50 ఏళ్ల.. మరపురాని మధుర జ్ఞాపకం-
x

50 ఏళ్ల.. మరపురాని మధుర జ్ఞాపకం-

అంతర్జాతీయ స్థాయిలో, ఒలింపిక్స్ లో 8 స్వర్ణ పథకాలు సాధించిన స్వర్ణ యుగం భారత చరిత్ర. భారత దేశం 1928 నుండి 56 వరకు వరుసగా 6 గోల్డ్ మెడల్స్ సాధించింది.


ఈరోజుకి(15.3.2025) సరిగ్గా 50 సంవత్సరాల క్రితం, అంటే 15.3.1975 తారీఖున భారత దేశం ప్రపంచ హాకీ కప్ ను గెలుచుకుంది. కాకతాళీయంగా ఆరోజు కూడా శనివారమే! ఇంతవరకు భారతదేశం గెలుచుకున్న ఒకే ప్రపంచ కప్ ఇది. హాకీ అంటే భారత్ అనే పేరు పొందిన భారత హాకీ కి అదే చివరి అతిపెద్ద విజయం. ఇక్కడ ఇంకో విశేషమేంటంటే ప్రపంచంలో భారతదేశంతో పాటు హాకీలో పేరుపొందిన పాకిస్తాన్ జట్టుపై విజయం సాధించి మరీ కప్పు గెలుచుకోవడం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అప్పటి ఆటగాళ్లంతా కలిసి ఈరోజు (15.3.2025) న్యూఢిల్లీలో సంబరాలు జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు

కొన్ని దశాబ్దాల పాటు హాకీ ఆట అంటే భారత దేశమే గుర్తుకొచ్చేది. కొన్ని దశాబ్దాల పాటు హాకీ రంగాన్ని ఏలిన దేశం భారతే! ధ్యాన్ చంద్ వంటి దిగ్గజాలు ప్రపంచ హాకీ రంగంలో భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలపడానికి కారకులు. . ఇప్పుడు క్రికెట్ ఆటకి ఎంత క్రేజ్ ఉందో, ఒక 50 ఏళ్ల పాటు హాకీ కి అంతకన్నా ఎక్కువ గుర్తింపు ఉండేది. అప్పట్లో యువతరం హాకీ అంటే పడి చచ్చేవారు. ఇప్పుడు గల్లీలో క్రికెట్ ఆడినట్లు, హాకీ ఆడేవారు. హాకీ భారతదేశపు క్రీడగా గుర్తింపు పొందింది. అంతర్జాతీయ స్థాయిలో, ఒలింపిక్స్ లో 8 స్వర్ణ పథకాలు సాధించిన స్వర్ణ యుగం భారత చరిత్ర. భారత దేశం 1928 నుండి 56 వరకు వరుసగా 6 గోల్డ్ మెడల్స్ సాధించింది. 1964 తర్వాత భారత హాకీ అవసాన దశ మొదలైంది.16 సంవత్సరాలు తర్వాత 1980 రష్యా ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించినప్పటికీ, హాకీ క్రమంగా కనుమరుగు కావడానికి ప్రారంభ దశ మొదలైంది.

అయితే 1975 లో మూడవ హాకీ ప్రపంచ కప్ ను భారతదేశం సాధించింది. అక్కడ నుంచి భారత హాకీ, 1980 ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ తప్పించి పెద్దగా ఏమి సాధించలేదు.

ఇప్పుడు హాకీ అంటే చాలామందికి తెలియదు. కాలక్రమేణా హాకీ ఆట మరుగున పడిపోయింది. దానికి కారణం క్రికెట్ ఒకటే కాదు. కర్ణుడి చావుకి ఎన్నో కారణాలు అన్నట్టు, హాకీ కూడా వెనుకబడిపోవడానికి, అంతరించిపోయే స్థితికి చేరుకోవడానికి కారణం కొంతవరకు హాకీ అసోసియేషన్ కూడా.

మూడోసారికి చేజిక్కిన హాకీ ప్రపంచ కప్

1971లో మొదటిసారి ఈ ప్రపంచకప్ ను నిర్వహించారు దీన్ని పాకిస్తాన్ కైవసం చేసుకుంది. ఈ కప్ ను ఆతిథ్య దేశమైన స్పెయిన్ లోని బార్సిలోన నగరంలో నిర్వహించారు. ఫైనల్స్ లో1-0 తేడాతో స్పెయిన్ ను ఓడించి పాకిస్తాన్ కప్ గెలుచుకుంది. భారత్ మూడో స్థానంలో వచ్చి క్యాంస పతకం తో సరి పెట్టుకోవాల్సి వచ్చింది. 1973 లో నెదర్లాండ్ దేశంలో నిర్వహించిన రెండో ప్రపంచకప్ ను, ఆ దేశమే గెలుచుకుంది. మరోసారి భారతదేశానికి నిరాశ కలిగింది. ఫైనల్ చేరినప్పటికీ నెదర్లాండ్స్ చేతుల్లో ఓడిపోయి రెండో స్థానంతో,రజత పతకం తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కానీ 1975 లో మూడోసారి మలేషియాలోని కౌలాలంపూర్ లో జరిగిన మూడో ప్రపంచకప్ ని భారతదేశం గెలుచుకుంది.

నరాలు తెగే ఉత్కంఠతో సెమీఫైనల్ గెలుపొందిన భారత్.

హాకీ మూడో ప్రపంచకప్ లో భారత జట్టు, దాదాపు సమవుజ్జి అయిన పాకిస్తాన్ తో కలవడం జరిగింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్స్ ఒక సినిమా థ్రిల్లర్ కు తలదన్నే విధంగా నడిచింది. ఈ కప్పు గెలవడానికి భారత జట్టు మొత్తం అద్భుతమైన ప్రదర్శన చేసింది. మలేషియా తో జరిగిన సెమీఫైనల్స్ లో అద్భుతంగా పెనాల్టీ కార్నర్ కొట్టిన అస్లాం షేర్ ఖాన్ భారత జట్టు ఫైనల్ చేరడానికి మార్గం సుగమం చేశాడు. నిజానికి ఈ సెమీఫైనల్సే ఫైనల్స్ గా మారిపోయింది. అస్లాం షేర్ ఖాన్ మాటల్లో చెప్పాలంటే " ఇది తలుచుకున్నప్పుడల్లా నా ఒళ్ళు పులకరిస్తుంది. ఎవరన్నా ఈ మ్యాచ్ గురించి అడిగితే.. నా సంతోషం రెట్టింపు అవుతుంది. ఆరోజు 50 వేలమంది మలేషియా అభిమానులతో తలపడాల్సి వచ్చింది. ప్రేక్షకుల్లో పెద్దగా భారతీయులు లేరు. అందుకే నా జీవితంలో ఎన్నో మ్యాచ్లు ఆడినప్పటికీ, ఈ మ్యాచ్ మాత్రం నాకు అత్యంత ప్రియమైనది ". 3-2 తేడాతో మలేషియా ని ఓడించి భారత్ ఫైనల్స్ చేరింది. మరో సెమి ఫైనల్ లో పాకిస్తాన్ జట్టు 5-1 తేడాతో పశ్చిమ జర్మనీపై ఘన విజయం సాధించి ఫైనల్ లో భారత్ తో తలపడడానికి సిద్ధమైంది.

పాకిస్తాన్ తో ఆడిన థ్రిల్లర్ మ్యాచ్

హాకీ దిగ్గజం ధ్యాన్ చంద్ కుమారుడు అశోక్ కుమార్ మాటల్లో చెప్పాలంటే " పాకిస్తాన్ తో మ్యాచ్ ప్రారంభమైన మొదటి పది నిమిషాల్లోనే పాకిస్తాన్ ఆటగాడు మొహమ్మద్ జహీద్ షేక్ కొట్టిన గోల్ తో జట్టు మొత్తం డీలా పడిపోయింది. ఎలాగైనా ఈ మ్యాచ్ గెలవాలని.. గెలిచి ఆ పథకాన్ని నాన్నకు చూపించాలని అనుకుంటున్న నాకు కాళ్లు చేతులు ఆడలేదు. దాదాపు అందరూ ఆటగాళ్ల పరిస్థితి అదే. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. 44వ నిమిషంలో దొరికిన పెనాల్టీ కార్నర్ లో బంతిని గోల్డ్ పోస్ట్ కు పంపించిన సుర్జిత్ వల్ల భారత్ స్కోర్ సమం చేసింది. అప్పుడు గెలుస్తామన్న నమ్మకం మాలో పెరిగింది. అయినప్పటికీ పాకిస్తాన్ తో గెలవాలంటే కష్టమని మాకు తెలుసు. అయితే తర్వాత, సుర్జిత్ ఫిలిప్స్, సమన్వయంతో నేను చేసిన గోల్ వల్ల 2-1 తో మేము గెలిచాం. మా ఆనందానికి హద్దులు లేవు". ఇంటికి వచ్చిన తర్వాత నాన్నకు పథకం చూపిస్తే నా భుజం తట్టారు. అది చాలు నాకు" 20 రోజుల తర్వాత ఝాన్సీ లోని తన ఇంటికి వచ్చిన అశోక్ కుమార్ ఘన స్వాగతం లభించింది. ఎంత ఘన స్వాగతం అంటే రైల్వే స్టేషన్ నుంచి ఇంటికి మూడు కిలోమీటర్ల దూరం మాత్రమే ఉన్నప్పటికీ, ఇల్లు చేరడానికి మూడు గంటల సమయం పట్టింది! మొత్తం నగరం అంతా అశోక్ కుమార్ ని స్వాగతించడానికి బారులు తీరింది.

ఇప్పటివరకు భారత సాధించిన ప్రపంచకప్ అదొక్కటే.. భారత హాకీ మళ్లీ పూర్వవైభవాన్ని సంతరించుకోవాలంటే మరోసారి ప్రపంచ కప్ గెలవాలి. అది తప్ప మరో మార్గం లేదు.

Read More
Next Story