పదకొండు సంవత్సరాాల కరువును తీరుస్తారా?
x

పదకొండు సంవత్సరాాల కరువును తీరుస్తారా?

టీమిండియా చివరిగాసారిగా 2013 లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫిని గెలిచింది. ఈ తరువాత ఎప్పుడు ఐసీసీ టోర్నిలో అడుగుపెట్టిన రిక్తహస్తాలే మిగిలాయి. కానీ ఈ సారి..


భారత్ ఐసీసీ ట్రోఫి గెలిచి దశాబ్దం పైనే అయింది. 2023 వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమి పాలైంది. అంతకుముందు దశాబ్దం క్రితం ఇంగ్లండ్ లో జరిగిన ఐసీసీ ఛాంపియన్ ట్రోఫిని ధోని సారథ్యంలోని టీమిండియా విజేతగా నిలిచింది. తరువాత జరిగిన అన్ని ఐసీసీ టోర్నీల్లో ఉత్తచేతులతో తిరిగి వచ్చారు. 2023 ఫైనల్లో ఎన్నో ఆశలతో బరిలోకి దిగిన టీమిండియా ఫైనల్లో ఒత్తిడిని తట్టుకోలేక చిత్తయింది. జూన్ లో యూఎస్ఏ- వెస్టీండీస్ అతిథ్యంలో ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్ లో భారత జట్టుపై మరోసారి అంచనాలు ఉన్నాయి.

టీ20 గేమ్ అంటేనే అనూహ్యమైన స్క్రిప్ట్ లకు పెట్టింది పేరు. అండర్ డాగ్ గా బరిలోకి దిగిన జట్లు విజయాలు సాధించి కప్ ఎగరేసుకుని పోగలవు. ఈ సారి ఐసీసీ ఏకంగా 20 జట్లకు చోటు కల్పించింది. ఇందులో నమీబియా లాంటి చిన్న జట్లతో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లాంటి ఛాంపియన్ లు ఉన్నారు. చాలా సంవత్సరాలుగా కప్ కోసం ఎదురు చూస్తూ సెమీస్, ఫైనల్లో ఓడిపోతున్న కివీస్, దక్షిణాఫ్రికా లాంటి జట్లు కూడా హేమాహెమీలైన ఆటగాళ్లను వెంటేసుకుని మరీ అమెరికా వచ్చాయి. ముఖ్యంగా దక్షిణాఫ్రికా తనకున్న చోకర్స్ అనే పేరును వదిలించుకోవడానికి క్లాసెన్, డికాక్, మిల్లర్, రబాడా వంటి స్టార్లతో బరిలోకి దిగుతోంది.
ఇప్పుడు జరగబోయే గేమ్స్ అన్ని కూడా అమెరికా క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద క్రికెట్ సంబరాలు కావునా ఐసీసీ కూడా భారీగానే ఏర్పాట్లు చేసింది. 29 రోజుల పాటు జరిగే క్రికెట్ సమరంలో 55 మ్యాచ్ లు జరుగనుండగా, ఇందులో 16 మ్యాచ్ లకు అమెరికా ఆతిథ్యం ఇవ్వనుంది. సూపర్ 8 స్టేజ్, సెమీఫైనల్స్, జూన్ 29న ఫైనల్‌తో సహా మిగిలిన 39 గేమ్‌లు వెస్టిండీస్‌లో జరుగుతాయి.
రోహిత్ తెస్తాడా..?
ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా విజయవంతంగా ఐదు టైటిల్లను గెలిపించిన రోహిత్ శర్మ, భారత్ కు ఐసీసీ ట్రోఫి కొరతను తీరుస్తాడని ఆశించి విరాట్ నుంచి పగ్గాలు తీసుకుని అప్పగించారు. అప్పటికే కోహ్లి విజయవంతమైన టెస్ట్ కెప్టెన్ గా పేరుపొందాడు.
అయితే రోహిత్ సారథ్యంలో కూడా భారత్ ఐసీసీ ట్రోఫి దక్కలేదు. 2022 లో ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచకప్ లో భారత్ కాలం చెల్లిన విధానాలు, స్వయంకృత అపరాధంతో ట్రోఫి నుంచి దూరం అయింది. ఇటీవల చేసిన తప్పులను మరోసారి పునరావృతం చేయకుండా ఉండాలని అభిమానులు ఆశిస్తున్నారు.
అయితే ఈ సారి జరిగిన ఐపీఎల్ లో భారత్ బ్యాట్స్ మెన్ మెరుగ్గా ప్రదర్శనలు చేశారు. ఎడాపెడా బౌండరీలు బాదీ సత్తా చాటారు. ఇదే స్థాయిలో మరోసారి బ్యాటింగ్ లో సత్తా చాటితే టీమిండియా ను వేధిస్తున్న టైటిళ్ల కొరత తీరుతుంది. కానీ అమెరికా పిచ్ ల గురించి అంతగా అవగాహన లేదు కానీ..కరేబియన్ పిచ్ లు మాత్రం చాలా స్లోగా ఉంటాయనే పేరుంది. ఇక్కడ భారత పులులు ఎలా గర్జిస్తాయో అన్న ఆందోళన కూడా ఉంది.
అమెరికాలో జూన్ 9న పాకిస్తాన్‌తో జరిగే బ్లాక్‌బస్టర్ క్లాష్‌తో సహా ఇక్కడ తాత్కాలిక ఫెసిలిటీలో రోహిత్ అండ్ కో మరో మూడు గేమ్‌లు ఆడాల్సి ఉంది. ఇక్కడ డ్రాప్ ఇన్ పిచ్ లు వాడుతున్నారు.
అయితే జూన్ 5న తమ ప్రారంభ లీగ్ గేమ్‌లో ఐర్లాండ్‌తో తలపడే ముందు జూన్ 1న అదే వేదికపై బంగ్లాదేశ్‌తో వార్మప్ గేమ్ ఆడటం భారత్‌కు ప్రయోజనం. టోర్నిలో సహ భాగస్వామిగా అమెరికా కూడా బరిలోకి దిగుతోంది. అయితే తమను తేలిగ్గా అంచనా వేయడానికి వీలులేదని బంగ్లాదేశ్, కెనడాలను ఓడించి మరీ చూపింది. గతంలో వన్డే వరల్డ్ కప్‌లో చోటు దక్కించుకున్న కెనడా శనివారం టీ20 ప్రపంచకప్‌లో అరంగేట్రం చేయనుంది.
ఇంగ్లండ్ పరిస్థితేంటీ..
ఈ పొట్టి ప్రపంచకప్ లో ఇంగ్లండ్ డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతోంది. గత ఏడాది జరిగిన వన్డే ప్రపంచకప్ లో ఇంగ్లండ్ అంచనాలు అందుకోలేక లీగ్ దశలోనే వెనుదిరిగింది. అయితే ఈసారి తనను తాను నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉంది.
ఇంగ్లండ్ 2022 T20 ప్రపంచ కప్‌లో అత్యుత్తమ జట్టుగా నిలిచింది. పొట్టి ఫార్మాట్‌లో తమ ఆధిపత్యాన్ని పునరుద్ఘాటించాలని వారు ధృడ నిశ్చయంతో ఉన్నారు. కెప్టెన్ జోస్ బట్లర్ కూడా ఇదే విధమైన గేమ్ ప్లాన్ ను అమలు చేయబోతున్నాడు.
కొత్త ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్‌కి ఇది కఠినమైన కెప్టెన్సీ పరీక్ష. వెస్టీండీస్ తో జరిగిన వామప్ మ్యాచ్ లో ఆ జట్టు ఓడిపోయింది. విండీస్ బ్యాటర్లు చెలరేగి ఆడి ఏకంగా 250 కి పైగా పరుగులు సాధించారు. అయితే భారతదేశంలో జరిగిన 50 ఓవర్ల ప్రపంచ కప్‌కు అర్హత సాధించలేకపోయిన ఈ మాజీ వరల్డ్ ఛాంపియన్(విండీస్) స్వదేశంలో మరోసారి టైటిల్ ముద్దాడాలని కలలు కంటోంది.
గత ఎడిషన్ లో ఫైనల్ చేరిన పాకిస్తాన్ కు ఈ సారి బ్యాటింగ్ లో ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే అంచనాలకు అందని విధంగా ఆడే పాకిస్తాన్ ఏదైన అద్భుతం జరగబోతుందా అనే తరహలో ఆడుతుందనడంలో సందేహం లేదు. మహ్మద్ రిజ్వాన్‌తో పాటు ఓపెనింగ్ చేయడానికి మేనేజ్‌మెంట్ కెప్టెన్ బాబర్ ఆజంను తిరిగి తీసుకువచ్చే ఆలోచనలతో ఉంది. కొత్త కుర్రాళ్లకు అవకాశం వచ్చిన వారు ఉపయోగించుకోలేకపోవడంతో తిరిగి బాబర్ ఒపెనర్ గా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Read More
Next Story