
మ్యాచ్ అనంతరం సంబరాలు చేసుకుంటున్న భారత ఆటగాళ్లు
టీ20 ప్రపంచకప్: యూఎస్ఏ పై కష్టపడి గెలిచిన టీమ్ ఇండియా
సూర్యకుమార్ మినహ తేలిపోయిన భారత బ్యాట్స్ మెన్లు
వాంఖడే వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో భారత్ విజయాన్ని అందుకుంది. USAపై 29 పరుగుల తేడాతో గెలిచి టోర్నమెంట్‌ను విజయంతో ప్రారంభించింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. రెండో ఓవర్‌లో అభిషేక్ శర్మ ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ దూకుడుగా ఆడి పరుగుల రేటును పెంచాడు. తిలక్ వర్మతో కలిసి రెండో వికెట్‌కు 37 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.
అయితే పవర్‌ప్లే ముగింపు సమయంలో వాన్ షాక్‌విక్ ఒకే ఓవర్‌లో ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, శివం దూబె వికెట్లు తీసి భారత్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. ఆ దశలో భారత్ 46 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో పడింది.
ఆ తర్వాత రింకూ సింగ్, సూర్యకుమార్ యాదవ్ కలిసి ఇన్నింగ్స్‌ను స్థిరపరిచారు. ఈ జోడీ 26 పరుగులు జోడించిన తర్వాత రింకూ ఔటయ్యాడు. హార్దిక్ పాండ్య కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు.
77 పరుగులకే ఆరు వికెట్లు పడిన వేళ సూర్యకుమార్ యాదవ్ క్రీజులో చివరి దాక నిలబడి పోరాడాడు. చివరి ఓవర్‌లో సౌరభ్ నేత్రవాల్కర్ పై విరుచుకుపడి రెండు ఫోర్లు, రెండు సిక్స్ ల సాయంతో 21 పరుగులు సాధించాడు. సూర్యకుమార్ 49 బంతుల్లో 84 పరుగులతో అజేయంగా నిలిచాడు. భారత్ 20 ఓవర్లలో 161 పరుగులకు 9 వికెట్లు కోల్పోయింది.
162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన USAకు భారత్ గట్టి ఆరంభ షాక్ ఇచ్చింది. తొలి మూడు ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి USA 13 పరుగులకే కష్టాల్లో పడింది. అనంతరం మిలింద్ కుమార్, సంజయ్ కృష్ణమూర్తి కలిసి ఇన్నింగ్స్‌ను కొంత స్థిరపరిచారు. ఇద్దరూ కలిసి 58 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే 71 పరుగుల వద్ద వరుణ్ చక్రవర్తి ఈ భాగస్వామ్యాన్ని విరిచాడు.
దీంతో USA బ్యాటింగ్ మళ్లీ ఒత్తిడిలోకి వెళ్లింది. సంజయ్ కృష్ణమూర్తి 31 బంతుల్లో 37 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. శుభమ్ రంజ్‌నే 22 బంతుల్లో 37 పరుగులు చేసి చివరి వరకు పోరాడాడు. అయినా అవసరమైన రన్‌రేట్ పెరగడంతో USA 20 ఓవర్లలో 132 పరుగులకే పరిమితమైంది.
భారత బౌలర్లలో సిరాజ్ నాలుగు ఓవర్లలో 29 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు తీశారు. వరుణ్ చక్రవర్తి ఒక వికెట్ సాధించాడు. USA బౌలర్లలో వాన్ షాక్‌విక్ నాలుగు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. హర్మీత్ సింగ్ రెండు వికెట్లు పడగొట్టాడు.
మొత్తంగా సూర్యకుమార్ యాదవ్ కీలక ఇన్నింగ్స్‌తో పాటు బౌలర్ల క్రమశిక్షణతో భారత్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించింది. టోర్నమెంట్‌లో రాబోయే మ్యాచ్‌లపై ఇప్పుడు క్రికెట్ అభిమానుల దృష్టి నిలిచింది.
Next Story

