
క్రికెట్ ఆటగాళ్లు
భారత్ - పాక్ మధ్య ఆసియా కప్ ఫైనల్ జరుగుతుందా?
అందరి కళ్లు నేటీ బంగ్లాదేశ్- పాకిస్తాన్ మ్యాచ్ పైనే..
ఆసియా కప్ లో ఇప్పటికే రెండు సార్లు భారత్- పాకిస్తాన్ మ్యాచ్ లు జరిగాయి. ఒకసారి గ్రూప్ స్టేజ్ లో, మరొకటి సూపర్ ఫోర్ దశలో రెండు జట్లు తలపడ్డాయి. ఈ రెండు మ్యాచ్ లలో భారత్, పాక్ ను చిత్తుగా ఓడించింది. పాక్ ఆటగాళ్లు మైదానంలో ఆటకంటే వారి వింత ప్రవర్తన ద్వారా మీడియా పతాకశీర్షికలకెక్కుతున్నారు.
ఇప్పుడు ఈ రెండు జట్లు మరోసారి ఫైనల్ తలపడే అవకాశం కనిపిస్తోంది. ఆసియా కప్ లో భాగంగా ఈ రోజు బంగ్లాదేశ్ తో పాక్ దుబాయ్ వేదికగా తలపడబోతోంది. ఈ రోజు మ్యాచ్ విజేత ఫైనల్ లో భారత్ ను ఎదుర్కొంటుంది.
భారత్ ఇప్పటికే పాక్, బంగ్లాదేశ్ ను ఓడించి ఫైనల్ చేరుకుంది. చివరిదైన మ్యాచ్ లో టీమ్ ఇండియా శ్రీలంకతో ఆడబోతోంది. ఈ మ్యాచ్ కేవలం నామమాత్రం. ఇప్పటికే లంక టోర్నీ నుంచి నిష్క్రమించింది.
పాకిస్తాన్ ఆత్మ విశ్వాసం..
అబుదాబిలో మంగళవారం జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్ లో పాక్, శ్రీలంకను చిత్తు చేసింది. 134 పరుగులను చేధించే క్రమంలో పాకిస్తాన్ 80 పరుగులకే ఐదు కీలక వికెట్లు కోల్పోయింది.
గెలుపుకు మరో 54 పరుగులు అవసరమై తరుణంలో పాక్ అద్భుతంగా ఫుంజుకుని మ్యాచ్ గెలిచింది. హుస్సేన్ తలాత్ 32, మహ్మద్ నవాజ్ 38 పరుగులు జోడించి జట్టును పోటీలోకి తెచ్చారు.
దీనితో మిగిలిన బ్యాట్స్ మెన్ సులువుగా పరుగులు సాధించి మరో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మరో వైపు భారత్ తో జరిగిన చివరి మ్యాచ్ లో బంగ్లాదేశ్ 41 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. వీరు తమ మొదటి మ్యాచ్ లో శ్రీలంకను ఓడించారు.
జూలై లో స్వదేశంలో జరిగిన సిరీస్ లో పాక్ ను బంగ్లాదేశ్ 2-1 తో ఓడించింది. అప్పుడు ఉన్న జట్టే ఇప్పుడు ఉంది.
బంగ్లాదేశ్ బ్యాటింగ్ బలానికి ఒపెనర్ సైఫ్ హసన్ వెన్నెముకగా నిలుస్తున్నాడు. ఈ బ్యాట్స్ మెన్ వరుసగా అర్థ సెంచరీలు సాధిస్తున్నాడు. అలాగే వారి స్పిన్ దాడి కూడా పాక్ తో పోలిస్తే మెరుగ్గా ఉంది.
అనిశ్చితికి మారుపేరైనా పాకిస్తాన్, ఈ మ్యాచ్ లో గెలిచి ఫైనల్ చేరుకోవాలని పట్టుదలగా ఉంది. ఆ జట్టు షాహీన్ ఆఫ్రిదీ, ఫఖర్ జమాన్ వంటి ఆటగాళ్ల నుంచి మంచి ప్రదర్శన రావాలని కోరుకుంటోంది.
‘‘మేము ఆసియా కప్ గెలవడానికి ఇక్కడ ఉన్నాము. దానికోసం మా ప్రయత్నం చేస్తాము’’ అని షాహీన్ అఫ్రిది అన్నారు. ఫైనల్ లో భారత్- పాకిస్తాన్ జట్టు తలపడబోతున్నాయా అని విలేకరులు ప్రశ్నించినప్పుడ.. ‘‘తాము ఇంకా ఫైనల్ చేరుకోలేదు, చేరుకున్నప్పుడు ఆలోచిస్తాము’’ అని అన్నారు.
‘‘మా పని క్రికెట్ ఆడటం, ప్రజలు తమకు ఏమి కావాలో ఆలోచించుకోవచ్చు. మేము ఆసియా కప్ గెలవడానికి ఇక్కడ ఉన్నాము. పాకిస్తాన్ ఆశలను నెరవేర్చడానికి మేము మా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాము’’ అని మరో బౌలర్ రవూఫ్ అన్నారు. దుబాయ్ ఇంటర్నేషన్ క్రికెట్ స్టేడియం పిచ్ చాలా నెమ్మదిగా ఉంటుందని భావిస్తున్నారు. టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.
జట్ల అంచనా..
పాకిస్తాన్: సల్మాన్ అలీ అఘా(కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఫహీమ్ ఆఫ్రఫ్, ఫఖర్ జమాన్, హరీస్ రవూఫ్, హసన్ అలీ, హసన్ నవాజ్, హుస్సేన్ తలత్, ఖుష్ దిల్, మహ్మద్ హారిస్(వికెట్ కీపర్), మహ్మద్ నవాజ్, సాహిజ్జాదా ఫర్హాన్, సయీమ్ అయూబ్, సలీమ్ ఆయూబ్, మహ్మద్ వాసీం జూనియర్
బంగ్లాదేశ్: లిట్టన్ దాస్(కెప్టెన్, వికెట్ కీపర్) తంజిద్ హుస్సేన్, పర్వేజ్ హుస్సేన్ ఎమోన్, సైఫ్ హసన్, తౌహిద్ హృదయ్, జూకర్ అలీ, షమీమ్ హోస్సెన్, నూరుల్ హసన్, మహేదీ హసన్, రిషద్ హోస్సెన్, నసుమ్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మన్, తన్జుర్ రెహ్మన్, మహ్మద్ సైపుద్ధీన్
మ్యాచ్ రాత్రి ఎనిమిది గంటలకు సోనీ నెట్వర్క్ లో ప్రసారం అవుతుంది.
Next Story