100 రోజులకు చేరిన రైతుల ‘ఢిల్లీ చలో మార్చ్’
x
శంభు, ఖనౌరీ సరిహద్దు పాయింట్ల వద్ద గుమిగూడిన రైతులు

100 రోజులకు చేరిన రైతుల ‘ఢిల్లీ చలో మార్చ్’

తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ ఫిబ్రవరి 13న రైతులు చేపట్టిన ‘ఢిల్లీ చలో మార్చ్’ 100 రోజులు పూర్తి చేసుకుంది. కేంద్రం అంగీకరించే దాకా వెనుదిరిగేది లేదంటున్నారు.


పంటలకు ఎమ్‌ఎస్‌పి హామీ తదితర డిమాండ్లను ఆమోదించాలని కేంద్రాన్ని ఒత్తిడి చేసేందుకు కొనసాగుతోన్న రైతుల నిరసన ప్రదర్శన గురువారానికి (మే23) 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అన్నదాతలు శంభు, ఇతర సరిహద్దు పాయింట్ల వద్ద సమావేశమయ్యారు.

ఫిబ్రవరి 13న చేపట్టిన 'ఢిల్లీ చలో' మార్చ్‌ను భద్రతా బలగాలు అడ్డుకోవడంతో రైతులు శంభు, ఖనౌరీ సరిహద్దు పాయింట్ల వద్ద ఆగిపోయాయి.

కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ నాయకుడు సర్వన్ సింగ్ పంధేర్ మాట్లాడారు. పంజాబ్ హర్యానా మధ్య సరిహద్దు పాయింట్ల వద్ద భారీ పోలీసు బలగాలను మోహరించడాన్ని ఆయన తప్పుబట్టారు. తమ నిరసనను కొనసాగించేందుకు ఢిల్లీ వైపు వెళ్లకుండా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని పేర్కొన్నారు.

‘మోదీని కలిసేందుకు అనుమతించాలి’

పంజాబ్‌లోని 13 లోక్‌సభ స్థానాలకు జూన్ 1న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ మే 23న పాటియాలాలో పర్యటించనున్నారు.

మోదీని కలిసి మాట్లాడేందుకు అనుమతి ఇవ్వకుంటే ధర్నా చేస్తామని కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ నాయకులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పంజాబ్‌లో బీజేపీ అభ్యర్థులు లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో రైతుల నుంచి నిరసనలు ఎదుర్కొంటున్నారు. తమ డిమాండ్లను అంగీకరించనందుకు బీజేపీ నేతలను ప్రశ్నిస్తూ నల్లజెండాలు ప్రదర్శిస్తున్నారు.

Read More
Next Story