
టీ20 ప్రపంచకప్: బంగ్లా దారిలో పాకిస్తాన్
భారత్ కు వచ్చి ఆడేది పాక్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్న పీసీబీ చైర్మన్
వచ్చే నెల నుంచి భారత్- శ్రీలంక వేదికగా జరగబోయే టీ20 ప్రపంచకప్ లో పాకిస్తాన్ కూడా ఆడేది అనుమానంగా మారింది. ఇప్పటికే పొరుగుదేశం బంగ్లాదేశ్ భద్రతా కారణాలను సాకుగా చూపి, టోర్నీ నుంచి వైదొలగగా ప్రస్తుతం పాకిస్తాన్ సైతం అదే దారిలో నడుస్తోంది.
వచ్చే నెలలో భారత్ వేదికగా జరగబోయే ప్రపంచకప్ నుంచి తమ జట్టు ఆడుతుందా లేదా అని పాక్ ప్రధాని తుది నిర్ణయం తీసుకుంటారని పీసీబీ చైర్మన్ మొహసిన్ నఖ్వీ శనివారం మీడియాతో అన్నారు.
‘‘మేము టీ20 ప్రపంచకప్ లో ఆడాలా వద్దా అనే నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుంది’’ అని నఖ్వీ అన్నారు. ప్రస్తుతం ప్రధాని షహబాజ్ షరీఫ్ విదేశాల్లో ఉన్నారని, ఆయన వచ్చిన తరువాత ఈ విషయాన్ని ముందు పెడతామని చెప్పారు. ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు.
ప్రభుత్వం వద్దని చెబితే తాము భారత్ కు రాబోమని పేర్కొన్నారు. ‘‘భద్రతా కారణాలను చూపుతూ భారత్ కు వెళ్లడానికి నిరాకరించిన బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్ లాండ్ టోర్నిలో ఆడబోతున్నట్లు ఐసీసీ ఇప్పటికే ప్రకటించింది’’ అని పేర్కొన్నారు. తాము రాకపోతే వేరే జట్టును తీసుకోవచ్చని చెప్పారు. ప్రస్తుతం పాక్ తన మ్యాచులన్నీ కూడా శ్రీలంక లో ఆడుతోంది.
బంగ్లాదేశ్ కూడా తమ మ్యాచ్ లను శ్రీలంకలో షెడ్యూల్ చేయమని డిమాండ్ చేసింది. అయితే ఐసీసీ నిర్వహించిన మీటింగ్ మిగిలిన సభ్యదేశాలు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించాయి.
కేవలం పాకిస్తాన్ మాత్రమే బంగ్లా ప్రతిపాదనకు మద్దతు ఇచ్చింది. అయితే ఈ వ్యవహరంలో ఐసీసీ అన్యాయంగా వ్యవహరించిందని నఖ్వీ ఆరోపించారు. ఐసీసీ భారత్ అనుకూలంగా వ్యవహరించిందని ఆయన విమర్శలు చేశారు.
గత ఏడాది దుబాయ్ వేదికగా జరిగిన ఆసియాకప్ లో కూడా భారత్ విజేతగా నిలిచినప్పుడూ నఖ్వీ భారత్ కు టైటిల్ అందించకుండా ట్రోఫి తీసుకుని వెళ్లిపోయాడు.
షేక్ హసీనా పాలన పతనం అయ్యాక బంగ్లాదేశ్ తోనూ భారత్ కు ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. బంగ్లాదేశ్ లోని మైనారిటీ హిందువులను అక్కడ ఇస్లామిక్ జిహాదీ మూకలు కొట్టి చంపడంపై భారత్ లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అయ్యాయి.
ఈ నేపథ్యంలో ఐపీఎల్ లో బంగ్లా బౌలర్ అయిన ముస్తాఫిజుర్ ను ఆడించడంపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. తరువాత బీసీసీఐ కూడా రెహామాన్ విడుదల చేయమని కేకేఆర్ ను ఆదేశించింది. ఈ చర్యతో బంగ్లాదేశ్, భారత్ వేదికగా జరిగే ప్రపంచకప్ లో ఆడబోమని మొండికేసింది. తరువాత ఐసీసీ బంగ్లా స్థానంలో స్కాట్ ల్యాండ్ ను టోర్నిలో ఆడటానికి అవకాశం కల్పించింది.
Next Story

