ఆ ట్రక్ డ్రైవర్ కొడుకు రూ. 5 కోట్ల ఐపీఎల్ కాంట్రాక్ట్  ఎలా పొందాడు?
x
మంగేశ్ యాదవ్

ఆ ట్రక్ డ్రైవర్ కొడుకు రూ. 5 కోట్ల ఐపీఎల్ కాంట్రాక్ట్ ఎలా పొందాడు?

మంగేశ్ యాదవ్ ను రూ. 5 కోట్లకు వేలంలో దక్కించుకున్న ఆర్సీబీ


Click the Play button to hear this message in audio format

మంగేశ్ యాదవ్.. ఇప్పటి దాకా ఈ పేరు ఎవరికి పెద్దగా తెలియదు. కానీ ఇప్పుడు ఐపీఎల్ డిఫెండింగ్ ఛాంపియన్ అయిన ఆర్సీబీ ఈ 23 ఏళ్ల కుర్రాడిని రూ. 5.3 కోట్లకు వేలంలో దక్కించుకుంది. ఈ సీజన్ లో దాదాపు అరంగ్రేటం చేయబోతున్న ఈ కుర్రాడి నేపథ్యం అందరిని ఆకర్షిస్తోంది.

మంగేశ్ యాదవ్ ది మధ్యప్రదేశ్ లోని చింద్వారా. తండ్రి రామ్ వధ్ యాదవ్ ఒక ట్రక్ డ్రైవర్. తన కొడుకు కల కోసం డబ్బు ఎలా సంపాదించాలా అని ఆలోచిస్తూ రాత్రంతా పనిచేసేవారు. ఆయన తమ ఆర్థిక కష్టాలను గుర్తుచేసుకుంటూ.. “డబ్బు కోసం నేను చాలా కష్టపడాల్సి వచ్చింది.
మంగేశ్ కోసం డబ్బు ఎలా సమకూర్చాలా అని ఆలోచిస్తూ కొన్నిసార్లు రాత్రిపూట నిద్రపట్టేది కాదు. ట్రక్ డ్రైవర్ జీవితం అసలు జీవితమే కాదు. తినడానికి, స్నానం చేయడానికి కూడా సమయం ఉండదు. ట్రక్కు నిండినప్పుడు, సరుకు దించడం గురించి ఆందోళన, అది ఖాళీ అయినప్పుడు, దాన్ని నింపడం గురించి వెతకాల్సి ఉంటుంది.” అన్నారు.
మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారా జిల్లా, బోర్గావ్‌కు చెందిన 23 ఏళ్ల ఈ ఎడమచేతి వాటం పేసర్‌, సాధారణ వాతావరణంలో క్రికెట్ ఆడుతూ పెరిగాడు. టెన్నిస్ బాల్ టోర్నమెంట్‌లలో అతని ప్రతిభను మొదట గుర్తించి, కోచ్ ఫూల్ చంద్ శర్మ వద్ద శిక్షణ కోసం ఢిల్లీకి వెళ్లమని ప్రోత్సహించింది అతని మామయ్యే.

ఆట మీద ధ్యాస పోయింది..

“నేను ఈ రోజు క్రికెట్ ఆడుతున్నానంటే అది ఫూల్ చంద్ సార్ వల్లే.” “నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు, మా నాన్న చాలా కష్టపడి నాకు రూ. 24,000 ఇచ్చారు. ఆ డబ్బు మొదటి నెలలోనే ఎలా అయిపోయిందో కూడా నాకు తెలియదు.” మంగేష్ శిక్షణకు అవసరమైన డబ్బును సమకూర్చడానికి అతని తండ్రి తరచుగా తనకు దగ్గరైన వారి దగ్గర చేయిచాచాల్సి వచ్చేది.
ఫూల్ చంద్ శర్మ మాట్లాడుతూ, “మంగేష్ ఢిల్లీలో ఒకరితో కలిసి ఉంటున్నాడు. అతను మంచి బౌలర్ అని నేను గమనించాను, కానీ అతనికి తినడానికి కూడా సరిపడా డబ్బు ఉండేది కాదు. మా దగ్గర హాస్టల్‌కు వచ్చి ఉండమని చెప్పాను. అక్కడే అతని ప్రయాణం నిజంగా మొదలైంది. ఒకరి దగ్గర డబ్బు ఉందా లేదా అని నేను పట్టించుకోను. ఆటగాడు మంచివాడైతే, అతను వచ్చి, తిని, ఉండి, ప్రాక్టీస్ చేయవచ్చు.” అని పూల్ చంద్ శర్మ అన్నారు.
తాను ఏకాగ్రత కోల్పోయిన ఒక చిన్న దశను కూడా మంగేష్ గుర్తుచేసుకున్నాడు. “నేను బద్ధకస్తుడిగా మారడం మొదలుపెట్టాను. ఒకరోజు సార్ నన్ను పిలిచి, నా బ్యాగ్ సర్దుకుని ఇంటికి వెళ్లమన్నారు. కొద్దిరోజుల తర్వాత, నేను క్షమాపణ చెప్పి, మళ్ళీ అలా జరగదని చెప్పాను.
అప్పుడు నేను దేనిని కోల్పోతున్నానో, నా దగ్గర ఏముందో గ్రహించాను. నేను నా కుటుంబాన్ని చూసి, నాన్న ఎంత కష్టపడుతున్నారో ఒకసారి గుర్తు చేసుకున్నాను. ప్రతి ఒక్కరూ నా కోసం ఎంత అంకితభావంతో ఉన్నారో కదా.” అని తలుచుకుని మళ్లీ సాధన మొదలు పెట్టాను.
తరువాత DDCA లీగ్, స్థానిక టోర్నమెంట్లలో ఆడాడు. UP U-19 క్యాంప్‌కు కూడా ఎంపికయ్యాడు, కానీ తదుపరి అనేక అవమానాలు తప్పలేదు. రామ్ వధ్ యాదవ్ మాటల ప్రకారం, “కొన్నిసార్లు అతను సెలక్షన్ క్యాంప్ వరకు వెళ్లినా, పొరపాటున అతని పేరు పిలిచారని చెప్పేవారు. దానితో నేను తన కొడుకు క్రికెటర్ కావాలని అనుకోవడం తప్పని భావించాను.” అన్నారు.
అయితే మధ్యప్రదేశ్ T20 లీగ్‌లో ఒక మలుపు వచ్చింది. అక్కడ మంగేష్ కేవలం ఆరు మ్యాచ్‌లలో 12.00 సగటుతో 14 వికెట్లు పడగొట్టాడు. దేశీయ క్రికెట్‌లో మధ్యప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించిన తర్వాత, అక్కడ అతను RCB కెప్టెన్ రజత్ పాటిదార్‌తో డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకున్నాడు.
అతను ఎదురుచూస్తున్న పిలుపు చివరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నుంచి వచ్చింది. ట్రయల్స్‌లో దినేష్ కార్తిక్ మంగేష్‌ను పరీక్షించినప్పుడు, విభిన్న మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా మారే అతని సామర్థ్యాన్ని నిశితంగా పరిశీలించారు. "ట్రయల్స్ సమయంలో, డీకే [దినేష్ కార్తిక్] సర్ నా దగ్గరకు వచ్చి, 'నువ్వు బాగా బౌలింగ్ చేస్తున్నావు. ఇప్పుడు ఈ బంతిని చూపించు' అని అన్నారు.
ఆయన నాతో కొత్త బంతితో, ఐదో ఓవర్‌లో, పదో ఓవర్‌లో, పద్నాలుగో ఓవర్‌లో, ఇంకా పద్దెనిమిదో, ఇరవయ్యో ఓవర్లలో కూడా విభిన్న పరిస్థితులలో బౌలింగ్ చేయించారు. ఆ స్థాయిలో ఉన్న ఆటగాడు ఎలా ఆలోచిస్తాడో చూడటం నాకు ఆశ్చర్యం కలిగించింది." వేలం తర్వాత, తన ప్రయాణమంతా తనకు మద్దతుగా నిలిచిన కోచ్‌కి మంగేష్ కృతజ్ఞతలు తెలిపాడు.
"నేను క్లబ్‌కి తిరిగి వచ్చినప్పుడు, ఆయన్ని కలిసి ఆయన పాదాలకు నమస్కరించి, నన్ను నమ్మి, నాపై ఇంతగా పెట్టుబడి పెట్టినందుకు ధన్యవాదాలు చెప్పాలనిపించింది." అతని తండ్రి సంవత్సరాల త్యాగం ఫలించింది. "క్రికెట్‌లో మా నాన్న నాకు మద్దతు ఇచ్చినప్పుడు, మా బంధువులు, సమాజం ఆయన ఒక మూర్ఖుడని, నేను నాశనమైపోతానని అనుకున్నారు.
కానీ నేను చాలా సంతోషంగా ఉన్నాను. అదే నన్ను భావోద్వేగానికి గురిచేస్తుంది, ఇప్పుడు మా నాన్న గర్వంగా నడవగలరు." అని మంగేశ్ అన్నారు. "ఒక ట్రక్ డ్రైవర్‌కు ఇంత గౌరవం లభిస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. నేను అడగగలిగిన దానికంటే మంగేష్ నా కోసం ఎంతో చేశాడు." రామ్ వద్ యాదవ్ అన్నారు.
ఐపీఎల్ 2026 శనివారం (మార్చి 28) నాడు బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మరియు సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య జరిగే మ్యాచ్‌తో ప్రారంభమవుతుంది.
Read More
Next Story