
అన్ని రంగులు మంచివి కావు!
కలర్ త్రోయింగ్ యాప్స్ఆగ్ మెంటెడ్ రియాలిటీ యాప్స్ సోషల్ మీడియా ఫిల్టర్స్ తో హోలీ సాంకేతిక విప్లవంలోకి అడుగుపెట్టింది.
రంగుల పండుగగా పేరు పొందిన హోలీని భారతదేశంలోనే కాకుండా నేపాల్, బంగ్లాదేశ్ అలాగే ప్రవాస భారతీయులు కూడా ఘనంగా జరుపుకునే సంస్కృతి ఎప్పటినుండో ఉంది.హోలీ అంటే సంతోషం,సంబరమని అందరికి తెలిసిందే కానీ పండుగ తెలియకుండానే చాలా సార్లు సాముహిక ఉన్మాదానికి కూడా దారి తీసే ప్రమాదం కూడా ఉంది. దీనికి నిదర్శనమే ఈ సారి రి హోలీ సందర్భంగా రాజస్తాన్ లో చోటు చేసుకున్న ఒక విషాదం.ఒక వ్యక్తి తన మీద హోలీ రంగులు పులమడానికి వచ్చిన వారిని అడ్డుకోవడంతో వారు అతన్ని కొట్టి ,గొంతు నొక్కి చంపారు. ఈ సంఘటనతో ఆగ్రహించిన రాజస్తాన్ లోని దౌసా గ్రామస్తులు ఆ వ్యక్తి మృతదేహంతో రహదారిని దిగ్బంధించి నిరసన తెలియజేసారు. రంగులతో జీవితం మీద కొత్త ఆశలు చిగురించాల్సిన హోలీ ఒక వ్యక్తి జీవితం అంతమవ్వడానికి ఒక పరోక్ష కారణం అయ్యింది. ఇంట్లో జరుపుకునే దసరా,ఉగాది లాంటి పండుగలకు భిన్నమైనది హోలీ.ఎక్కువగా జనమంతా బహిరంగంగా బయటకు వచ్చి ఒకరి మీద ఒకరు రంగులు చల్లుకుంటూ జరుపుకునే ఈ పండుగను ఇంకో కోణంలో గమనిస్తే ఈ హోలిని జనసమ్మర్థం ఉన్న ప్రదేశాల్లో జరుపుకునే వారు చాలాసార్లు తమకు తెలియని వారిపై,అలాగే ఇష్టం ఉందొ లేదో తెలుసుకోకుండా రంగులు చల్లిన ఘటనలు కూడా జరుగుతూనే ఉన్నాయి. చూడటానికి ఇది పండుగలా పైకి కనిపించినా ఆ జరుపుకునే పద్ధతిలో ఎదుటి వ్యక్తీ స్వేచ్చను హరించడం దృష్టిని దాటిపోతూ సాధారణ అంశంగా మారిపోతుంది. ఇప్పుడు రాజస్తాన్ లో జరిగిన విషయం కూడా దీనికి నిదర్శనమే. ఒక వ్యక్తిని చంపేంత ఉన్మాదం ఒక పండుగ ప్రేరణగా తీసుకోవడం ఏ కోణంలో చూడాలి?
ఇప్పటికే తెలంగాణలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. ఈ సందర్భంలో హోలీ వల్ల జరిగే నీటి వృధా కూడా ఆలోచించాల్సిన విషయమే. ఇప్పటికే బెంగుళూరు లాంటి రాష్ట్రాలు ఈ నీటి సమస్య కారణంగానే పోయిన సంవత్సరం డ్రై హోలీ జరుపుకున్నాయి. ముఖ్యంగా హోలీ జరుపుకునే వారు ఈ నీటి సమస్యను కూడా దృష్టిలో ఉంచుకోవాలి. హోలీ రంగులలో ఉండే రసాయనాల వల్ల వచ్చే ప్రమాదాల నుండి కూడా జాగ్రత్త పడాలి.
ఇకపోతే ఈ డిజిటల్ యుగంలో పండుగలను కూడా డిజిటల్ గా జరుపుకునే ప్రగతి దూసుకు వచ్చింది. కలర్ త్రోయింగ్ యాప్స్ (Color Throwing Apps),ఆగ్ మెంటెడ్ రియాలిటీ యాప్స్ (AR Apps ),సోషల్ మీడియా ఫిల్టర్స్ ద్వారా హోలీ కూడా సాంకేతిక విప్లవంలోకి అడుగుపెట్టింది. భవిష్యత్తులో కూడా డిజిటల్ హోలీ పూర్తీ స్థాయిలో జరుపుకోవచ్చు. వర్చువల్ రియాలిటీ హోలీ ,ఏ ఐ ఆధారిత హోలీ ,మెటావర్స్ లో కూడా హోలీ జరుపుకోవచ్చు.
పర్యావరణ పరిరక్షణ, నీటి వృధా జరగకుండా ఉండటం కోసం,అలాగే సామూహికంగా జరుపుకునే ఈ పండుగలో తలెత్తే అసహనం వల్లా హోలీ కూడా డిజిటల్ ట్రెండ్ పండుగగా పూర్తి స్థాయిలో మారితేనే ఈ పండుగ ఒక నిజమైన వేడుకగా మారుతుంది.
* * *