
భారత్ సెమీస్ ఆశలు సజీవం
పోరాడి ఓడిన జింబాబ్వే, భారీ షాట్లతో అలరించిన ఒపెనర్ బెన్నెట్
టీ20 ప్రపంచకప్ లో భాగంగా సూపర్ ఎయిట్ లో జింబాబ్వేపై భారత్ 73 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో దాని సెమీస్ ఆశలు సజీవంగా ఉన్నాయి. భారత్ మొదట బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ సాధించింది. నిర్ణీత ఓవర్లలో 256/4 సాధించి ప్రత్యర్థి ముందు భారీ టార్గెట్ ను నిలిపింది. నిర్ణీత ఓవర్లలో జింబాబ్వే వికెట్లు కోల్పోయి 184/6 పరుగులు మాత్రమే చేసింది.
టాస్ గెలిచిన జింబాబ్వే కెప్టెన్, భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్ లో భారత్ తన ఇషాన్ కిషన్ బదులుగా సంజూ శాంసన్ ఓపెనర్ గా పంపించింది.
అంచనాలకు తగ్గట్లుగానే శాంసన్, అభిషేక్ శర్మ ఇద్దరు కూడా భారీ షాట్లతో అలరించారు. తొలి వికెట్ కు 48 పరుగులు సాధించిన తరువాత సంజూ శాంసన్ భారీ షాట్ కు ప్రయత్నించి పెవిలియన్ చేరాడు. కొన్ని రోజులుగా ఫామ్ కోసం తంటాలు పడుతున్న అభిషేక్ శర్మ భారీ షాట్లతో అలరించాడు.
ఈ క్రమంలోనే తన హఫ్ సెంచరీ పూర్తి చేశాడు. తన ఇన్నింగ్స్ లో నాలుగు భారీ సిక్స్ లు, నాలుగు ఫోర్లు ఉన్నాయి. అభిషేక్ అవుట్ అయ్యాక స్కోర్ బోర్డు వేగంలో ఎలాంటి మార్పు లేకుండా అలాగే కొనసాగింది. సూర్యకుమార్ తనదైన షాట్లతో కాసేపు అలరించాడు. అయితే 33 పరుగుల వద్ద డీప్ లో ముస్కివాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
తరువాత క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ తొలి బంతినే ఫోర్ గా పంపి తన ఉద్దేశాన్ని చాటిచెప్పాడు. వరల్డ్ కప్ మ్యాచ్ లలో యాంకర్ రోల్ పోషిస్తూ తన స్లో గా బ్యాటింగ్ చేసి విమర్శలు ఎదుర్కొన్న ఈ హైదరాబాదీ ఈ మ్యాచ్ లో సిక్సర్ల వర్షం కురిపించాడు. తను ఎదుర్కొన్న 16 బంతుల్లోన్లే నాలుగు సిక్స్ లు, మూడు ఫోర్లతో 44 పరుగులు సాధించాడు. మరో వైపు హార్డిక్ పాండ్యా కూడా తనదైన శైలిలో హిట్టింగ్ చేస్తుండటంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. ఇన్నింగ్స్ చివరి రెండు బంతులను హర్ధిక్ సిక్స్ ర్ లు గా మలిచి జట్టు స్కోర్ ను 250 దాటించడంతో పాటు తన హఫ్ సెంచరీ మార్క్ ను పూర్తి చేసకున్నాడు.
స్లో అండ్ స్టడీగా జింబాబ్వే..
భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో జింబాబ్వే చాలా స్లోగా బ్యాటింగ్ ప్రారంభించింది. పవర్ ప్లే ముగిసే సరికి ఆ జట్టు కేవలం 44 పరుగులే సాధించి ఒక వికెట్ కోల్పోయింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ప్రత్యర్థికి పరుగులు రావడం గగనమైంది.
స్లోగా బ్యాటింగ్ చేస్తున్న మరుమణి, అక్షర్ పటేల్ బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించి ఇషాన్ కిషన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే మరో ఓపెనర్ బెన్నెట్(97) మాత్రం పవర్ ప్లే తరువాత భారీ హిట్టింగ్ లతో స్కోర్ వేగాన్ని పెంచే ప్రయత్నం చేశాడు.
అక్షర్ పటేల్ బౌలింగ్ కు వచ్చిన తొమ్మిదో ఓవర్ లో రెండు సిక్స్ లు, ఫోర్ తో ఏకంగా 19 పరుగులు సాధించాడు. బుమ్రా బౌలింగ్ లో భారీ సిక్స్ తో తన హఫ్ సెంచరీ సాధించాడు. బెన్నెట్ వరుసగా మూడు మ్యాచ్ లలో అర్థ సెంచరీ సాధించడం గమనార్హం. శివమ్ దూబే వేసిన బౌలింగ్ లో ఏకంగా రెండు సిక్స్ లు, రెండు ఫోర్లతో 26 పరుగులు పిండుకున్నాడు. ఈ ఓవర్ లో మరో మూడు వైడ్లు, ఓ నోబ్ బాల్ వేయడంతో ఓవర్ పూర్తి చేయడానికి పది బంతులు అవసరం అయ్యాయి.
ఈ మ్యాచ్ లో భారత బౌలర్లు మొదట్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన మిడిల్ ఓవర్లలో పట్టు విడిచిపెట్టారు. జింబాబ్వే బ్యాట్స్ మెన్ స్వేచ్చగా షాట్లు ఆడారు. అర్ష్ దీప్ సింగ్, హర్ధిక్ పాండ్యా, బుమ్రా మాత్రమే కాస్త ఎకనామిక్ గా బౌలింగ్ చేశారు. అర్ష్ దీప్ సింగ్ కు మాత్రమే మూడు వికెట్లు దక్కాయి.
Next Story

