కొలంబో వేదికగా ఈ రోజు సాయంత్రం భారత్- పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే వాతావరణ శాఖ నివేదిక ప్రకారం ఈ మ్యాచ్ కు దాదాపు 70 శాతం వర్షం ముప్పు ఉంది. ఇందుకు తగ్గట్లే నిన్న మొత్తం కొలంబోలో వర్షం కురిసింది. ఆకాశం మబ్బు పట్టి ఉంది.
అయితే ఇప్పుడు క్రికెట్ అభిమానులకు ఓ శుభవార్త . నివేదికల ప్రకారం, కొలంబోలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, కానీ వర్షం ఉండకపోవచ్చని శ్రీలంక వాతావరణ శాఖ తెలిపింది.
మరోవైపు, దేశంలోని తూర్పు, దక్షిణ ప్రావిన్సులలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం పడే అవకాశం ఉంది. అయితే, పశ్చిమ ప్రావిన్స్‌లో ఉన్న కొలంబో రాత్రిపూట పొగమంచుతో కూడిన పొడి వాతావరణం ఉంటుందని భావిస్తున్నారు.
అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్ vs పాకిస్తాన్ T20 ప్రపంచ కప్ మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు (స్థానిక సమయం మరియు IST) ప్రారంభం కానుంది, ఆదివారం (ఫిబ్రవరి 15) సాయంత్రం 6.30 గంటలకు టాస్ వేస్తారు.
వాతావరణ శాఖ హెచ్చరిక
శ్రీలంక వాతావరణ శాఖ నివేదిక ప్రకారం.. "ఫిబ్రవరి 15 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది" అని హెచ్చరించింది. మ్యాచ్ రోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని, 10–20 మి.మీ మధ్య వర్షపాతం ఉంటుందని కూడా అంచనా వేసింది.
మ్యాచ్ షెడ్యూల్ దగ్గరగా అంటే సాయంత్రం ఏడు గంటలకు వర్షం పడే అవకాశాలు తగ్గుతాయని అంచనా వేయగా, ఉదయం, మధ్యాహ్నం వరకు వర్షాలు కురవచ్చు. ప్రేమదాస స్టేడియంలో ఇప్పటికే అవుట్ ఫీల్డ్ చిత్తడిగా మారింది.
గ్రౌండ్ మెన్స్ ఇప్పటికే మొత్తం మైదానాన్ని కవర్ల కింద కప్పి ఉంచారు. ప్రేమదాస స్టేడియం లో తరచుగా వర్షాలు కురుస్తుండటం అక్కడ డ్రైనేజీ వ్యవస్థ సమర్థవంతంగా ఉంది. సాయంత్రం ఒకవేళ వర్షం కురిసిన గంటల వ్యవధిలోనే మైదానాన్ని సిద్ధం చేసే అవకాశం ఉంది.
రాజకీయ నాటకం
ఎప్పుడు మైదానంలో నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగే మ్యాచ్ లకు కంటే ఈ సారి బయట జరిగిన రాజకీయాలే అందరి దృష్టిని ఆకర్షించింది. వేదిక సంబంధిత, దౌత్యపరమైన ఆందోళనలపై పాకిస్తాన్ ప్రపంచ కప్‌లో పాల్గొనడానికి విముఖతను ప్రదర్శించింది. భారత్ తో ఆడేది లేదని భీష్మించుకుని కూర్చుంది. అయితే శ్రీలంక జోక్యంతో పాకిస్తాన్ తన నిర్ణయంలో యూ టర్న్ తీసుకుంది.
ఐసిసి పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026 గ్రూప్ ఎలో, భారత్, పాకిస్తాన్ రెండూ రెండు మ్యాచ్‌లలో గెలిచి నాలుగు పాయింట్లు తమ ఖాతాలో వేసుకున్నాయి. ఈ గ్రూప్ లో భారత్ అగ్ర స్థానంలో ఉన్నాయి.
భారత్ +3.050 అత్యుత్తమ నెట్ రన్ రేట్‌తో గ్రూప్‌లో అగ్రస్థానంలో ఉంది. పాకిస్తాన్, రెండు విజయాలతో అజేయంగా ఉన్నప్పటికీ, నెట్ రన్ రేట్ (+0.932)లో భారత కంటే వెనుకబడి ఉంది. నెదర్లాండ్స్, యుఎస్‌ఎ, నమీబియా గ్రూప్‌లో దిగువ స్థానాలను ఆక్రమించాయి.