భారత్‌లోనే కాకుండా ప్రపంచ దేశాల్లో గొప్ప క్రికెట్‌ ప్లేయర్‌గా పేరు తెచ్చుకున్న సచిన్‌ టెండూల్కర్‌ అమెరికా ఆటగాళ్లతో చేరటం వెనుక వ్యూహం ఏమిటి?



క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ దగ్గర క్రికెటర్లు నేర్చుకోవాల్సిన అంశాలు బోలెడున్నాయి. ఆయనను క్రికెట్‌ దేవుడని చాలా మంది అంటుంటారు. క్రికెట్‌ ఆట అంటే ఇష్టంలేకనో, తెలుసుకోవాలనే ఆసక్తి లేకుండానో ఉండే వారికి, క్రికెట్‌ అంటే ఎంతో ఇష్టమైన వారికి సచిన్‌ టెండూల్కర్‌ గురించి బాగా తెలుసు. సచిన్‌ క్రీడా నైపుణ్యానికి, వ్యక్తిగత క్రమశిక్షణకు ఎంతో మంది ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారు. ఆదర్శవంతమైన వ్యక్తులు దేశంలో కొరవడుతున్నరనుకుంటున్న తరుణంలో రెండు తరాల యువత మనస్సల్లో ఒక అత్యుత్తమమైన రోల్‌ మోడల్‌ వ్యక్తిగా సచిన్‌ ఆరాధింపబడుతున్నాడు.

భారత క్రికెట్‌ జట్టులో 16 ఏళ్లకే అవకాశాన్ని అందిపుచ్చుకుని పాకిస్థాన్‌తో ఆడేందుకు వెళ్లాడు సచిన్‌. సియాల్‌ కోట్‌ అనే ప్రదేశంలో క్రికెట్‌ పోటీ జరుగనుంది. భారత జట్టులో నలుగు అవుట్‌ కావడంతో జట్టు గందరగోళంలో ఉంది. వకార్‌ యూనిస్, వసీం అక్రమ్‌ అంటూ ఆరోజుల్లో ప్రపంచమే భయపడే విధంగా అతి వేగంతో బంతులను విసిరే వారు. వారు విసిరిన బంతులను ఆనాటి 16 ఏళ్ల యువకుడైన సచిన్‌ ఎదుర్కొన్నాడు. వకార్‌ యూనిస్‌ విసిరిన బంతి సచిన్‌ ముక్కుకు తగిలి గాయమైంది. రక్తం కూడా వచ్చింది. ఎవరికైనా ఈ విధంగా దెబ్బలు తగిలితే వెంటనే ‘రిటైర్డ్‌ హర్ట్‌’ అనే విధానంతో క్రీడా మైదానం నుంచి బయటకు వెళ్లడం అనేది సాధారణమైన విషయం. అయితే ప్రథమ చికిత్స చేయించుకున్న సచిన్‌ క్రీడా మైదానానికి చేరుకుని ఆట ప్రారంభించాడు. ఇటువంటప్పుడే తన సత్తా ఏమిటో చూపించాలనుకున్నాడు. బంతిని బౌండ్రీకి కొట్టాడు. ఆరోజు ఆయన క్రికెట్‌ లోకంలో ఒక కొత్త పాఠం నేర్చుకున్నారు.
సచిన్‌కు 1998 ఏప్రిల్‌ 22 నాటికి 25 ఏళ్లు నిండాయి. షార్జా క్రీడా మైదానంలో ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ఒక రోజు క్రికెట్‌ పోటీ జరిగింది. ఆ పోటీలో లక్ష్యాన్ని ఛేదిస్తేనే సచిన్‌కు ఫైనల్స్‌లో ఆడేందుకు అవకాశం దక్కుతుంది. ఉన్నట్లుండి స్టేడియంలో సుడిగాలి వీచింది. దీంతో క్రీడాకారులంతా ఎవరికి వారు ఎటు పడితే అటు పరుగెత్తారు. కానీ సచిన్‌ మాత్రం అలాగే ఉండిపోయారు. ఆయన గంభీరతను చూసిన వారు అభినందించలేకుండా ఉండలేకపోయారు. ఆరోజు 143 పరుగులతో ఇండియా జట్టుకు ఫైనల్స్‌లో పాల్గొనేందుకు సచిన్‌ అవకాశాన్ని సాధించి పెట్టాడు. రెండు రోజుల తరువాత జరిగిన ఫైనల్స్‌లో 134 పరుగులు తీసి భారత జట్టు విజయానికి రారకుడయ్యాడు. స్వీకరించిన పనిని ముగించకుండా వెళ్లకూడదనే పాఠం ఆరోజు సచిన్‌ జట్టులోని వారందరికీ అర్థమయ్యేలా చేశాడు. క్రికెట్‌ ఆడే వారికి మాత్రమే కాదు, సచిన్‌ వద్ద మనలాంటి వారు నేర్చుకునేందుకు కొన్ని చక్కని పద్ధతులు ఉన్నాయి. వాటిలో కొన్నింటి గురించి తెలుసుకోవడం అవసరం. ఎందుకంటే ఆయన ఇప్పుడు అమెరికా క్రికెట్‌ క్రీడా శిఖరానికి నేతృత్వం వహించిన నడిపించేందుకు నిర్ణయించుకున్నారు.
పిల్లలు బాగా చదువుకుంటే జీవితంలో బాగా డబ్బు సంపాదించి పైకెదగొచ్చని అనుకుంటారు తల్లదండ్రులు. అదే సరైన మార్గమని తల్లిదండ్రులు భావిస్తారు. ఒక తరగతిలో 50 మంది విద్యార్థినీ విద్యార్థులు ఉంటే అందులో పది మంది కంటే ఎక్కువ ఫస్ట్‌క్లాస్‌లో.. ముందు వరుసలో ఉండే అవకాశం ఉండదు. అంటే మిగిలిన 40 మందికి తెలివి లేదనా? వారు సమాజానికి పనికి రార నా? జీవితంలో వారు ఓడిపోయారని అనుకుందామా? అది కాదని సచిన్‌ విజయాలు నిరూపించాయి. సచిన్‌ పాఠశాల చదువును పూర్తిగా చదువుకోలేదు. అయితే క్రికెట్‌లో సచిన్‌ స్థాయికి విజయాలను అందిపుచ్చుకున్న వారెవరూ లేరనేది వాస్తవం. బాగా డబ్బులు సంపాదించే క్రికెట్‌ క్రీడా కారుల జాబితాలో ఆయన పేరు ఎప్పుడూ అగ్రస్థానంలోనే ఉంటుంది. ఆయన జీవిత పాఠం కేవలం క్రికెట్‌ ఆడితే సరిపోతుందని చెప్పటం లేదు. ఆయన పెద్దగా మాటకారి కాదు. ఏమి చేయబోతున్నారనే విషయాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఏమి చేయగలరనే విషయాన్ని చేతల్లో చూపించాలి. సచిన్‌ ఏది మాట్లాడినా ధృఢ చిత్తంతో ఉంటుంది. ఆయన ఎక్కువగా మాట్లాడకపోయినా ఆయన చేతిలోని బ్యాట్‌ అధికంగా పనిచేసి చూపిస్తుంది. అంటే చేతలతో ఏదైనా సాధించొచ్చని అర్థం చేసుకోవాలి.
సచిన్‌ అత్యుత్తమ క్రికెట్‌ క్రీడాకారుడు. అయితే తాను సమర్థవంతమైన కెఫ్టెన్‌ కాదనే విషయాన్ని ఆయనే గ్రహించాడు. ఆ స్తానం నుంచి వైదొలిగాడు. తన కంటే వయసులో, అనుభవంలో చిన్నవాడైనా గంగూలీ, ద్రావిడ్, దోనీ అంటూ పలువురు కెఫ్టెన్‌లుగా బాధ్యతలు స్వీకరించిన జట్టులో సచిన్‌ ఒక సాధారణ క్రీడా కారునిగా ఉండిపోయారు. తన వంతు కృషిని చేయడంలో మాత్రం నూటికి నూరు శాతం సక్సెస్‌ అయ్యారని చెప్పొచ్చు. మనకంటే వయసులో చిన్నవారు, పెద్దవారు, అనుభవం లేని వారు ఎవరో ఒకరు మీ యజమానిగా ఆదేశాలు ఇస్తూ ఉండవచ్చు. ఈ విషయంలో బాధపడేందుకు ఏమీ లేదు. మీ పనిని మీరు అంకిత భావంతో చక్కగా ముగిస్తే విజయం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందనటానికి ఉదాహరణ సచిన్‌.
క్రికెట్‌ నా జీవితంలో గొప్ప ప్రయాణం. యూఎస్‌లో క్రికెట్‌ క్రీడకోసం నేషనల్‌ క్రికెట్‌ లీగ్‌లో చేరటం నాకు సంతోషంగా ఉంది. ఇది ఎంతో ఉత్తేజాన్ని ఇచ్చిందని బ్యాటింగ్‌ లెజెండ్‌ సచిన్‌ తమతో చెప్పినట్లు ఎన్‌సీఎల్‌ ప్రకటించిన తరువాత సచిన్‌ అవునని తలూపారు. క్రికెట్‌ రంగం ప్రతిధ్వనించేలా కొత్తతరం అభిమానులను సంపాదించి ప్రపంచస్థాయి క్రికెట్‌ కోసం ఒక వేదికను సృష్టించడం ఎన్‌సీఎల్‌ ఆశయం. కొత్తగా సృష్టించే క్రికెట్‌ వేదికకు యూఎస్‌లో క్రికెట్‌ అభివృద్ధిని ప్రత్యక్షంగా చూసేందుకు నేను ఎదురు చూస్తున్నానని టెండూల్కర్‌ చెప్పడం విశేషం. ఎన్‌సీఎల్‌లో ఆటగాడిగా కాకుండా నిర్వాహకునిగా సచిన్‌ చేరినట్లు లీగ్‌ ప్రకటించింది. అందుకే ఎవరైనా తమ పనిని అత్యుత్తమంగా చేసి గుర్తింపు పొందితే చాలు పలువురు మిమ్మల్ని విజయ శిఖరాల వైపునకు తీసుకెళతారని అర్థం చేసుకోండి. సచిన్‌కు ఇలాగే మరెన్నో అవకాశాలు రావాలని కోరుకుందాం.
Next Story