
టెన్నిస్ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన రోహన్ బోపన్న
కెరీర్‌లో 2 గ్రాండ్ స్లామ్‌లు, 26 ATP డబుల్స్ టైటిళ్లను గెలుచుకున్నారు. ఆసియా క్రీడల్లో రెండు బంగారు పతకాలను సాధించారు.
భారత టెన్నిస్(Tennis) ఆటగాడు రోహన్ బోపన్న(Rohan Bopanna) శనివారం (నవంబర్ 1) రిటైర్మెంట్ (Retirement) ప్రకటించారు. గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలుచుకున్న నలుగురు భారతీయులలో బోపన్న ఒకరు. తన 22 ఏళ్ల కెరీర్‌లో రెండు గ్రాండ్ స్లామ్‌లు, 26 ATP డబుల్స్ టైటిళ్లను గెలుచుకున్న బోపన్న.. 2018 ఆసియా క్రీడల్లో దివిజ్ శరణ్‌తో కలిసి పురుషుల డబుల్స్ స్వర్ణం, 2022 ఆసియా క్రీడల్లో రుతుజా భోసలేతో కలిసి మిక్స్‌డ్ డబుల్స్2లో బంగారు పతకం దక్కించుకున్నారు.
45 ఏళ్ల బోపన్న చివరిసారిగా ATP టూర్‌లో కనిపించారు. ఈ వారం ప్రారంభంలో పారిస్ మాస్టర్స్‌లో కజకిస్తాన్‌కు చెందిన అలెగ్జాండర్ బుబ్లిక్‌తో కలిసి ఆడారు. అయితే తొలి రౌండ్‌లోనే ఓడిపోయాడు. గత సంవత్సరం పారిస్ ఒలింపిక్స్ తర్వాత బోపన్న తన భారత కెరీర్‌ను ముగించారు. 2023లో లక్నోలో మొరాకోతో తన చివరి మ్యాచ్ ఆడే సమయంలో డేవిస్ కప్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు.
2024లో బోపన్న తన డబుల్స్ భాగస్వామి ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ ఎబ్డెన్‌తో కలిసి ఆస్ట్రేలియన్ ఓపెన్ ట్రోఫీని గెలుచుకున్నప్పుడు ఓపెన్ ఎరాలో గ్రాండ్ స్లామ్ గెలిచిన అతి పెద్ద వయస్కుడిగా నిలిచాడు. అతని మరో గ్రాండ్ స్లామ్ టైటిల్ 2017లో కెనడాకు చెందిన గాబ్రియేలా డబ్రోవ్స్కీతో కలిసి ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్‌ను గెలుచుకున్నారు.
"నేను పోటీ నుంచి తప్పుకుంటున్నాను. కానీ టెన్నిస్‌తో నా కథ ఇంకా ముగియలేదు. ఈ ఆట నాకు అన్నీ ఇచ్చింది. ఇప్పుడు నేను తిరిగి ఇవ్వాలనుకుంటున్నాను." అని పేర్కొన్నారు.
యువ ఆటగాళ్లకు కోచ్‌గా..
భారతదేశపు అత్యుత్తమ డబుల్స్ ఆటగాళ్ళలో ఒకరైన బోపన్న..దేశానికి ప్రాతినిధ్యం వహించడం జీవితంలో తనకు దొరికిన గొప్ప గౌరవమని పేర్కొన్నారు. “భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం నా జీవితంలో గొప్ప గౌరవం. ప్రతి సర్వ్, ప్రతి పాయింట్, ప్రతి మ్యాచ్ ..నా దేశం కోసం ఆడాను. భారతదేశానికి నా ధన్యవాదాలు..” అని కోట్ చేశారు.
బోపన్న గురించి క్లుప్తంగా..
భారత టెన్నిస్ చరిత్రలో నిలిచిపోయే క్రీడాకారుల్లో రోహన్ బోపన్న ఒకరు. 1980 మార్చి 4న కర్ణాటకలోని కూర్గ్ (కోడగు) జిల్లాలో జన్మించిన బోపన్న తండ్రి పేరు మాధవ్. కాఫీ తోటల యజమాని. తల్లి మాలతి బోపన్న గృహిణి. చిన్ననాటి నుంచే టెన్నిస్‌పై ఆసక్తి ఉన్న బోపన్న.. 11 ఏళ్ల వయసులోనే రాకెట్ పట్టుకున్నారు. మొదట ఫుట్‌బాల్, క్రికెట్ ఆడేవారు కానీ క్రమంగా టెన్నిస్ పట్ల మక్కువ పెరిగింది. బోరిస్ బెక్కర్, పీట్ సాంప్రాస్ వంటి అంతర్జాతీయ ఆటగాళ్ల ప్రేరణతో టెన్నిస్ రంగంలోకి అడుగుపెట్టారు. ఇక రోహన్ బోపన్న బెంగళూరులోని సెంట్ ఫ్రాన్సిస్ జేవియర్ హైస్కూల్‌లో చదువుకున్నారు. కాలేజీ రోజుల్లోనే టెన్నిస్‌పై మక్కువ పెంచుకున్నారు. రోహన్ 2012లో సుప్రియ అన్నయ్యను వివాహం చేసుకున్నారు.

