ఈ ఏడాది వేసవి వెరీ హాట్ గురూ!
x
Hottest Summer

ఈ ఏడాది వేసవి వెరీ హాట్ గురూ!

తెలంగాణ, ఆంధ్రాతోపాటు ప్రపంచంలో 2024వ సంవత్సరంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయా? అంటే అవునంటోంది నేషనల్ సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ ఇన్‌ఫర్‌మేషన్ సెంటర్....

4 mins read

తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా 2024వ సంవత్సరంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయా? 2024వ సంవత్సరం అత్యంత వేడి సంవత్సరంగా ప్రపంచ చరిత్రలో రికార్డు సృష్టించనుందా? అంటే అవునంటోంది నేషనల్ సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ ఇన్‌ఫర్‌మేషన్ సెంటర్. 1977 వ సంవత్సరం నుంచి ప్రతి ఏటా సగటు కంటే ఉష్ణోగ్రత పెరుగుతూనే ఉంది. 2022వ సంవత్సరంలో వేసవికాలంలో గరిష్ఠ ఉష్ణోగ్రత సగటు కంటే 0.95 డిగ్రీల సెల్సియస్ వేడిగా నమోదైంది. 2023వ సంవత్సరంలో నవంబర్ వరకు 1.15 డిగ్రీల సెల్సియస్‌కు ఉష్ణోగ్రత పెరిగింది.

ఎల్ నినో ప్రభావంతో మండుతున్న ఎండలు

గ్లోబల్ వార్మింగ్, ఎల్ నినో ప్రభావం వల్ల ఈ ఏడాది వేసవికాలం ప్రజలను మండే ఎండలు ఠారెత్తిస్తాయని ప్రపంచ వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతాయని టెక్సాస్ లోని ఏ అండ్ ఎం విశ్వవిద్యాలయంలో వాతావరణ శాస్త్రవేత్త ఆండ్రూ డెస్లర్ అంచనా వేశారు. అడవుల నరికివేత, గ్లోబల్ వార్మింగ్, ఎల్ నినో ప్రభావం వల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని ఆండ్రూ డెస్లర్ చెప్పారు. గత ఏడాది లిబియా, గ్రీస్ దేశాల్లో మునుపెన్నడూ చూడని విధంగా భారీ వరదలు సంభవించాయి. దీంతో ఈ ఏడాది వాతావరణ మార్పులతో ఠారెత్తించనున్న ఎండలతో జనం సతమతం అవుతారని ప్రపంచ శాస్త్రవేత్తలు వెల్లడించారు.

వేసవికి ముందే ఠారెత్తిస్తున్న ఎండలు

హైదరాబాద్ నగరంతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఏటా మార్చి మూడవ వారంలో శివరాత్రి తర్వాత ఎండ వేడిమి ప్రారంభమవుతోంది. కాని ఈ సారి ఫిబ్రవరి నెలలోనే పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే నాలుగు డిగ్రీలు పెరిగాయి. మంగళవారం నుంచి రాత్రి ఉష్ణోగ్రత 4 డిగ్రీలు పెరిగింది. ఫిబ్రవరి 4వతేదీన హైదరాబాద్ నగరంలో 32.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా మంగళవారం నాటికి 36.3 డిగ్రీలకు పెరిగింది. హైదరాబాద్ నగరంలో బుధవారం 36.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. డిగ్రీ వేసవి కాలం ఆరంభానికి ముందే సూర్యుడు తన ప్రతాపం చూపుతుండటంతో ప్రజలు ఎండలకు ఠారెత్తిపోతున్నారు. గత ఏడాదితో పోలిస్తే బుధవారం నమోదైన ఉష్ణోగ్రతలో గణనీయంగా పెరిగిందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర శాస్త్రవేత్త డాక్టర్ ఏ ధర్మరాజు చెప్పారు.

మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు

మరో రెండు, మూడు రోజుల్లో ఉష్ణోగ్రతల్లో ఉష్ణోగ్రతల్లో మరింత పెరుగుదల ఉంటుందని హైదరాబాద్ వాతావరణకేంద్రం అధికారులు చెప్పారు. నిజామాబాద్ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రత 35.2గా నమోదైంది. ఖమ్మం జిల్లాలో 34.4 డిగ్రీలు, భద్రాచలంలో 34.2 డిగ్రీలు, రామగుండంలో 33.6 డిగ్రీలు, మహబూబ్ నగర్ లో 34.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైందని హైదరాబాద్ వాతావరణకేంద్రం హెడ్ సైంటిస్ట్ డాక్టర్ కె. నాగరత్న చెప్పారు. హైదరాబాద్ నగర శివార్లలోని పటాన్ చెరు, రాజేంద్రనగర్, హయత్ నగర్ ప్రాంతాల్లోనూ బుధవారం అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలో బుధవారం గరిష్ఠ ఉష్ణోగ్రత 35.3 డిగ్రీలుగా నమోదైంది.

ఆదిలాబాద్ జిల్లాలో చలి, వేడి ఎక్కువే...

ఆదిలాబాద్ జిల్లాలో శీతాకాలంలో చలితోపాటు వేసవిలో ఉష్ణోగ్రతలు అధికంగానే ఉంటాయని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో బుధవారం ఉష్ణోగ్రత సాధారణం కంటే 6.1 డిగ్రీల సెల్షియస్ అధికంగా నమోదైంది. హైదరాబాద్, దుండిగల్, ఖమ్మం, రామగుండం, పటాన్ చెరు, రాజేంద్రనగర్, హయత్ నగర్ ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3.1 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదైంది. ఫిబ్రవరి నెలలో అత్యధిక ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్, కనిష్ఠ ఉష్ణోగ్రత 17 డిగ్రీల సెల్సియస్ గా ఉంది.

ఉక్కపోతతో పెరిగిన విద్యుత్ వినియోగం

వేసవికాలానికి ముందే ఉష్ణోగ్రతలు పెరగడంతో ఉక్కపోత ప్రారంభమైంది. దీంతో హైదరాబాద్ నగరంలోనూ రాత్రి, పగలూ ఫ్యాన్లు వేసుకోక తప్పని పరిస్థితి నెలకొంది. దీంతో పాటు కొందరు ఏసీలూ వాడటం ప్రారంభించారు. విద్యుత్ వినియోగం డిమాండ్ బాగా పెరిగిందని హైదరాబాద్ విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ శివాజీ చెప్పారు.1966వ సంవత్సరంలో జూన్ 2వతేదీన అత్యధికంగా 45.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదై రికార్డు సృష్టించింది. అత్యల్ప ఉష్ణోగ్రత 1946వ సంవత్సరంలో జనవరి 8వతేదీన 6.1డిగ్రీల సెల్సియస్ తో రికార్డు ఉంది. ఈ ఏడాది వేసవి కాలం మే నెలలో తెలంగాణ జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలకు చేరుకోవచ్చని హైదరాబాద్ వాతావరణ శాస్త్రవేత్త ధర్మరాజు అంచనా వేశారు. తెలంగాణ రాష్ట్రంలోని రామగుండం, కొత్తగూడెం ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రత 45 డిగ్రీల దాకా ఉండవచ్చని ఆయన పేర్కొన్నారు. మొత్తంమీద ఈ ఏడాది వేసవికాలంలో ఠారెత్తించే ఎండలతో జనం సతమతం కానున్నారు.

Read More
Next Story