పెర్త్ టెస్ట్: భారత్ ఘన విజయం.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ...
పెర్త్ టెస్ట్ లో భారత్ ఘన విజయం సాధించింది. నాలుగో రోజు ఆసీస్ టీ విరామం తరువాత 238 పరుగులకు ఆలౌట్ అయింది
ఆస్ట్రేలియాలోని పెర్త్ వేదికగా ప్రారంభమైన బోర్డర్ - గవాస్కర్ సిరీస్ తొలి టెస్ట్ లో భారత్ ఘన విజయం సాధించింది. టీ విరామం తరువాత కొద్ది సేపటికే టీమిండియా ఆసీస్ బ్యాట్స్ మెన్లను పెవిలియన్ పంపించింది. వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ అలెక్స్ కేరి(36)ని అరంగ్రేట బౌలర్ హర్షిత్ రాణా క్లీన్ బౌల్డ్ చేయడంతో స్టేడియంలో సంబరాలు మిన్నంటాయి.
కంగారూలు తమ రెండో ఇన్సింగ్స్ లో 238 పరుగులకు ఆలౌట్ అయ్యారు. దీనితో భారత్ 295 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ప్రత్యర్థి జట్టులో ట్రావిడ్ హెడ్ (89) టాప్ స్కోరర్. ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ 47 పరుగులతో ఆకట్టుకున్నాడు. పెర్త్ లోని ఆప్టస్ స్టేడియంలో ఇప్పటి వరకూ ఆసీస్ ఓడిపోలేదు. కానీ భారత బౌలర్ల ధాటికి ఆస్ట్రేలియా చేతులెత్తేయ్యక తప్పలేదు.
అంతకుముందు ఉదయం ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే ఓపెనర్ ఉస్మాన్ ఖవాజను సిరాజ్ వెనక్కి పంపాడు. ఉదయం పూట ఉన్న తేమను సద్వినియోగం చేసుకున్న సిరాజ్ ఖవాజతో పాటు స్టీవెన్ స్మిత్ ను బుట్టలో వేసుకున్నాడు. అయితే మరో ఎండ్ లో ట్రావిస్ హెడ్ భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. చూడచక్కని షాట్లతో ఓటమి అంతరాన్ని తగ్గించడానికి ప్రయత్నించాడు. అతనికి మిచెల్ మార్ష్ చక్కని సహకారం అందించాడు. ఇద్దరు లంచ్ సమయానికి మరో వికెట్ పడకుండా జాగ్రత్త వహించారు.
లంచ్ తరువాత ఓ చక్కని బంతితో ట్రావిస్ హెడ్(89) ను కెప్టెన్ బుమ్రా అవుట్ చేశాడు. తరువాత కొద్ది సేపటికే మిచెల్ మార్ష్ ను అరంగ్రేట బౌలర్ నితీష్ కుమార్ రెడ్డి క్లీన్ బౌల్డ్ చేశాడు. అయితే అలెక్స్ కేరీ ఓటమి అంతరాన్ని తగ్గించడానికి ప్రయత్నించాడు.
మొదటి ఇన్నింగ్స్ లో భారత బౌలర్లను విసిగించిన స్టార్క్ రెండో ఇన్నింగ్స్ లో అదే తరహ ఆటను సాగించాడు. అయితే వాషింగ్టన్ సుందర్ వేసిన అద్భుత బంతికి క్లీన్ బౌల్డ్ కావడంతో మరోసారి వికెట్ల పతనానికి గేట్లు ఎత్తారు. అయితే అప్పుడే అంపైర్లు టీ విరామం ఇచ్చినా.. మన బౌలర్ల జోరు ఆగలేదు. లియాన్ ను సైతం సుందర్ బోల్తా కొట్టించాడు.
టాస్ గెలిచిన భారత్ తొలి ఇన్సింగ్స్ లో కేవలం 150 పరుగులకే ఆలౌట్ అయింది. అయితే ఆస్ట్రేలియా ను మన జట్టు కేవలం 104 పరుగులకే కుప్పకూల్చింది. రెండో ఇన్సింగ్స్ లో కేఎల్ రాహుల్(77), జైస్వాల్(161), కోహ్లి(100) చెలరేగడంతో భారత్ 487/6 పరుగుల వద్ద డిక్లేర్ చేసి, ఆసీస్ ముందు 534 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది.
ఛేదన ప్రారంభించిన ఆస్ట్రేలియా మూడో రోజే ఓటమిని ఖరారు చేసుకుంది. 12 పరుగులకే 3 వికెట్లు కోల్పోవడంతో ఆత్మరక్షణలో పడింది. అందుకు తగ్గట్లే నాలుగో రోజు ఆట సాగింది. మ్యాచ్ లో అద్బుత ప్రదర్శన చేసిన కెప్టెన్ బుమ్రాకే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.
Next Story