సంచలనం: జైళ్లలో 196 మంది మహిళా ఖైదీలు గర్భం దాల్చారు...హైకోర్టు ఆందోళన
x
Jail

సంచలనం: జైళ్లలో 196 మంది మహిళా ఖైదీలు గర్భం దాల్చారు...హైకోర్టు ఆందోళన

ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 196 మంది కటకటాల్లో ఉన్న మహిళా ఖైదీలు గర్భం దాల్చిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.బెంగాల్ రాష్ట్రంలోని జైళ్లలో ఈ ఘటనలు జరిగాయి...


ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 196 మంది కటకటాల్లో ఉన్న మహిళా ఖైదీలు గర్భం దాల్చిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని జైళ్లలో జరిగిన ఈ ఘటనపై కోల్‌కతా హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. జైళ్లలో ఉన్న మహిళా ఖైదీలు 196 మంది శిశువులకు జన్మనిచ్చిన ఘటనలపై అమికస్ క్యూరీ తెలిపింది. జైళ్లలో ఉన్న మహిళాఖైదీలు గర్భం దాల్చేవారి సంఖ్య పెరుగుతుండటంపై జైలు ఉన్నతాధికారులు సైతం ఆందోళన వ్యక్తం చేశారు. బెంగాల్ జైళ్లలో మహిళా ఖైదీలపై వరుసగా లైంగిక వేధింపులు సాగుతున్నా జైలు ఉన్నతాధికారులు ప్రేక్షకపాత్ర వహించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జైలు నాలుగు గోడల మధ్య సురక్షితంగా ఉండాల్సిన మహిళా ఖైదీలు గర్భం దాల్చిన నిస్సహాయ పరిస్థితులు జైళ్లలో ఉన్నాయి.మహిళా ఖైదీలు తమపై సాగుతున్న లైంగిక వేధింపులపై వారు పెదవి విప్పలేని దుర్భర పరిస్థితులు జైళ్లలో నెలకొన్నాయి. బెంగాల్ జైళ్ల దుర్భర పరిస్థితులపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మహిళా ఖైదీలున్న జైలు ఎన్‌క్లోజర్లలోకి పురుష ఉద్యోగులు ఎలా ప్రవేశించారు?

జైళ్లలో సంస్కరణలు చేపట్టినా కటకటాల్లో ఏం జరుగుతుందనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. మహిళా ఖైదీలున్న జైలు ఎన్‌క్లోజర్లలోకి పురుష ఉద్యోగులు ప్రవేశించకుండా నిషేధం విధించాలని అమికస్ క్యూరీ ప్రతిపాదించింది. జైలు కస్టడీలో ఉన్న మహిళా ఖైదీలు గర్భం దాల్చడంపై అమికస్ క్యూరీ హైకోర్టుకు తెలిపింది. ఈ ఘటనలను కోల్ కతా హైకోర్టు డివిజన్ బెంచ్ చీఫ్ జస్టిస్ టీఎస్ శివజ్ఞానం, జస్టిస్ సుప్రతిమ్ భట్టాచార్య తీవ్రంగా పరిగణించారు. దీనిపై డివిజన్ బెంచ్ ముందు విచారణకు షెడ్యూల్ చేశారు.

జైళ్లలో దిద్దుబాటు చర్యలు

జైళ్లలో మహిళా ఖైదీలు గర్భం దాల్చిన ఘటనలతో జైళ్లలో పరిస్థితులను మెరుగుపర్చి, దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. మహిళా ఖైదీల సంక్షేమం కోసం మరిన్ని సూచనలను అమికస్ క్యూరీ ప్రతిపాదించింది. జైళ్లలో గర్భవతులైన మహిళా ఖైదీల ఘటనలపై ఆయా జిల్లాల న్యాయమూర్తులు దృష్టి సారించాలని సూచించారు. జైళ్లలో ఎంతమంది మహిళా ఖైదీలు గర్భవతులయ్యారో తెలుసుకొని ఆయా జైళ్లలో దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని సర్కారు కోరింది.

మహిళా ఖైదీలకు గర్భ నిర్ధారణ పరీక్షలు

మహిళా ఖైదీలను జైలుకు పంపించే ముందు వారికి గర్భ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని అన్ని జిల్లాల చీఫ్ జ్యూడీషియల్ మేజిస్ట్రేట్లను ఆదేశాలు ఇచ్చారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని అన్ని పోలీసు స్టేషన్ల ద్వారా మహిళా ఖైదీలకు గర్భ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని కోర్టు ఆదేశాలు ఇవ్వాలని అమికస్ తయారు చేసిన నోట్ లో పేర్కొంది.

జైళ్లలో లైంగిక వేధింపులపై మహిళా ఖైదీలు ఫిర్యాదు చేయొచ్చు...

జైలులో ఉన్న మహిళా ఖైదీలపై జైలు సిబ్బంది లైంగికంగా వేధిస్తుంటే వారు జైలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే వారిని మరో జైలుకు తరలిస్తారని హైదరాబాద్ నగరానికి చెందిన మెట్ పల్లి శ్రీనివాస్ అనే న్యాయవాది చెప్పారు. అయితే మహిళా ఖైదీలు గర్భం దాల్చిన ఘటనలపై దర్యాప్తు జరిపి దీనికి కారణమైన వారిపై కఠినచర్యలు తీసుకోవాల్సి ఉందని న్యాయవాది శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. జైళ్లలో మహిళా ఖైదీలను గర్భవతులను చేసిన ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని మహిళా సంఘం నాయకురాలు సి. రాధిక చెప్పారు.

దర్యాప్తులో విషయాలు వెలుగులోకి వస్తాయి...

మహిళా ఖైదీలు గర్భం దాల్చిన ఘటనల్లో జైలు సిబ్బందితోపాటు వారిని కోర్టుకు తీసుకువెళ్లే సమయంలో రిజర్వు పోలీసులు వెంట ఉంటారని, వీరిలో ఎవరు తప్పు చేశారనేది విచారణలో గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉందని తెలంగాణకు చెందిన జైలు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. దీనిపై విచారణలోనే అసలు వాస్తవాలు బయటపడతాయని జైలు అధికారి పేర్కొన్నారు. మొత్తంమీద పశ్చిమబెంగాల్ జైళ్లలో 196 మంది మహిళా ఖైదీలు గర్భం దాల్చి శిశువులకు జన్మనిచ్చిన ఘటనలు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది.

Read More
Next Story