ప్రతిపక్షనేతగా కెసిఆర్ కు వచ్చే 10 సమస్యలివే...
x
అసెంబ్లీ ముఖ్యమంత్రి కెసిఆర్ (సోర్స్: తెలంగాణ ప్రభుత్వం)

ప్రతిపక్షనేతగా కెసిఆర్ కు వచ్చే 10 సమస్యలివే...

కెసిఆర్ వంటి నేత ప్రతిపక్ష నాయకుడిగా సభలో కూర్చుంటారా, లేదా? ఇదే ఇపుడు వూరంతా వేసుకుంటున్న ప్రశ్న. ప్రతిపక్ష నేతగా కూర్చుంటే ఏమవుతుందో తెలుసా!తెలంగాణ కొత్త శాసన సభ ఏర్పడింది. కాంగ్రెస్ శాసన సభా పక్షనాయకుడి ఎంపిక పూర్తి అయింది. మరిక ప్రతిపక్ష నేత ఎవ్వరు? లెక్క ప్రకారం భారత రాష్ట్రసమితి (బిఆర్ఎస్) నేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు (కెసిఆర్) ప్రతిపక్ష నేత కావాలి. కానీ అవుతారా.

ప్రతిపక్షనేతగా మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ ఉండక పోవచ్చని టిఆర్ ఎస్ కార్యకర్తల్లో ఒక టాక్ వినడుతూ ఉంది. పదిహేనేళ్ల ఉద్యమం నడిపి, ఆపై పదేళ్ల ప్రభుత్వం నడిపిన వ్యక్తి ప్రతిపక్షలో కూర్చోవడమేమిటి? అవును ఇది చాలా పెద్ద సమస్యే. చిక్కు సమస్య.

దానికి తోడు, కెసిఆర్ ఎవరినైతే తీవ్రంగా ద్వేషించాడో ఆ వ్యక్తి ముఖ్యమంత్రి పదవిలో ఉంటాడు. సభా నాయకుడిగా ఉంటాడు. ఇది ప్రతిపక్షంలో కూర్చొనే కెసిఆర్ కు చాలా ఇబ్బందికరమయిన విషయం. ఎందుకంటే,మొదట రేవంత్ ని ముఖ్యమంత్రిగా అంగీకరించాలి. తర్వాత రేవంత్ ని సభానాయకుడిగా గౌరవించాలి. ఇదెక్కడి వింత!

ముఖ్యమంత్రి, సభా నాయకుడయినందువల్ల సభలో ఆయనకే ప్రాముఖ్యం ఇస్తారు. కెసిఆర్ లేచి నిలబడి, ఉపన్యాసం ఇచ్చేటపుడు సభా నాయకుడి హోదాలో రేవంత్ చేయిఎత్తితే స్పీకర్ "ఒక్క మాట, కెసిఆర్ గారూ, మీరు కొద్ది సేపు ఆగండి, లీడర్ అఫ్ ది హౌస్ రేవంత్ ఏదో చెబుతున్నారు," అని ఆయన వారించాలి. మధ్యలో జోక్యం చేసుకునేందుకు రేవంత్ కు అనుమతిస్తారు. ఇది ఒకసారి, రెండు సార్లు, ఎన్ని సార్లయినా జరుగవచ్చు.

అందువల్ల ఇక సభలో కేసిఆర్ ప్రాముఖ్యం తగ్గిపోతుంది. ఆయన లేచి నిలబడ్డపుడల్లా కాంగ్రెస్ వాళ్లు గోల గోల చేస్తారు. కూర్చో అంటారు. ఎందుకంటే, అవతలి వ్యక్తిని చులకన చూడటం తెలంగాణ పాలిటిక్స్ కి నేర్పించింది కేసిఆరేనని చాలామంది చెబుతారు. ఈ గుణమే ఆయన్ని ఎన్నికల్లో ఓడించిందని ఇప్పటికే ప్రాంతీయ, జాతీయ పత్రిలకలన్నీ రాసేశాయి. విశ్లేషించాయి. ఒక కంక్లూజన్ కు వచ్చేశాయి. ఇది తప్పని సరిగా రోజూ సభలో ఎదరయ్యే సీన్.

గత పదేళ్ల కాలంలో బలహీన పడిన కాంగ్రెస్ మీద, మర్యాదస్తుడయిన భట్టి మీద, ఇతర కాంగ్రెస్ సభ్యుల మీద కెసిఆర్ విసిరిన సెటైర్లు మర్చిపోయిఉంటారా. ఎవ్వరూ మర్చిపోయి ఉండరు.

రేవంత్ రెడ్డి ఒక వైపు నుంచి కాంగ్రెస్ సభ్యులు ఒకవైపు నుంచి నరుక్కొస్తారు. కెసిఆర్ విసిరిన ఒక సెటైర్ కు రెండు సెటైర్లు సమాధానమవుతాయి. తిట్టుకు తిట్టుకు సమాధానం అవుతుంది. ఇకనుంచి ప్రజాస్వామ్యం ఎమిటో, తెలంగాణ ప్రజలు ఎమిటో, ప్రజా తీర్పు అర్థం ఏమిటో కాంగ్రెస్ వాళ్లు ఉపన్యాసాలు ఇస్తారు.ఇది ప్రజలు వాళ్లకిచ్చిన అవకాశం.

మునుపటి లాగా కెసిఆర్ తన ఔన్నత్యం, తెలంగాణ ఉద్యమం, ఆశయాలు, తన త్యాగం, తన చాణక్యం, మోదీతో తన స్నేహం, మృత్యు ముఖంలోనుంచి తను ఎలా బయటకు వచ్చింది ఇక సభలో చెప్పడం కష్టం.

ఆయన ఏం చెప్పడానికి లేచినా కాంగ్రెస్ వాళ్లు లేచి, బల్లలు చరిచి, కేకలు వేసి, ఈలలు వేసి, నినాదాలు చేసి ‘ప్రజలంతా నిన్ను తిరస్కరించారు,ఇక చాల్లే కూర్చో’ అంటారు.

ఇది కెసిఆర్ లాంటి నేతకే కాదు ఎవరికైనా భరించలేని బాధకలిగిస్తుంది.ఓడలు బండ్లయినపుడు ఉండే బాధ.

అందునా తాను 60 వేల పుస్తకాలు చదివిన మేధావి. రేవంత్ కనీసం ఆరవై పుస్తకాలైనా చదివి ఉంటారా. ఒక వేళ రేవంత్ అరవై పుస్తకాలు చదివినా, అరవై వేలకి, అరవై ఉన్న తేడా చాలాఎక్కువ. ఇలా ప్రతి రోజు సభలో కెసిఆర్ కు ముళ్లమీద నడక ఉంటుంది.

కాబట్టి ఆయన ఈ చిన్న చూపు భారిన పడలేక ప్రతిపక్ష నాయకుడి హోదాను తీసుకోనే తీసుకోడని అంటున్నారు. ఆ బాధ్యతలను కొడుకు కెటిఆర్ కో, మేనల్లుడు హరీష్ రావుకో అప్పగించి తాను లైవ్ డిబేట్ల్లు చూస్తూ పార్లమెంటు ఎన్నికల గెలిచే వ్యూహాలు రచిస్తూఉంటాడని వూరంతా వినబడుతూ ఉంది. కెటిఆర్, హరీష్ రావుకి కాకుండా, పెద్ద మనిషి కడియం శ్రీహరికి ప్రతిపక్ష నాయకుడి హోదా ఇప్పించి తమ ఔదార్యం చాటుకోవచ్చనే చర్చ కూడా కొన్ని వర్గాల్లో వినబడతుూ ఉంది. అసలీ గొడవంతా లేకుండా ఉండేందుకు ఆయన లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి, గెలిచి ఢిల్లీలో భారత రాష్ట్ర సమితి చక్రం తిప్పేందుకు ప్రయత్నిస్తారని మరికొందరి వాదన.

ఇలాంటి సంప్రదాయం రాజకీయాల్లో కొత్తేమీకాదు. తిమిళనాడులో కరుణానిధి, జయలలిత ఇలాగే చేసేవారని తమిళ జర్నలిస్టు మిత్రులచెప్పారు. ప్రతిపక్షంలో కూర్చోలేక అసెంబ్లీకి రావడం మానేసే వారని చెబుతున్నారు.

ఒక వేళ గౌరవ ప్రదంగా ప్రతిపక్షం కూర్చుని, ప్రభుత్వానికి నిర్మాణాత్మక సహకారం అందించేందుకు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అసెంబ్లీకి వస్తే ఏమవుతుంది? ఆయనకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. అందులో కొన్ని:


1. సభలో తను ద్వేషించిన వ్యక్తి, తాను గుర్తించేందుకు నిరాకరించిన వ్యక్తి ముఖ్యమంత్రిగా కావడం ఆయన ఎదురుగా తాను ప్రతిపక్ష నేత హోదాలో కూర్చోవాలి. ముఖ్యమంత్రిగారూ అనే సంబోధించాలి.

2. మరొక వ్యక్తిని సభా నాయకుడిగా తాను గుర్తించాలి.గౌరవించాలి.

3. ఇంతవరకు తాను కనుసైగతో నడిపిన సభలోనే తను మాట్లాడాలంటే స్పీకర్ అనుమతి కావాలి.స్పీకర్ కూర్చోమంటే కూర్చోవాలి.

4. తను మాట్లాడేపుడు సభా నాయకుడు లేచి నిలబడితే, కెసిఆర్ గారూ మీరు ఒక నిమిషం ఆగండి అని స్పీకర్ అంటే తాను కూర్చోవాలి.

5. తను ద్వేషించిన వ్యక్తికి సభలో తన కంటే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడాన్ని చూస్తూ ఉండాలి

6. మాట్లాడేందుకు తాను లేచి నిలబడినపుడల్లా కాంగ్రెస్ సభ్యులు డౌన్ డౌన్ నినాదాలు చేయవచ్చు, షేమ్ అని అని అరవచ్చు. మాట్లాడే అవకాశమీయకుండా గోలచేయవచ్చు

7. తాను మాట్లాడే అవకాశమే రాకపోవచ్చు.

8. సభనుంచి తాను వాకౌట్ చేయాల్సి రావచ్చు.

9. తన పదేళ్ల పాలనని చీకటియుగంగా వర్ణించడం మొదలవుతుంది. దాన్ని భరిస్తూ వినాలి.

10. విశాలమయిన ముఖ్యమంత్రి ఛేంబర్ నుంచి ప్రాముఖ్యం లేని ప్రతిపక్ష నాయకుడి గదికి మారాలి.

ఇలా అన్ని చోట్ల ఒక్క దెబ్బతో కెసిఆర్ ప్రాముఖ్యం తగ్గిపోతుంది. ఇది ఎవరికైనా కష్టమే.

అందువల కెసిఆర్ ప్రతిపక్ష హోదా స్వీకరించకుండా, కెటిఆర్ కో, హరీష్ రావు కో ఇచ్చితాను సభకు రావడమే మానేస్తారని ఊరంతా టాక్.

Read More
Next Story