
కుప్పకూలిన సౌతాఫ్రికా బ్యాటింగ్ ఆర్డర్, 117 పరుగులకే ఆల్ ఔట్
చివరి నిమిషంలో ఇంటి మొహం పట్టిన బుమ్రా..
ధర్మశాలలో టీమ్ ఇండియాతో జరిగిన కీలకమైన మూడో టీ20 మ్యాచ్‌లో సౌతాఫ్రికా బ్యాటింగ్ లైనప్ ను టీమ్ ఇండియా బౌలర్లు కుప్పకూల్చారు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సఫారీలు కేవలం 117 పరుగులకే ఆలౌట్ అయ్యారు. భారత బౌలర్లు ఆరంభం నుంచే మ్యాచ్‌పై పట్టు సాధించారు.
ఆరంభంలోనే భారత బౌలర్ల దెబ్బ
ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే అర్ష్‌దీప్ సింగ్ సౌతాఫ్రికాకు షాక్ ఇచ్చాడు. 0.4 ఓవర్‌కు రిజా హెండ్రిక్స్ (0) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. వెంటనే హర్షిత్ రాణా తన రెండో ఓవర్‌లో క్వింటన్ డికాక్ (1)ను ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేశాడు.
3.1 ఓవర్‌కు డెవాల్డ్ బ్రెవిస్ (2) క్లీన్‌బౌల్డ్ కావడంతో సౌతాఫ్రికా 7 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.
ఒక్కడే పోరాడిన మార్‌క్రమ్
పవర్ ప్లే ముగిసే సమయానికి సౌతాఫ్రికా స్కోరు 25/3గా ఉంది. కెప్టెన్ ఐడెన్ మార్‌క్రమ్ కొంత సమయం క్రీజులో నిలిచి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించే ప్రయత్నం చేశాడు. ఆరో ఓవర్‌లో రెండు ఫోర్లతో స్కోరు కాస్త ముందుకు వెళ్లింది. దక్షిణాఫ్రికా టీమ్ లో మార్ క్రమ్ ఒక్కరే చెప్పుకోదగిన స్కోర్ చేశారు.
టీ20ల్లో హార్దిక్‌కు వందో వికెట్
ఏడో ఓవర్‌లో హార్దిక్ పాండ్య బౌలింగ్‌లో ట్రిస్టన్ స్టబ్స్ (9) వికెట్ కీపర్ జితేశ్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఇది హార్దిక్ పాండ్యకు అంతర్జాతీయ టీ20ల్లో వందో వికెట్ కావడం విశేషం. దీంతో సౌతాఫ్రికా 30/4కు చేరింది.
వరుణ్–కుల్‌దీప్ కట్టుదిట్టమైన బౌలింగ్
వరుణ్ చక్రవర్తి తన ఓవర్లలో పరుగులను పూర్తిగా కట్టడి చేశాడు. 10 ఓవర్లకు సౌతాఫ్రికా స్కోరు 44/4గానే కొనసాగింది. కుల్‌దీప్ యాదవ్ వేసిన 12వ ఓవర్‌లో కొంత ప్రతిఘటన కనిపించినప్పటికీ, భారత బౌలర్ల ఒత్తిడి తగ్గలేదు.
ఫెరీరా పోరాటానికి తెర
డొనావన్ ఫెరీరా కొంత పోరాటం చేసి స్కోరు ముందుకు నడిపించే ప్రయత్నం చేశాడు. అయితే 13.3 ఓవర్‌కు వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో ఫెరీరా (20) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఈ సమయంలో సౌతాఫ్రికా స్కోరు 69/6గా ఉంది. ఫెరీరా క్యాచ్‌ను అర్ష్‌దీప్ సింగ్ వదిలేసినప్పటికీ, అది మ్యాచ్‌పై పెద్దగా ప్రభావం చూపలేదు.
చివరికి భారత బౌలర్ల నిరంతర దాడికి సౌతాఫ్రికా బ్యాటింగ్ పూర్తిగా కుప్పకూలింది. 20 ఓవర్లు పూర్తికాకముందే 123 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ముగిసింది. ధర్మశాల పిచ్‌పై భారత బౌలర్లు చూపిన ఆధిపత్యం ఈ మ్యాచ్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
జట్టును వీడిన బుమ్రా..
సౌతాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వ్యక్తిగత కారణాల వల్ల జట్టును వీడాడు. దీంతో ధర్మశాల వేదికగా సఫారీలతో జరుగుతున్న కీలకమైన మూడో టీ20కు బుమ్రా దూరమయ్యాడు.
ఈ విషయాన్ని బీసీసీఐ ఎక్స్ వేదికగా వెల్లడించింది. "జస్ప్రీత్ బుమ్రా వ్యక్తిగత కారణాల చేత ఇంటికి తిరిగి వెళ్ళాడు. అతడు మూడో టీ20కు అందుబాటులో లేడు. బుమ్రా తదుపరి మ్యాచ్‌లకు జట్టులో చేరే విషయంపై అప్‌డేట్ ఇస్తామని" బీసీసీఐ పేర్కొంది.
ఇదే విషయాన్ని టాస్ సందర్భంగా భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా చెప్పుకొచ్చాడు. ఇక జస్ప్రీత్ స్ధానంలో యువ పేసర్ హర్షిత్ రాణా తుది జట్టులో వచ్చాడు. బుమ్రాతో పాటు స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ కూడా ధర్మశాల టీ20కు దూరమయ్యాడు.
దీంతో కుల్దీప్ యాదవ్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కింది. అయితే బుమ్రా తిరిగి జట్టులో చేరుతాడా లేదా అన్నది ఇంకా క్లారిటీ లేదు. ఈ సిరీస్‌లో భాగంగా నాలుగో టీ20 డిసెంబర్ 17న లక్నో వేదికగా జరగనుంది.
తుది జట్లు
దక్షిణాఫ్రికా: రీజా హెండ్రిక్స్, క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్), డెవాల్డ్ బ్రెవిస్, ట్రిస్టన్ స్టబ్స్, డోనోవన్ ఫెరీరా, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, అన్రిచ్ నోర్ట్జే, లుంగి ఎన్గిడి, ఒట్నీల్ బార్ట్‌మన్
భారత్: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేష్ శర్మ(వికెట్‌కీపర్), హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి
Next Story

