రేవంత్ రాకతో కాంగ్రెస్ లోకి రివర్స్ మైగ్రేషన్ మొదలవుతుందా?
x

రేవంత్ రాకతో కాంగ్రెస్ లోకి రివర్స్ మైగ్రేషన్ మొదలవుతుందా?

మొన్నమొన్నటి దాకా కెసిఆర్ చాణక్యం అన్నవాళ్లు ఇపుడు రేవంత్ రాజకీయం అంటున్నారు...అదేంటి?


ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రారు. ఎపుడూ లేనంత నిశబ్దంగా, ఎలాంటి చడీ చప్పుడు లేకుండా తన ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు.

ఇక ఆయన అక్కడి నుంచి బయటకురారు. ఇక హైదరాబాద్ లో రేవంత్ రాజకీయ మొదలవుతుందని సర్వత్రా వినబడుతూ ఉంది.

రేవంత్ రాజకీయం ఏమిటి?

కెసిఆర్ ఫామ్ హౌస్ అంటే గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవల్లి దగ్గిర కెసిఆర్ కట్టుకున్నకోట. భారీ బందోబస్తు. చుట్టూరెండు కిలోమీటర్ల దాకా నరమానవులను రానీయరు. “ఆయన కోట దాటి గజ్వేల్ కు ఎపుడూ రారు, మమ్మల్ని కోటలోనికి రానీయరు,” గజ్వేల్ లో చాలా మంది చెబుతారు. ఈ కోటలోని వ్యవసాయక్షేత్రంలోని నివాసంలో కూర్చుని ఆయన ఏకాంతంగా రాజకీయ వ్యూహాలు రచిస్తారని ప్రతీతి. అందుకే ఆయన వ్యూహాలకు తిరుగుండవని కథలు కథలుగా చెబుతారు. అందుకు రకరకాల ఆయన చాణక్యం మీద రకరకాల కథనాలు వనివస్తున్నాయి.

ఆదివారం సాయంకాలం, ఎన్నికల్లో పరాజయం ఖరారు అయ్యాక, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేందుకు రాజ్ భవన్ వస్తున్నానని కబురు పంపినా వెళ్లకుండా తన మేనల్లుడి కారులో ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారని పత్రికల్లో వార్తలొచ్చాయి. ఆయన ఫామ్ హౌస్ లో మౌనంగా కూర్చోరు. ఆయన చాణక్యమస్తిష్కం కూచోనీయదు. ఆయన తన 39 స్థానాలను 60 ఎలా దాటించాలనే ఆలోచిస్తూ ఉంటారు. ఈ 39కి బిజెపి వారి 8, ఎం ఐ ఎం కు వచ్చిన 7 కలిస్తే 55 అవుతుంది. మెజారిటీ చూపించుకోవడానికి అవసరమయిన 60 స్థానాలకు ఇది బాగా దగ్గరిలో ఉంది. కాబట్టి కెసిఆర్ మస్తిష్కం వేడెక్కుతుంది. ఏదో జరుగుతుంది. తక్షణం జరగకపోయినా, డిసెంబర్ సూపర్ సండే సృష్టించిన వేడి చల్లారాక తీరుబడిగా ఆయన పాచికలు విసురుతారు, అని చాలా మంది ఆయన అభిమానులు చెబుతున్నారు.

గతంలో ఆయన ఇలా టిడిపిని మాయం చేశారు. కాంగ్రెస్ ను కభలించే ప్రయత్నం చేసి కొంతవరకు విజయవంతమయ్యారు. కొద్ది రోజులాగండి, ఏం జరుగుతుందో చూడండి అంటున్నారు. అయితే, ఆయన తెలుగు దేశం పార్టీలను, కాంగ్రెస్ ను చీల్చి పేరు మార్పించి టిఆర్ ఎస్ (ఇపుడు) విలీనం చేసుకునేందుకు ఆరోజు ఆయన చాలా బలంగా ఉన్నారు, ఇటుపక్క పార్టీలు బలహీనపడి దిక్కుతోచని స్థితిలో అల్లాడుతున్నాయి. దానికి తోడు టిడిపి, కాంగ్రెస్ లకు కెసిఆర్ ను అడ్డుకునేంత శక్తిలేదు, వనరులు లేవు. కెసిఆర్ ఒక సారి కొమ్మవూపితే రాలిపోయే పిందెల్లాగా ఈ పార్టీల ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు ఉన్నారు. అపుడు కెసిఆర్ కు రెండు రకాల బలం అండగా ఉండింది. అది తెలంగాణ ఉద్యమం నాయకత్వం, పార్టీని ఎన్నికల్లో గెలిపించిన చాణక్యం. అందువల్ల అపుడు రాజకీయం సులువు అయింది. ఇపుడా పరిస్థితి ఉందా.

లేదు, అంటున్నారు సీనియర్ పాత్రికేయుడు నందిరాజు రాధాకృష్ణ. ఎందుకంటే, ప్రజలు తీర్పు చాలా నిర్ద్వంద్వంగా ఉంది, బిఆర్ ఎస్ పాలన మీద ఇదొక తిరుగుబాటులాగా వచ్చింది, అందువల్ల కెసిఆర్ గాని, మరొకరు గాని రేవంత్ ప్రభుత్వాన్ని అస్థిరపరి చే ఆలోచనలు చేయకపోవచ్చు అని ఆయన అన్నారు. “2023 అసెంబ్లీ ఎన్నికల తీర్పు చాలా బలంగా వచ్చింది. ప్రజలు కాంగ్రెస్ వైపు మళ్లారని ఫలితం బట్టి తెలుస్తుంది. అందువల్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే లెవరయినా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తరిమి తరిమి కొడతారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి బారీ బహుమతి రాకపోయినా, బలమయిన బహుమతి వచ్చింది. కాబట్టి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు ఏవైపు నుంచి ఎదురుకాకపోవచ్చు,” అని ఆయన అన్నారు.

అయితే, నిన్న మరొక విచిత్రం జరిగింది. ఫలితాలింకా పూర్తిగా రాకముందే, భద్రాచలం బిఆర్ ఎస్ ఎమ్మెల్యే డా. తెల్లాం వెంకటరావు పిసిసి అధ్యక్షుడు ఎ రేవంత్ రెడ్డినికలుసుకుని మద్దతు ప్రకటించారు. ఇది బిఆర్ ఎస్ అధినేతను కలవర పరిచే విషయం. దీనిని చూస్తే సీన్ రివర్స్ అవుతుందేమోననే అనుమానం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ రాజకీయాల్లో పార్టీ మారడం అంతపెద్ద నేరమయిన వ్యవహారం కాదు. పొద్దున ఒక పార్టీలో చేరి మధ్యాహ్నం వెనక్కొచ్చి సాయంకాలం మళ్లీ మొదటి పార్టీలోకే దూకడం గత పదేళ్లలో నిత్యమూ జరిగింది. నియోజకవర్గం అభివృద్ధి పేరుతోనో, కెసిఆర్ డెవెలప్ మెంట్ మోడల్ బాగుందనో చెప్పి కాంగ్రెస్, టిడిపి లనుంచి ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు నాటి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. అలాగే డిశ్రీనివాస్ లాంటి సీనియర్ కాంగ్రెస్ నేతలు కూడా కాంగ్రె స్ లో చేరి రాజ్యసభ కు నామినేట్ అయ్యారు. అందువల్ల తెలుగు రాజకీయాల్లో లబ్ధి కోసం, ఉనికి కోసం పార్టీలు మారేందుకు ఎవరికీ నైతిక విలువలు అడ్డురావు.

అయితే, కాంగ్రెస్ పార్టీకి ఇపుడు బలమయిన నాయకత్వం రావడం వల్ల ప్రభుత్వం అస్థిరపడటం కాదు, రివర్స్ మైగ్రేషన్ జరగవచ్చని మరొక సీనియర్ జర్నలిస్టు కొండం అశోక్ రెడ్డి వ్యాఖ్యానించారు. గత పదేళ్లలో టిడిపి నుంచి కాంగ్రెస్ నుంచి బిఆర్ ఎస్ లోకి వెళ్లిన వారంతా రేవంత్ రెడ్డికి తెలిసినవారే. వాళ్లంతా ఇపుడు కాంగ్రెస్ లోకి వచ్చే అవకాశం లేకపోలేదని ఆశోక్ రెడ్డి అన్నారు.

ఉదాహరణకు కెసిఆర్ మంత్రివర్గంలో ఉన్న చేమకూర మల్లారెడ్డి తెలుగుదేశం నుంచి బిఆర్ ఎస్ లో చేరితే, మరొక మంత్రి, సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ నుంచి ఫిరాయించారు. చాలా మంది ఉన్నారు. వాళ్లంతా బిఆర్ ఎస్ లో నాడు ఎందుకు చేరారో అందుకే ఇపుడు కాంగ్రెస్ లోకి చేరతారనేది ఆయన అభిప్రాయం.

“బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన కొంత మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధం కావచ్చు. ఇలాగే బిఆర్ ఎస్ లో ఉన్న మాజీ కాంగ్రెస్, మాజీ టిడిపి నేతలు కొందరు కాంగ్రెస్ లోకి వస్తారు. అదే విధంగా హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలలో గెలిచిన మరికొందరు మంది ఎమ్మెల్యేలు స్థానిక కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి వెనకాడకపోవచ్చు,” అని అశోక్ రెడ్డి అన్నారు.

మరొక వర్గం వాదన ప్రకారం రెడ్డి కుల సమీకరణను రేవంత్ రెడ్డి ఇంకా ఉధృతంగా కొనసాగిస్తాడని, ఫలితంగా బిఆర్ ఎస్, బిజెపి లో ఉన్న చాలా మంది రెడ్లు, రాష్ట్ర ప్రయోజనాల రీత్యా, నియోజకవర్గం ప్రయోజనాల రీత్యా రేవంత్ ని బలపరుస్తారుని అంటున్నారు.

“తొలినుంచి రేవంత్ రెడ్డి రెడ్డికుల సమీకరణకోసం కృషి చేస్తున్నారు. రెడ్లంతా ఒక రాజకీయ శక్తిగా ఏకంగా కావాలని ఆయన బహిరంగంగా ప్రకటన చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రెండ్ల సొంత పార్టీ అని అంతా కాంగ్రెస్ లోకి రావాలని పిలుపునిచ్చారు. ఈ బహిరంగ ప్రకటన ఇతర బిసి నేతలను కొంతవరకు ఇబ్బంది పెట్టినా, వాళ్లెవరూ బయటకు ఎమీ అనలేకపోయారు. రెడ్ల సమీకరణ రెడ్ల యువకులను బాగా ఉత్తేజపరిచింది. వాళ్లంతా కాంగ్రెస్ వైపుమళ్లారు. కెసిఆర్ పథకాలనుంచి లబ్ది పొందుతున్న రెడ్లు కూడా రేవంత్ నే బలపర్చినట్లు ఈ ఎన్నికలు స్పష్టంగా చెబుతాయి. అందువల్ల రెడ్ల సమీకరణ జరుగుతుంది, ఉధృతంగా కొనసాగుతుంది,” కాంగ్రెసే నేత ఒకరు చెప్పారు. రేవంత్ ని తెలంగాణ వైఎస్ రాజశేఖర్ రెడ్డిగా చూస్తున్నారని ఆయన అన్నారు. ఇక నుంచి రేవంత్ రాజకీయం నడుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఆర్ ఎస్ లోని రెడ్డి ఎమ్మెల్యేల మీద కులంనుంచి వత్తిడి మొదలవుతుందని, దీన్ని గౌరవించి కొందరు కాంగ్రెస్ లోకి వచ్చే అవకాశం లేకపోలేదని ఆయన అన్నారు. “ఇపుడే ఇవన్నీ జరగకపోవచ్చు. ఎందుకంటే, కెసిఆర్ లాగా రేవంత్ తొందరపడడు. ఈ మార్పులన్నీవాటంతట అవే జరిగే పరిస్థితి తొందరలోనే నెలకొంటుంది,” అని పేరు రాసేందుకు ఇష్టపడని ఈ కాంగ్రెస్ నేత చెప్పారు.

కొంతమంది బిఆర్ ఎస్ నేతలు రేవంత్ ప్రభుత్వం భయంతో కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముందుకురావచ్చనేది మరొక వాదన.

“గత 10 ఏండ్లుగా ఎమ్మెల్యేలు చేసిన భూదందాలు, అక్రమాలు వెలుగు చూడకుండా, సేఫ్ గా ఉండేందుకు కాంగ్రెస్ పార్టీలోచేరేందుకు వెనకాడరు. భూ అక్రమణులు అక్రమ వ్యాపారాల ద్వారా స్థానికంగా బాగా బలపడ్డారు. ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి పలుమార్లు ఈ వ్యాపారాల గురించి ప్రస్తావిం చారు. మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలో భూ అక్రమాలను వెలికి తీస్తామని, ఇందులో దోషులుగా తేలిన వారందరినీ కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించాడు. వీళ్లంతా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు క్యూ కట్టేందుకు సిద్ధం కావచ్చు,” అని అశోక్ రెడ్డి అన్నారు.

కెసిఆర్ మౌనంగా కూర్చోరు

కానీ, నేటి రాజకీయాలలో ప్రశాంత జీవనానికి అవకాశం లేదు, ఎపుడైనా ఎదైనా అలజడి ఎదురుకావచ్చని చెబుతున్నారు ప్రముఖ మనో రాజకీయ విశ్లేషకుడు డా కేశవులు నేత. " బిఆర్ ఎస్ నేత కె చంద్రశేఖర్ రావు ను తక్కువ అంచనా వేయవద్దు. ఆయన రేవంత్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు తప్పకుండా ప్రయత్నిస్తారు. అందుకే కాంగ్రెస్ వాళ్లు తొందరతొందరగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. సక్సెస్ అవుతారో లేదో కాని కెసిఆర్ రంగ ప్రవేశం చేసి రేవంత్ ని ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి," డా కేశవులు అన్నారు.

దీని మీద మరింత వివరణ ఇస్తూ, ఇపుడు బిజెపి ఎలాంటి వైఖరి తీసుకుంటుందనే మీద తెలంగాణ రాజకీయాలు అధారపడి ఉన్నాయిని ఆయన అన్నారు.

" భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ అస్థిరపరి చేందుకు బిఆర్ ఎస్ కు సహకరిస్తుందా లేక బిఆర్ ఎస్ ను అస్థిరపరిచి ఆ జాగాలోకి తాను రావాలనుకుంటుందా అనేది బిజెపి తెల్చుకోవాలి. దాని బట్టి కెసిఆర్ చర్యలుంటాయి. కాంగ్రెస్ అస్థిరపడేందుకు అవసరమయిన ముఠాలు పార్టీలో ఉన్నాయి. బిఆర్ ఎస్, బిజెపి ప్రతికూల శక్తులనుంచి ప్రభుత్వాన్ని రేవంత్ ఎలా కాపాడుకుంటారో చూడాలి," అని డాక్టర్ కేశవులు నేత అన్నారు

Read More
Next Story