అందరి చూపు.. ఆ ఇద్దరి బ్యాట్స్ మెన్ల పైనే..
గబ్బా వేదికగా కంగారులతో మూడో టెస్ట్
బోర్డర్- గవాస్కర్ ట్రోఫిలో మూడో టెస్టు బ్రిస్బేన్ వేదికగా రేపటి నుంచి ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే భారత్- ఆస్ట్రేలియా చెరో మ్యాచ్ గెలిచి 1-1 తో సమంగా నిలిచాయి. ఇక్కడ మ్యాచ్ గెలిచిన టీమ్ ఆధిక్యంలో కొనసాగడమే కాకుండా టెస్ట్ సిరీస్ పై నైతికంగా విజయం సాధించే అవకాశం ఉంది.
ఈ మ్యాచ్ లో అందరి కళ్లు రోహిత్, విరాట్ పై ఉన్నాయి. ఈ లెజెండ్స్ ఇద్దరు అడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఘోరంగా విఫలమయ్యారు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ వరుసగా విఫలమవుతుండటంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో హిట్ మ్యాన్ మరోసారి ఓపెనర్ గా బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. ఈ మ్యాచ్ లో గెలిస్తేనే టీమిండియాకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పై ఆశలు ఉంటాయి. లేదంటే వేరే జట్ల గెలుపు ఓటములపై ఆధారపడాల్సిన స్థితి. భారత జట్టులో ఇద్దరు సీనియర్ బ్యాట్స్ మెన్లు సహ పంత్ కూడా బ్యాట్ ఝలిపించాల్సిన అవసరం ఉంది.
మరో వైపు భారత్ కు ట్రావిస్ హెడ్ పెద్ద తలనొప్పిగా మారాడు. గతంలో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్, వన్డే వరల్డ్ కప్ ఫైనల్, మొన్నటి పింక్ బాల్ టెస్ట్ లో టీమిండియాకు పీడకలలు మిగిల్చాడు. బూమ్రా మాత్రమే జట్టులో ఎఫెక్ట్ గా ఉన్నాడు. కానీ ఈ ఏస్ బౌలర్ కు అవతల ఎండ్ లో సహాకారం పూర్తిగా కరువైంది.
విమర్శల వర్షం..
రోహిత్, కోహ్లి లు విఫలమవుతుండటంపై మాజీలు విమర్శలు ఎక్కుపెడుతున్నారు. రోహిత్ గత పది ఇన్సింగ్స్ లలో కేవలం 6.88 సగటుతో 150 పరుగులు మాత్రమే సాధించాడు. ఇప్పుడు విమర్శకులందరికి ఇవే ఆయుధాలుగా మారాయి. ఇక్కడ టీమిండియాను కలవరపెడుతున్న మరో అంశం ఏంటంటే.. మొదట ఇన్నింగ్స్ లలో మన బ్యాట్స్ మెన్లు తీవ్రంగా తడబడుతున్నారు. దీనికి వెంటనే చెక్ పెట్టకపోతే మరో ఘోర ఓటమి తథ్యం. పెర్త్ టెస్ట్ లో సెంచరీ సాధించిన కోహ్లి ఆత్మ విశ్వాసంతో కనిపించిన వరుసగా ఆఫ్ స్టంట్ బంతులకు పెవిలియన్ చేరుతున్నాడు. ఇదే పెద్ద సమస్యగా మారింది.
జడేజా రాబోతున్నాడా?
భారత్ కు స్పిన్ ఆల్ రౌండర్ల విషయంలో పెద్ద సమస్య ఎదురువుతోంది. పెర్త్ టెస్ట్ లో ఆడిన వాషింగ్టన్ సాధారణ ప్రదర్శన చేయడంతో రెండో టెస్ట్ కు సీనియర్ స్పిన్నర్ అశ్విన్ ను బరిలోకి దింపారు. పింక్ బాల్ టెస్ట్ లో చెన్నై చిన్నోడు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. గత రికార్డులను పరిశీలిస్తే జడేజాను తీసుకుంటే ఉత్తమమని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కాబట్టి జడేజా రావడం ఖాయమనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
ఆసీస్ బ్యాటింగ్ కూడా..
మరో వైపు ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్ కూడా పెద్దగా ఫామ్ లో లేదు. కేవలం ట్రావిస్, లబుషేన్ మాత్రమే కాసిన్ని పరుగులు చేస్తున్నారు. కంగారు జట్టుకు ఓపెనింగ్ సమస్యతో పాటు లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ సమస్యగా మారింది. కానీ బౌలింగ్ లో మాత్రం మంచి రిథమ్ లో ఉంది. పింక్ బాల్ టెస్ట్ లో స్టార్క్ కెరీర్ బెస్ట్ నమోదు చేశాడు. రెండో టెస్ట్ కు దూరంగా ఉన్నా హజిల్ వుడ్ గబ్బా టెస్ట్ కు టీమ్ తో చేరనున్నట్లు కెప్టెన్ కమిన్స్ ప్రకటించారు.
గత సిరీస్ లో ఇక్కడ జరిగిన మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. గిల్, పంత్ చెలరేగడంతో ఆసీస్ విధించిన 329 పరుగుల లక్ష్యాన్ని చేధించింది. ఆసీస్ ను దాని సొంత గడ్డపైనే ఓటమిని రుచి చూపించింది. 33 ఏళ్లు అప్రహాతింగా ఏలిన గబ్బాపై మనోళ్లు కంగారు జట్టును ఓడించారు.
ప్రస్తుతం గబ్బాలో పిచ్ పై పచ్చికను ఉంచారు. పేస్, బౌన్స్ ఉంటుందని క్యూరేటర్ వెల్లడించారు. టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ తీసుకునే అవకాశం ఉంది.
జట్లు
ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): ఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్‌స్వీనీ, మార్నస్ లాబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కారీ (WK), పాట్ కమిన్స్, మిచ్ స్టార్క్, నాథన్ లియోన్, జోష్ హేజిల్‌వుడ్.
భారత జట్టు: రోహిత్ శర్మ (సి), జస్ప్రీత్ బుమ్రా (విసి), యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, అభిమన్యు ఈశ్వరన్, దేవదత్ పడిక్కల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, రవీంద్ర జడేజా , ఆకాష్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రానా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్. రిజర్వ్‌లు: ముఖేష్ కుమార్, నవదీప్ సైనీ, ఖలీల్ అహ్మద్, యశ్ దయాల్.
IST ఉదయం 5:50 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది.
Next Story