షర్మిల దారెటు? ఆంధ్రా వెళ్లక తప్పదా!
రాష్ట్రంలో ‘వైఎస్ ఆర్ తెలంగాణ' అవసరమూ లేదు. షర్మిళకు చోటూ లేదు. మరి దారెటు?
వైఎస్ షర్మిల తెలంగాణ రాజకీయాలు ముగిసినట్లే. రేవంత్ ముఖ్యమంత్రిగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాడటంతో ‘వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీ’ ఉనికి కోల్పోయింది. ఇక కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఆమె రాజకీయాలు నడిపే అవకాశమే లేదు. రాష్ట్రంలో వైఎస్ ఆర్ తెలంగాణ అవసరమూ లేదు. మరి దారెటు?
అంతేకాదు, తెలంగాణలో మరొక పార్టీకి చోటు లేకుండా పోయింది. ఉన్న జాగానంతా కాంగ్రెస్, బిఆర్ ఎస్, బిజెపిలే అక్రమించుకుంటున్నాయి. బహుజన నినాదంతో తెలంగాణ రాజకీయాల్లో ఒక కలకలం సృష్టించిన డాక్టర్ ప్రవీణ్ కుమార్ కూడా బహుజన్ సమాజ్ పార్టీకి అసెంబ్లీ లో చోటు సంపాదించలేకపోయారు.
కాంగ్రెస్ గెలుపు, అనుముల రేవంత్ రెడ్డి రాక తెలంగాణ రాజకీయాల దిశ మార్చేస్తున్నది. కాంగ్రెస్ ఇంకా బలపడుతుందనడంలో ఆశ్చర్యంలేదు. తెలంగాణలో ముందు ముందు తన ఉనికి కాపాడుకునేందుకు బిఆర్ ఎస్ బాగా కష్టపడాల్సి రావచ్చు.
ఇక్కడ రాజకీయాలు కాంగ్రెస్ , బిఆర్ ఎస్, బిజెపిల పెనుగులాటగా మారిపోతున్నాయి. అందువల్ల మరొక రాజకీయపార్టీ కి ద్వారాలు శాశ్వతంగా మూతపడ్డాయి. మరొక పరిణామం ఏమిటంటే, రేవంత్ లో అంతా వైఎస్ రాజశేఖర్ రెడ్డి (వైఎస్ ఆర్) నిచూస్తున్నారు. ఆయన గెలుపు,ఉధృతి వైఎస్ ఆర్ లాగానే ఉందని అంటున్నారు.దానికి తోడు ఇక్కడి కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ తోనే ఉంది. ఈ కారణాలన్నింటితో తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తాననే షర్మిల నినాదాన్ని ఇక ప్రజలు స్వీకరించరు.
రెేవంత్ రెడ్ల సమీకరణ సక్సెస్
గతంలో బిఆర్ ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ( కెసిఆర్) మీద ఉన్నవ్యతిరేకత ఆధారంగా రాజన్న రాజ్యం పేరుతో తెలంగాణ రాజకీయాల్లో ఆమె పట్టు సాధించాలనుకున్నారు. తాను తెలంగాణ కోడలిని అన్నారు. అపుడు కాంగ్రెస్ కూడా బాగా అధ్వాన్నంగా ఉంది. తమ కంటూ పార్టీ లేక, కెసిఆర్ నాయకత్వంలో ఇమడలేక రెడ్లు సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో రెడ్లను సమీకరించేందుకు ఆమెకు పూనుకుని తెలంగాణ వచ్చారు. వైఎస్ ఆర్ తెలంగాణ అంటూ పార్టీ పెట్టారు. కెసిఆర్ చాల బలంగా ఉండటంతో రెడ్లలో ఆమె నాయకత్వం మీద పెద్దగా గురి కుదరలేదు. దానికి తోడు ఆమె అన్న ఆంధ్రా ముఖ్యమంత్రి జగన్ కెసిఆర్ కు దోస్తాయే. సరిగ్గా అపుడే రేవంత్ రెడ్డి తెలంగాణరాజకీయాల్లో సుడిగాలి లా దూసుకురావడం జరిగింది. రావడం రావడంతో అనే ఆయన రెడ్లకు అజండా ఇచ్చారు. పెద్ద ఎత్తున రెడ్ల సమీకరణకు పూనుకున్నారు. షర్మిల మనుసులో ఉన్న వ్యూహం కూడా ఇదే. అయితే, రేవంత్ రాకతో అది కార్యరూపం దాల్చేందుకు అవకాశమే లేకుండా పోయింది. కాంగ్రెెస్ పార్టీని రెడ్ల సామాజిక వర్గానికి సొంతపార్టీగా చేయడంలో రేవంత్ విజయవంతమయ్యారు. రెడ్లు కూడా రేవంత్ ను స్వీకరించారు.రేవంత్ తీసుకునే పరిపాలనాచర్యలను బట్టి ఇతర పార్టీలలో ఉన్న రెడ్లంతా కాంగ్రెస్ లోకి వచ్చే అవకాశం బాగా కనిపిస్తాంది. రేవంత్ విజయం ఎక్కడుందంటే, ,రెడ్ల సమీకరణని ఇతర బిసి ఎస్ సి కులాలకు ఎలాంటి నొప్పిలేకుండా పూర్తి చేయడం. రేవంత్ రెడ్డి వ్యూహంలో ఉన్న బ్యూటీ ఎంటంటే, ఏదీ దాచకుండా, బహిరంగంగాా చేయడం. బిసిలకు, ఎసిలకు ఇప్పుడయితే నాయకత్వం వహించే శక్తి లేదు. రెడ్లకు మాత్రమే ఆ శక్తి ఉంది. కాబట్టి ముందు మీరు బలపడండి అని సలహా పడేశాడు. దీన్నెవరైనా కాదనగలరా?
షర్మిల హార్డ్ వర్కర్, అనుమానం లేదు
వైఎస్ షర్మిల హార్డ్ వర్కర్ అని అంతా గుర్తించారు. ఎవరే మన్నా ఆమె లెక్క చేయరు. రాష్ట్రమంతా పాదయాత్ర చేసి బాగా కష్టపడ్డారు. ఆమె నిరుద్యోగుల కోసం ధర్నా చేశారు, రైతులతో దీక్ష చేశారు. చిరుద్యోగుల పక్షాన నిలబడ్డారు. పోలీసులను ఎదుర్కొన్నారు. అరెస్టయ్యారు. బహిరంగ సభల్లో మాట్లాడారు. పిల్లలను ముద్దాడారు. వృద్ధులను కౌగిలించుకున్నారు.ఇలా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో నిలబడుతుందనుకున్నారు.
చివర్లో నిర్ణయం మారింది
అయితే,మంచికో చెడుకో ఎన్నికల ముందు ఆమె కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించి తెలంగాణ నుంచి ఉపసంహరించుకున్నంత పని చేశారు. కాంగ్రెస్ పార్టీలో తన ‘వైఎస్ ఆర్ తెలంగాణ’ ను విలీనం చేద్దామనుకున్నారు. చివరిదశలో అది వాయిదాపడింది. అయితే, ఆమె వెనకంజ వేయకుండా, కాంగ్రెస్ తో కలసి నడిచేందుకే నిర్ణయించుకున్నారు. మొన్నటి ఎన్నికల ఫలితాలు ఆమె నిర్ణయం సబబేనని రుజువుచేశాయి. ఎందుకంటే, ఆమె పోటీ చేసి ఉంటే పెద్ద ఇంపాక్ట్ రాకపోతే, ముందుకు సాగడం కష్టమయ్యేది. ఆమె రాజకీయ ప్రస్థానం ఆగిపోయేంత ప్రమాదం ఎదురయ్యేది.
ఆమె మద్దతు నిచ్చిన కాంగ్రెస్ ఎన్నికల్లో నెగ్గింది. దీని ప్రభావం ఆంధ్ర ప్రదేశ్ మీద కూడా పడుతుందంటున్నారు. ఇపుడు తెలంగాణ రాజకీయాల్లో ఆమెకు జాగా లేకుండాపోయింది కాబట్టి, తెలంగాణ ఎన్నికల ప్రభావాన్ని తనకు అనుకూలంగా మార్చుకొనేందుకు ఆంధ్రా వెళ్లడం తప్ప మరొక గత్యంతరం లేదు,
ఆంధ్రా వెళ్లడమే అకర్షణీయమైన ప్రపోజల్
ఆమె ముందున్నవి రెండే రెండు నిర్ణయాలు. కాంగ్రెస్ లో చేరి ఏదో ఒక పదవి తీసుకుని ఢిల్లీ వెళ్లడం. లేదా ఆంధ్రా వెళ్లి కాంగ్రెస్ కు నాయకత్వం వహించాలి. అక్కడ రేవంత్ లాగా సక్సెస్ అయితే, ముఖ్యమంత్రి అవుతారు. లేదా విఫలమయితే, ఆమెకంటూ ఒక పార్టీ ఉంటుంది. చాలా మందికి ఇది అత్యాశగానో, నేలవిడిచి సాము చేయడం లాగానో అనిపిస్తుంది. అయితే, షర్మిల పట్టుదలని తెలంగాణలో గమనించినవారెవరైనా సరే ఆమెను ప్రోత్సహించకుండా ఉండలేరు. ఆమె ఆంధ్రా వెళ్లడం ఆకర్షణీయమయిన ప్రపోజల్ అని చాలా మంది అంటున్నారు. సూచనప్రాయంగానే నయినా ఎపిసిసి అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ఈ విషయం వెల్లడించారు. కాంగ్రెస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఆమె ఆంధ్రా వెళ్లే అవకాశాలే మెండుగా ఉన్నాయి.
నినాదాలు రెడీ
ఆంధ్రా రాజకీయాల్లో ఆమెకు మంచి నినాదాలు రెడీగా ఉన్నాయి. అక్కడఉన్న రెండు ప్రధాన పార్టీలు, వైఎస్ ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, బిజెపితోనే ఉన్నాయి. అవి ఆ పార్టీకి దూరంగా జరిగే అవకాశమే లేదు. అందువల్ల లోక్ సభ ఎన్నికల్లోఆమె ఈ రెండు నినాదాలతో పార్టీకి ప్రచారం చేయవచ్చు. ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇవ్వాలని, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ఆమె అక్కడ యాత్ర కూడా చేయవచ్చు. కేంద్రాన్ని తీవ్రంగా విమర్శించవచ్చు. కాంగ్రెస్ అభిమానుల్ని, ప్రత్యేక హోదా మద్దతుదారులను, జగన్ తో విబేధించి గుర్రముంటున్న రెడ్లను కూడా ఆకట్టుకోవచ్చు.
ఈ నినాదాలతో దాడి చేసేది కేంద్రం మీద కాబట్టి కుటుంబంలో కొత్త గా పెట్టేచిచ్చేమీ ఉండదు. సోదరుడు, ముఖ్యమంత్రి జగన్ తో పేచీ లేకుండా కేంద్రాన్ని, బిజెపిని విమర్శిస్తూ దూసుకుపోవచ్చు. ఆమె మీద ఐటి, ఇడి దాడులు జరిగే చాన్స్ లేదు. ప్రధానిమోదీని చూసి భయపడేందుకు ఆమె మీద సిబిఐ కేసుల్లేవు. సిఐడి కేసులు లేవు.
అందుకే ఒక మంచి ముహూర్తం చూసుకుని ఆమె ఒక నిర్ణయం తీసుకుంటారని తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో వినబడతూ ఉంది.