టీ20 జట్టుకి కెప్టెన్ గా కొత్త పేరు.. ఎవరతనూ?
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా వంటి సీనియర్ క్రికెటర్లు టీ20కి రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో హర్దిక్ పాండ్యాకు జట్టు పగ్గాలు అప్పజెప్పడం..
కెప్టెన్ రోహిత్ శర్మ తన టీ20 కెరీర్ కు రిటైర్ మెంట్ ప్రకటించిన నేపథ్యంలో తదుపరి కెప్టెన్ ఎవరనే విషయంలో బీసీసీఐ రెండు రకాల ఆప్షన్స్ తో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకుముందు వరకూ హార్ధిక్ పాండ్యా పేరు ప్రముఖంగా వినిపించే స్థానంలో ఇప్పుడు తాజాగా డాషింగ్ బ్యాట్స్ మెన్, స్కై మ్యాన్ గా పేరుపొందిన సూర్యకుమార్ యాదవ్ పేరు తెరపైకి వచ్చింది. ఈ విషయంలో బీసీసీఐ ఎలాంటి వ్యూహాంతో వెళ్తుందో ఇంకా స్పష్టత లేకున్నా హర్ధిక్ తరుచుగా గాయాలు, ఫిట్ నెస్ సమస్యలతో మ్యాచ్ లకు దూరమవుతున్నాడు. ఈ నేపథ్యంలో సూర్య పేరు బయటకు వచ్చింది.
పాండ్యాను కెప్టెన్‌గా నియమించడంపై క్రికెట్ బోర్డు, సెలక్షన్ కమిటీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీ20 ప్రపంచకప్ లో ఈ ఆల్ రౌండర్ వైస్ కెప్టెన్ గా ఉన్నాడు. పాండ్యా నిస్సందేహంగా, టీమిండియా టాప్ సీమ్-బౌలింగ్ ఆల్-రౌండర్, ఇటీవలి ప్రపంచ కప్ లో పాండ్యా బంతితోనూ, బ్యాట్ తోనూ సత్తా చాటాడు. అయితే అతని ఎనిమిది సంవత్సరాల అంతర్జాతీయ కెరీర్ లో ఎన్నోసార్లు గాయాల కారణంగా మ్యాచ్ లకు దూరమయ్యాడు. వీటి కారణంగానే టెస్ట్ మ్యాచ్ లకు దూరంగా ఉండాలని పాండ్యా నిర్ణయించుకున్నాడు.
SKY బెటర్ ఆప్షన్?
జాతీయ జట్టు కెప్టెన్సీని సూర్యకుమార్ యాదవ్ అప్పగించడానికి బీసీసీఐలోని ఓ వర్గం సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. టీ20 ర్యాంకింగ్ లో ఇప్పుడు సూర్య ఇండియా నుంచి నంబర్ వన్ గా కొనసాగుతున్నాడు. 2022 టీ20 ప్రపంచకప్ తరువాత ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలో జరిగిన సిరీస్ లో కెప్టెన్ గా విజయవంతం అయ్యాడు. అతడి కెప్టెన్సీ శైలిని ఆటగాళ్లు కూడా ఇష్టపడుతున్నారని కూడా బోర్డు అభిప్రాయాలను సేకరించింది.
భారత జట్టు కొత్త ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కొత్త కెప్టెన్‌ను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తారని సమాచారం. గతంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు నాయకత్వం వహిస్తున్నప్పుడు గంభీర్, సూర్య కలిసి ఆడారు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఈ వారం గంభీర్‌ను వారి మొదటి టీమ్ ఎంపిక( శ్రీలంక పర్యటన) సమావేశానికి కలువనుంది. ఈ సమావేశంలోనే వారు కెప్టెన్ విషయంపై చర్చించే అవకాశం ఉంది.
Next Story