వెండితెరపై విశిష్ట నటనా అధ్యాయం విశ్వనటచక్రవర్తి ఎస్వీ రంగారావు
x

వెండితెరపై విశిష్ట నటనా అధ్యాయం విశ్వనటచక్రవర్తి ఎస్వీ రంగారావు

ఎస్వీ రంగారావుగా తెలుగు చలన చిత్ర పరిశ్రమ చరిత్రలో తనదంటూ ఒక విశిష్ట నటనా అధ్యాయాన్ని సృష్టించుకున్నారు.


"జాయ్ పాతాళభైరవి!"

"సాహసం శాయరా ఢింగరి, రాజకుమారి లభిస్తుంది!"

"నమో మాతా నమోనమహ!"

"కత్తుల రత్తయ్యనురా పచ్చినెత్తురు తాగుతా!"

"పోరా ఘూట్లే", "అరే ఢోంగ్రె"

ఇవి తెలుగు సినీ ప్రేక్షక లోకానికి చిర పరిచితాలైన డైలాగులు. ఒక మహా నటుడి పాత్రలు పలికిన పద విన్యాసాలు.

సినిమా పెద్ద వ్యాపారంగా వేళ్ళూనుకొంటున్న కాలం. జమీందార్లు, భూస్వాములు, సంపన్నుల ధనం పెట్టుబడి రూపాన్ని సంతరించుకొంటున్న కాలం. రంగస్థలాన్ని వెండితెర విశేషంగా ఆకర్షిస్తున్న కాలం. ఓ యువ నాటక రంగస్థల నటుడు సామర్ల వెంకట రంగారావు ఆ ఆకర్షణకు లోనయ్యాడు. అనంతర కాలంలో ఎస్వీ రంగారావుగా తెలుగు చలన చిత్ర పరిశ్రమ చరిత్రలో తనదంటూ ఒక విశిష్ట నటనా అధ్యాయాన్ని సృష్టించుకున్నారు.

1918 జూలై 3న నాటి కృష్ణా జిల్లా నూజివీడులో రంగారావు పుట్టారు. తల్లి లక్ష్మీ నరసాయమ్మ, తండ్రి కోటేశ్వరరావు. ఎక్సైజ్ శాఖలో ఉద్యోగి. రంగారావు మద్రాసు, ఏలూరు, విశాఖ పట్నంలో చదివి బి.ఎస్సీ. పట్టా పొందారు. బ్రిటీషు పాలనలో అగ్నిమాపక శాఖలో ఉన్నత ఉద్యోగం పొందాడు. కానీ అతనిలోని కళాకారుడు సంతృప్తి చెందలేదు.

తొలిగా 15వ ఏట మద్రాసు హిందు ఉన్నత పాఠశాలలో రంగస్థలంపై నటించింది మొదలు నాటక రంగస్థలానికి అల్లుకుపోయారు రంగారావు. అభినయంతో ఏర్పడ్డ అనుబంధంతో ఎదిగి వచ్చి యువ నటుడయ్యారు. ఆంధ్ర నాటక కళా పరిషత్ ఉత్సవాలలో సుప్రసిద్ధ నటులు బళ్ళారి రాఘవ, గోవిందరాజుల సుబ్బారావును చూసి ఉత్తేజం పొందారు. పౌరాణిక, చారిత్రక, సాంఘిక, నాటకాలలో షేక్స్పియర్ ఆంగ్ల నాటకాల్లో నటించారు. ఆ విధంగా అభినయానికి తనదైన శైలిని రూపొందించుకున్నారు. సినిమా రంగస్థలంలో తన కళాభినివేశాన్ని ప్రదర్శించాలని ప్రయత్నించారు.

1946 లో వరూధిని సినిమాలో ప్రవరాఖ్యుడుగా ఎస్.వి.రంగారావు, వరూధినిగా దాసరి తిలకం.

1946లో వరూధిని సినిమాలో కథానాయకుడుగా 'ఎస్.వి.ఆర్. రావు,B.Sc.' కి అవకాశం వచ్చింది. వరూధిని వగలకు, ప్రలోభానికి లొంగని పరమ నిష్ఠాగరిష్ఠుడయిన ప్రవరాఖ్యుడుగా నటించారు. సినిమా బాగున్నా ఆర్థిక విజయం సాధించలేదట. అలాగే రెండుమూడు సినిమాలు. మళ్ళీ ఉద్యోగం. జెంషెడ్ పూర్ లో టా టా కంపెనీలో పెద్ద ఉద్యోగం. 1951 రంగారావు జీవితంలో కీలక మలుపు. విజయా వారి పాతాళభైరవి సినిమాలో మంచి అవకాశం వచ్చింది.

" జాయ్ పాతాళభైరవి!" అంటూ ఉద్యోగాన్ని వదిలేశారు.

"సాహసం శాయరా...! రాజకుమారి లభిస్తుంది."

అంటూ వక్ర దృష్టి, దుష్ట బుద్ధుల మాంత్రికుడిగా ప్రతి నాయకుడి పాత్రలో నటించారు.

1957 మాయాబజార్ సినిమాలో ఘటోత్కచుడు ఆసినిమాకు హైలైట్ పాత్ర.

"అష్టదిక్కుంభికుంభాలపై మన సింహ ధ్వజము క్రాల చూడవలదె

గగన పాతాళ లోకములలోని సమస్థ భూతకోటులు నాకె మ్రొక్కవలదె

ఏ దేశమైన నా ఆదేశముద్రపడి సంభ్రమాశ్చర్యాల

జరుగవలదె

హై హై ఘటోత్కజ - జై హై ఘటోత్కజ అని దేవగురుడె

కొండాగవలదె

నేనె ఈ యుర్వినెల్ల శాసించవలదె

నేనె ఐశ్వర్యమెల్ల సాధించవలదె

నేనె మన బంధు హితులకు

ఘనకీర్తి కట్టబెట్టవలదే...!" అంటూ ఆసినిమాలో ఆ పాత్ర ప్రాముఖ్యతను వెల్లడిస్తాడు. ఆ అద్వితీయ కళాఖండంలో ఘటోత్కజుడుగా అజరమరంగా నిలిచిపోయారు ఎస్. వి. రంగారావు.

ఇక మరి తిరిగి చూడలేదు. తన అద్భుత నటనా పాటవాలతో "ఎస్వీయార్" సినీ రంగంలో విజయవిహారం కొనసాగింది. నటనలో శృంగార, హాస్య, కరుణ, రౌద్ర, వీర, భయానక, బీభత్స, అద్భుత, శాంత నవరసాల ఆవిష్కరణలో తనదైన ముద్రవేశారు. ఎంతటి నటులైనా రంగారావుతో సీన్ లో నటించాలంటే అప్రమత్తంగా ఉండాలి అనే స్థాయిని అందుకున్నారు రంగారావు.

అది ఎలా సాధ్యమైంది?

"ఆంగికం భువనం యస్య వాచికం సర్వ వాఙ్మయం

ఆహార్యం చంద్రతారాది తం నమ: సాత్వికం శివం"

ఇది నాట్య శాస్త్రపు ఆది శ్లోకం అనుకోవచ్చు.

ఈ సమస్త జగతి లేదా ప్రకృతి శరీరంగా,

సమస్త సాహిత్యం వాచికంగా,

చంద్రుడు నక్షత్రాలు అలంకారంగా,

నవరస సమన్వయ విశేషమే సత్వగుణం అయిన శివా (నటరాజా)! నీకు నమస్కారం. అని దీనిభావం.

ఈ మౌలిక అంశాన్ని ఆకళించుకున్నారు రంగారావు.

నృత్య అభినయాల సమాహారమే నాట్యం.

"యతో హస్త స్తతో దృష్టి

యతో దృష్టి స్తతో మన:

యతో మన: స్తతో భావ

యతో భావ స్తతో రస."

అంటే...

"నీ చేతి కదలికల్ని నీ కళ్ళు అనుసరిస్తాయి.

ఆ కంటి చూపును మనసు అనుసరిస్తుంది.

ఆ మనసు భావనను కలిగిస్తుంది.

ఎక్కడ భావం అనుభూతిగా పరిణామం చెందుతుందో అక్కడ రసం ఉద్భవిస్తుంది." అని.

ఈ కళా శాస్త్ర సారాంశాన్ని అణువణువునా జీర్ణించుకున్నారు రంగారావు. అందుకే వాచికాభినయాల సవ్యసాచి అయ్యారు. అందువల్లే సంస్కృత సమాస భూయిష్టమైన సుదీర్ఘ సంభాషణల్ని సైతం అనర్గళంగా చెపుతూ హావభావ సమన్వితంగా ఎంతో అలవోకగా అభినయించగలిగారు.

దీపావళి సినిమా (1960) నరకుడుగా నటించారు. చిత్ర పతాక సన్నివేశం యుద్ధరంగంలో తనతో తలపడిన సత్యభామ తన తల్లి భూదేవి అంశ అని తెలియకముందు సత్యభామతో నరకుడు.

"భునైక సుందరీ! శచ్చంద్రికా సుఖానుభూతిలో విరహగీతా లాలపించాల్సిన విలాసినివి. వీరాలాపనతో విజృంభించటం వికృతంగా ఉంది. సిరీష కుసుమోపేత మనోఘ్నమూర్తివి నీవెక్కడ? ఈ సంగరరంగ మెక్కడ?

అస్త శస్త్రాలకు స్వస్తి చెప్పి నన్నాశ్రయించు. నిన్ను మన్నించి నీ సౌందర్యాన్నారాధిస్తాను...." అంటాడు.

తల్లి అని తెలిశాక ...

"నిన్నామ్మా నేను ధిక్కరించింది. నిన్నామ్మా అవమానించింది. అపరాధం తల్లీ! మహాపరాధం. అమరజీవిననే అహంకారంతో మాతృమూర్తినే విస్మరించాను. నన్ను క్షమించు."అంటూ మాతృమూర్తి భూదేవి బాణ హతికి నేలకొరిగి తల్లడిల్లిన నరకుడుగా రంగారావు నటనా వైదుష్యం అనితరసాధ్యం. ఈ సంభాషణలకు సమస్థాయిలో ప్రదర్శించిన హావ భావ వాచికాల కర చరణ మౌఖినకాభినయ విన్యాసాలు కనులారా చూస్తేనే గాని ఆ మహానటుడి ప్రతిభా వ్యుత్పత్తి బోధపడదు.

మంచి మనసులు (1962 ) సినిమాలో లాయర్ ఆనందరావు కూతురు శాంతి తండ్రి వాదించే కేసులో ఆయనకు వ్యతిరేకంగా డిఫెన్స్ న్యాయవాదిగా వాదించేందుకు తండ్రి అనుమతి కోరే సందర్భం.

ఆనందరావు అంటున్నాడు...

"అంటే నాకే వ్యతిరేకంగానా అమ్మా!?

వెరీ గుడ్, చాలా సంతోషమమ్మా.

ఇంతకంటే నేను గర్వించేదింకేముంటుందమ్మా?

శాంతీ ! ఈ కేసులో నేను గెలిస్తే వకీలుగా నాకు గెలుపు. నువ్వు గెలిస్తే నిన్ను కన్న తండ్రిగా నాకు గెలుపు. ఎటుచూచినా నాకేనమ్మా గెలుపు. ప్రయత్నించు. గాడ్ బ్లెస్ యూ." సాత్వ్వికాభినయంలో రంగారావు ప్రావీణ్యతకు గొప్ప ఉదాహరణ.

1963లో నర్తనశాలలో

1963 నర్తనశాల గొప్పసినిమా. అంతర్జాతీయంగా రంగారావు ప్రతిభాపాటవాలను ప్రపంచ దేశాలకు పరిచయం చేసిన సినిమా. ఎలా?!

కీచక పాత్రలో నట విశ్వరూపాన్ని ప్రదర్శించారు రంగారావు.

"మాలినీ! రసిక చక్రవర్తినని మురిసిపోయే నా గర్వము సర్వమూ ఖల్వము చేశావ్. స్త్రీ హృదయము తెలుసుకోలేకపోయినందుకు సిగ్గుపడుతున్నాను మాలినీ. నిజమే నలుగురిలో నగుబాటు చేస్తే అభిమానవతికి ఆగ్రహం కలగటం సహజం. ఇప్పటికైనా అనుగ్రహించావు ధన్యుణ్ణి. ...

ఏది నీ కడగంటి చూపుల్తో అమృత వర్షం కురిపించు. నీ సరస వచన మాధురితో శ్రవణానందంకలిగించు. రా సైరంధ్రి. దేవతలనైనా ఏనాడూ చేసాచి అర్థించని నేను ఈనాడు దీనుడనై నిను వేడుకొంటున్నాను." సినిమాలో అత్యంత కీలక, మహాద్భుత సన్నివేశం. ఇందులోని నటీనటులిద్దరూ మహామహులు. ఎవరికెవరూ తగ్గని తమ నటనా కౌశలాన్ని ప్రదర్శించారు. అందుకే వారు మహానటులుగా ప్రేక్షక రసహృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.

అందుకే ఆ సినిమా అంతర్జాతీయ ఖ్యాతిని అందుకొంది. జకార్తాలో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శనకు వెళ్ళింది. ఎస్ వి ఆర్ "అంతర్జాతీయ ఉత్తమ నటుడు" అవార్డును అందుకొన్నారు. ఏ సంభాషణా లేని కేవలం హస్త విన్యాసం, ఉచ్ఛ్వాస నిశ్వాసలతో, కనుబొమల లయ విన్యాసంతో ప్రత్యర్థి పాత్రను నిశ్చేష్టితలోకి నెట్టేసే నిపుణతను వశపర్చుకొన్నారు రంగారావు. పాండవ వనవాసం సినిమా(1965) కురు సభలో భీమ దుర్యోధన సంవాద దృశ్యం ఇందుకు చక్కని తార్కాణం.

1966 మోసగాళ్ళకు మోసగాడు, "కత్తుల రత్తయ్యను రా పచ్చినెత్తురు తాగుతా" అంటూ 1972లో, అలాంటి మరికొన్ని వైధ్యభరిత సినిమాల్లో చేశారు. ఘూట్లే, ఢోంగ్రె లాంటి డైలాగులు తెలుగు నాట రంగారావు పాపులర్ చేశారు.

రంగారావు నటులే కాదు, ఉత్తమ చిత్రాల దర్శకులు కూడా. చదరంగం, బాంధవ్యాలు సినిమాలు ఉత్తమచిత్రాలుగా బహుమతులు పొందాయి.

1972లో పండంటి కాపురంలో

ఎస్ వి రంగారావు నాటితరం మహానటులు అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి తారక రామారావు, చిత్తూరు నాగయ్య, గుమ్మడి వెంకటేశ్వరరావు, సి. నాగభూషణం, సావిత్రి, జమున, కన్నాంబ, సూర్యకాంతం తదితరులతో నటించారు. అదో సినీ స్వర్ణయుగం.

చివరిగా 1974లో యశోదకృష్ణ లో కంసుడుగా నటించారు. 28ఏళ్ళ సినీ జీవితంలో 148 తెలుగు సినిమాల్లో, తెలుగు, హిందీ, తమిళం, కన్నడం, మలయాళం భాషల్లో మొత్తంగా 300లకు పైగా సినిమాల్లో నటించారు.

అన్నై, శారద, నానుం ఒరుపెణ్, కర్పగం, నర్తనశాల సినిమాలకు భారత రాష్ట్రపతి చేతులమీదుగా ఉత్తమ నటుడు బహుమతులు అందుకున్నారు. 1955లో వచ్చిన బంగారు పాప సినిమాలో రంగారవు నటన చూసి ప్రపంచ ప్రసిద్ద నటుడు చార్లీ చాప్లిన్ ప్రశంసించారు. తెలుగునాట సినీ ప్రేక్షక లోకం నుండి "విశ్వనటచక్రవర్తి, నటసార్వభౌమ, నటసింహ, నటశేఖర బిరుదులు అందుకొన్నారు. భారత సినీ పరిశ్రమ నూరేళ్ళ సందర్భంగా 2013 లో భారత ప్రభుత్వం ఎస్. వి. రంగారావు తపాళాబిళ్ళను విడుదల చేసింది .

ఎస్ వి రంగారావు తన 56వ ఏట 1974 జులై 18న గుండెపోటుతో మద్రాసు (నేటి చెన్నై)లో తుదిశ్వాస విడిచారు.

Read More
Next Story