కొత్త సీజన్ ప్రారంభానికి ముందు ఆర్సీబీ కెప్టెన్ గా రజత్ పాటిదార్ ను నియమిస్తున్నట్లు ఫ్రాంచైజీ ప్రకటించింది. గత సంవత్సరం వరకూ జట్టుకు దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు డు ప్లెస్సిస్ కెప్టెన్ గా వ్యవహరించారు.
అయితే జట్టు ఫైనల్ కు చేరడంలో విఫలం అయింది. ముందుగా కెప్టెన్ గా విరాట్ కోహ్లినే తిరిగి వస్తాడని ఊహగానాలు వెలువడ్డాయి. కానీ అనుహ్యంగా 31 ఏళ్ల రజత్ పాటిదార్ కు పగ్గాలు అప్పగించారు.
ఐపీఎల్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ ఆర్సీబీ కనీసం ఒక్క టైటిల్ కూడా అందుకోలేకపోయింది. రెండు సార్లు ఫైనల్ కు వెళ్లిన కప్ ను ముద్దాడలేకపోయింది.
కాగా ఈ సీజన్ ఐపీఎల్ మార్చి 21 నుంచి ప్రారంభం కానుంది. ఈ సారి తమ తలరాతను పాటిదార్ మారుస్తాడనే ఆశాభావం ప్రాంఛైజీలో కనిపిస్తోంది.
పాటిదార్ ఏమంటున్నాడు...
దక్షిణాఫ్రికాకు చెందిన ఫాఫ్ డు ప్లెస్సిస్ 2022 నుంచి 2024 వరకూ ఆర్సీబీకి నాయకత్వం వహించారు. ప్రస్తుతం అతడిని వేలంలో వదిలివేయగా, ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది.
‘‘ చాలా మంది దిగ్గజాలు ఆర్సీబీకి కెప్టెన్ గా ఉన్నారు. అలాంటి జట్టుకు నన్ను ఎంపిక చేసుకోవడం నాకు గౌరవంగా అనిపిస్తుంది. నా కెప్టెన్సీ విధానం కొద్దిగా భిన్నంగా ఉంటుంది. నేను నిశ్శబ్ధంగా, ప్రశాంతంగాను ఉంటాను.
అదే సమయంలో ఏదీ అవసరమో అదే చేస్తానని, వాస్తవ పరిస్థితులు గురించి నాకు తెలుసు’’ అని ఆర్సీబీ ఎక్స్ హ్యండిల్ లో పోస్ట్ చేసిన వీడియో సందేశంలో పాటిదార్ చెప్పారు. ‘‘ ఒత్తిడి పరిస్థితుల్లో నేను పెద్దగా భయపడను, ఇది నాబలం’’ అని చెప్పుకొచ్చారు.
పాటిదార్ ప్రశాంతంగా ఉంటాడు: కోచ్ ఆండీ ప్లవర్
2021 లో ఆర్సీబీ జట్టుతో చేరిన పాటిదార్, గత సంవత్సరం మెగా వేలానికి ముందు ఆర్సీబీ రిటైన్ చేసిన ఆటగాళ్లలో రజత్ పాటిదార్ ఒకడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫిలో మధ్యప్రదేశ్ జట్టుకు నాయకత్వం వహించాడు. తన జట్టును ఫైనల్ కు తీసుకెళ్లాడు. ఫైనల్లో అద్భుతంగా బ్యాటింగ్ చేసినప్పటికీ ముంబాయి చేతిలో మధ్య ప్రదేశ్ ఓటమి పాలైంది. అలాగే విజయ్ హజారే(ఓడీఐ) ఫార్మాట్ లో నాయకత్వం వహించాడు.
‘‘ రజత్ లో సరళత ఉంది. తన చుట్టూ ఉన్న వ్యక్తుల గురించి పట్టించుకుంటాడు. మధ్య ప్రదేశ్ ను ఎలా నడిపించాడో చాలా దగ్గరగా చూశాము. మాకు అది నచ్చింది.’’ అని బెంగళూర్ లో జరిగిన ఫ్రాంచైజీ ఈవెంట్ లో పాటిదార్ గురించి కోచ్ ఆండీప్లవర్ చెప్పారు.
అతనికి ప్రశాంతత ఉంది. ముఖ్యంగా ఐపీఎల్ లో అతను స్వతహాగా నిశ్శబ్ధంగా ఉండే వ్యక్తి. కానీ డ్రెస్సింగ్ రూమ్ లో తన చుట్టూ ఉన్న వ్యక్తులు గురించి పట్టించుకుంటాడు. నాయకుడిగా, ఆ లక్షణాలు ముఖ్యమైనవనీ ఫ్లవర్ అన్నారు.
పాటిదార్ గురించి కోహ్లి ఏమన్నాడంటే..
కొత్త కెప్టెన్ గా పాటిదార్ నియమించడానికి ముందు కోహ్లి పేరు కూడా తీసుకున్నామని ఫ్రాంచైజీ తెలిపింది. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్ లో అజింక్య రహానే తరువాత అత్యధిక పరుగులు చేసింది కూడా రజత్ పాటిదారే. పది మ్యాచుల్లో 61 సగటుతో 186. 08 స్ట్రైక్ రేట్ తో 428 పరుగులు చేశాడు.
పాటిదార్ నియామకం పై కోహ్లి అభినందనలు తెలిపారు. నిజంగా కెప్టెన్ కు అర్హుడని చెప్పాడు. ‘‘నేను ఇతర జట్టు సభ్యులు మీ వెనకే ఉంటాం రజత్’’ అని ఫ్రాంచైజీ షేర్ చేసిన వీడియో ప్రకటనలో కోహ్లి అన్నారు. ఈ ఫ్రాంచైజీలో మీరు ఎదిగిన తీరు, ప్రదర్శించిన ఆట తీరు చూసి ఆర్సీబీ అభిమానుల హృదయాల్లో చోటు సంపాదించుకున్నారని కోహ్లి అన్నారు.
కాగా ఆర్సీబీకి ఎనిమిదో కెప్టెన్ పాటిదార్. మొదట ఈ జట్టుకు రాహుల్ ద్రవిడ్ నాయకత్వం వహించగా తరువాత అనిల్ కుంబ్లే, కెవిన్ పీటర్సన్, విరాట్ కోహ్లి, డానియేల్ వెటోరి, షేన్ వాట్సాన్, ఫాఫ్ డు ప్లెస్సిస్ కెప్టెన్ లు గా వ్యవహరించారు.