిల్ రౌండ్‌లో తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. భారత్ తరఫున అండర్-19 క్రికెట్ లో 60 బంతుల్లోపు సెంచరీ సాధించడం ఇదే ప్రథమం.
వైభవ్ ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. 218 కంటే ఎక్కువ స్ట్రైకింగ్ రేట్‌తో పరుగులు సాధించాడు. ఇంతకుముందు రాజ్ అంగద్ భారత్ తరఫున వేగవంతమైన సెంచరీ సాధించాడు. అండర్-19 ప్రపంచకప్ లో అత్యంత వేగంగా సెంచరీ సాధించిన రికార్డు ఆస్ట్రేలియాకు చెందిన విల్ మలాజ్ పేరు మీద ఉంది. జపాన్ పై 51 బంతుల్లోనే సెంచరీ సాధించాడు.
సూర్యవంశీ ఇప్పుడు U-19 ప్రపంచ కప్ ఒకే ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డును సాధించాడు. ప్రస్తుత టోర్నమెంట్‌లో అతను 30 సిక్సర్లు బాదాడు. 2022లో దక్షిణాఫ్రికాకు చెందిన డెవాల్డ్ బ్రెవిస్ నమోదు చేసిన 18 సిక్స్ ల రికార్డును అధిగమించాడు.
ఫైనల్ మ్యాచ్ లో సూర్యవంశీతో పాటు, మాత్రే 51 బంతుల్లో 53 పరుగులు చేయగా, వికెట్ కీపర్-బ్యాటర్ అభిజ్ఞాన్ కుందు 31 బంతుల్లో 40 పరుగులు చేశాడు. వేదాంత్ త్రివేది, విహాన్ మల్హోత్రా కూడా రెండు 30 పరుగులు చేశారు.
ఇంగ్లాండ్ తరఫున, ఎడమచేతి వాటం మీడియం పేసర్ జేమ్స్ మింటో 45 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టాడు. ఓపెనింగ్ పేసర్లు సెబాస్టియన్ మోర్గాన్, అలెక్స్ గ్రీన్ తలా రెండు వికెట్లు తీసుకున్నారు. సంక్షిప్త స్కోర్లు: ఇండియా U-19 50 ఓవర్లలో 411/9 (వైభవ్ సూర్యవంశీ 175, ఆయుష్ మాత్రే 63, జేమ్స్ మింటో 3-63) ఇంగ్లాండ్ U-19ని 40.2 ఓవర్లలో 311కి ఆలౌట్ చేసింది (కాలేబ్ ఫాల్కనర్ 115, బెన్ డాకిన్స్ 66, RS అంబ్రిష్ 3-66)
Read More
Next Story