సబ్జెక్టు పాఠాలే కాదు అంతకు మించిన బోధనకు ‘దిక్సూచి’
x
జనగామ జిల్లా పెంబర్తి ప్రభుత్వ పాఠశాల తరగతి గదిలో పాఠాలు బోధిస్తున్న జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా

సబ్జెక్టు పాఠాలే కాదు అంతకు మించిన బోధనకు ‘దిక్సూచి’

జనగామ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల అభ్యున్నతి కోసం జనగామ కలెక్టర్ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు.


నిజమైన విద్య అంటే కేవలం సబ్జెక్టులు బోధించడమే కాదు...విద్యార్థులకు అవసరమైన జీవిత నైపుణ్యాలను అందించి, మారుతున్న ప్రపంచీకరణకు అనువుగా వారిని సమాయత్తం చేసేందుకు జనగామ జిల్లాలో ‘దిక్సూచి’ పేరిట వినూత్న కార్యక్రమాన్ని ఆ జిల్లా కలెక్టర్ (Jangaon District Collector) రిజ్వాన్ భాషా షేక్ ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సంప్రదాయ తరగతి గది అభ్యాసానికి మించిన విద్యతోపాటు సృజనాత్మక, వినూత్న నైపుణ్యాలను అందించి వారి సమగ్ర అభివృద్ధికి ఈ కార్యక్రమం కింద బాటలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.




ఏమిటీ ‘దిక్సూచి’ కార్యక్రమం
దిక్సూచి కార్యక్రమం కింద ప్రతీ రోజూ 30 నిమిషాల సమయాన్ని కేటాయించారు. ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచి ఇంటర్మీడియెట్ వరకు విద్యార్థుల భవిష్యత్ కెరీర్ లకు అవసరమైన నైపుణ్యాన్ని అందించనున్నారు. జనగామ జిల్లా విద్యాశాఖ అధికారులతో కలెక్టరు సంప్రదింపులు జరిపిన తర్వాత వివిధ కీలక రంగాల్లో విద్యార్థులకు మార్గ నిర్దేశం చేసేందుకు ‘దిక్సూచి’ కార్యక్రమాన్ని రూపొందించారు. కేవలం సబ్జెక్టులను బోధించడమే కాకుండా విద్యార్థులకు అవసరమైన జీవిత నైపుణ్యాలను ముందుగానే అందించి, వారిని ప్రపంచీకరణకు అనుగుణంగా సమాయత్తం చేస్తామని జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.



దిక్సూచి పాఠ్యాంశాల్లో ఏముంటాయంటే...

విద్యార్థులకు విద్యతో పాటు జ్ఞాన నైపుణ్యాలను నేర్పించనున్నారు. చదవడం, రాయడం, తార్కిక ఆలచన, స్పోకెన్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, శాస్త్రీయ ఆలోచన, సృజనాత్మక ఆవిష్కరణ, వ్యక్తిగత అభివృద్ధి నైపుణ్యం, స్వీయ అవగాహన, క్రమశిక్షణ, బాధ్యత, బావోద్వేగ నియంత్రణ, సమయ నిర్వహణ, లక్ష్యాలు నిర్దేశించుకోవడం, పౌర, నైతిక నైపుణ్యాలు, నిజాయితీ, నైతిక విలువలు, వైవిధ్యం, గౌరవం, పర్యావరణ పరిరక్షణ, సమాజ సేవ, మానవ హక్కులు, డిజిటల్ భద్రత, సామాజిక నైపుణ్యాలు, ప్రభావవంతమైన కమ్యూనికేసన్, చురుకైన శ్రవణం, టీం స్పిరిట్, నాయకత్వ లక్షణాలు, బహిరంగంగా ప్రసంగం, శారీరక, ఆరోగ్య నైపుణ్యాలు, వ్యాయామం, క్రీడలు, ఆరోగ్యకరమైన ఆహారం, పరిశుభ్రత, యోగా, ధ్యానం, ప్రథమ చికిత్స, ఇండోర్ ఆటలు, కళలు, సంగీతం, నాటకాలు, స్టోరీ టెల్లింగ్, సాంకేతిక అధునిక నైపుణ్యం, కంప్యూటర్ బేసిక్స్, కోడింగ్, డేటా విశ్లేషణ, కృత్రిమ మేథస్సు, సైబర్ భద్రత, డిజిటల్ అక్షరాస్యతలపై విద్యార్థులకు ఆభ్యాసాన్ని మెరుగుపర్చాలని నిర్ణయించారు.



ఏ పాఠశాలల్లో అమలు చేస్తారంటే...

జనగాం జిల్లాలోని ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థుల కోసం ‘దిక్సూచి’ అనే కొత్త కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ప్రాథమిక పాఠశాలల నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రతీ ప్రభుత్వ పాఠశాల, కాలేజీల్లో దిక్సూచి కార్యక్రమాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు వీడియో, ఆడియో, పీడీఎఫ్ ఫార్మాట్ల ద్వారా ఆన్ లైన్ పాఠాలను బోధించనున్నారు. దిక్సూచి కార్యక్రమం విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ కు కీలకమైన మార్గదర్శిగా ఉపయోగపడుతుందని కలెక్టర్ రిజ్వాన్ భాషా చెప్పారు.

ప్రతీ విద్యార్టీకి హెల్త్ కార్డు

విద్యార్థులు ఆరోగ్యం గా ఉంటేనే చదువు మీద శ్రద్ద పెట్టడానికి అవకాశం ఉంటుందని జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు.దిక్సూచి కార్యాచరణ లో భాగంగా జనగామ జిల్లాలోని అన్ని సంక్షేమ హాస్టల్ విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ప్రతీ విద్యార్థికి వారి హెల్త్ ప్రొఫైల్ కార్డు అందజేయనున్నారు. ఘనపూర్ కేజీవీబీ నుంచి దిక్సూచి కార్యక్రమాన్ని సోమవారం కలెక్టర్ రిజ్వాన్ బాషా ప్రారంభించారు. జనగామ జిల్లా లోని 39 సంక్షేమ పాఠశాలల్లో ఉన్న 14,993 మంది విద్యార్థులకు ఈ కార్డు ను అందజేసి ఆరోగ్య పరీక్ష లు నిర్వహించనున్నట్లు కలెక్టర్ చెప్పారు.


Read More
Next Story