
సౌత్ ఆఫ్రికా ఆటగాళ్లు
విండీస్ పై ఘన విజయం సాధించిన సౌత్ ఆఫ్రికా
భారత్, కరేబియన్ జట్ల పై విజయంతో సెమీస్ చేరిన ప్రోటీస్
సూపర్ ఎయిట్ పోరులో భాగంగా అహ్మాదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్ లో సౌతాఫ్రికా తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత ఓవర్లలలో ఏడు వికెట్ల నష్టానికి 176 పరుగులు సాధించింది. ఆరంభం దూకుడుగా ప్రారంభించిన కరేబియన్ జట్టు మధ్యలో తడబడింది.
జింబాబ్వే తో జరిగిన మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగిన హెట్ మేయర్ సహ పావెల్, చేజ్, రూథర్ ఫోర్డు, ఫోర్డే ఇలా వచ్చి అలా వెనుదిరిగారు. దీనితో విండీస్ జట్టు 83 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో చిక్కుకున్నట్లు కనిపించింది.
అయితే మాజీ కెప్టెన్ హోల్డర్(47) కు జత కలిసిన షెపర్డ్(52) ఎడాపెడా బౌండరీలు బాదీ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ముఖ్యంగా షెపర్డ్ ప్రోటీస్ బౌలర్లను ఉతికి ఆరేశారు. మరో వైపు హెల్డర్ వీలైనంత ఎక్కువ స్ట్రైక్ రోటేట్ చేస్తూ షెపర్డ్ కు బ్యాటింగ్ ఇచ్చాడు.
సౌతాఫ్రికా బౌలర్లుకు మధ్యలో చిక్కిన పట్టును చివరి ఓవర్లలో వదిలేశారు. రబాడ, కేశవ్ మహారాజ్, యాన్సెస్, బాష్ బౌలింగ్ టార్గెట్ గా షెపర్డ్ పరుగులు రాబట్టాడు. ఒక్క ఎంగిడి మాత్రమే 19 ఓవర్లలో కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చాడు. షెపర్డ్ బంతిని బ్యాట్ కు తగిలించడానికి ప్రయత్నించినప్పటికీ విఫలం అయ్యాడు. చివరి ఓవర్ సంధించిన బాష్ కూడా కేవలం ఆరు పరుగులే ఇచ్చాడు.
సౌతాఫ్రికా ధాటిగా బ్యాటింగ్ ప్రారంభించింది. ఒపెనర్లు మార్ర్కమ్, డికాక్ పోటీలు పడి బౌండరీలు బాదారు. ముఖ్యంగా మార్క్రమ్ 22 బంతుల్లో 43 పరుగులు సాధించడంతో పవర్ ప్లే ముగిసే నాటికి ప్రోటీస్ 69 పరుగులు సాధించింది. చివరకు ఈ జోడీని ఛేజ్ విడదీశాడు.
ఆ ఓవర్లలో ఓ సిక్స్, ఫోర్ బాదిన డికాక్(47, 4X4, 4X6) చివరి బంతికి హోల్డర్ కు క్యాచ్ కు ఇచ్చి వెనుదిరిగాడు. మార్క్రమ్(46 బంతుల్లో 82) కు తోడుగా రికెల్టన్(45) జత కలవడంతో రన్ రేట్ ఎక్కడా తగ్గలేదు. ముఖ్యంగా మార్క్రమ్ ఫోర్లు, సిక్స్ లతో విండీస్ బౌలింగ్ ను ఆడుకున్నాడు.
రికెల్టన్ కూడా బ్యాట్ ఝలిపించడంతో సునాయాసంగా విజయం సాధించింది. ఈ విజయంతో దక్షిణాఫ్రికా అధికారికంగా సెమీస్ చేరినట్లు అయింది. మరో స్థానం కోసం భారత్, విండీస్, జింబాబ్వే మధ్య పోటీ నెలకొంది.
ఈ రోజు జింబాబ్వేతో జరిగే మ్యాచ్ లో భారత్ గెలిస్తేనే సెమీస్ రేస్ లో నిలబడుతుంది. అయితే ఈ మ్యాచ్ వర్షం ముప్పు పొంచి ఉందని నివేదిక రావడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ మ్యాచ్ లో భారత్ మూడు మార్పులు చేయవచ్చని విశ్లేషకులు అభిప్రాాయపడుతున్నారు.
Next Story

