పారా ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన ఒకప్పటి పేపర్ బాయ్
x

పారా ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన ఒకప్పటి పేపర్ బాయ్

ఒకప్పటి నిర్మాణ కార్మికుడు భారత ఖ్యాతిని నలుదిక్కులా చాటుతాడని ఎవరూ ఊహించి ఉండరు. ఏకంగా బంగారు పతకమే సాధించి మనమంతా గర్వపడేలా చేశాడు. అతనే..


ఒకప్పటి నిర్మాణ కార్మికుడు భారత ఖ్యాతిని నలుదిక్కులా చాటుతాడని ఎవరూ ఊహించి ఉండరు. పేపర్ బాయ్‌గా పనిచేసి కుటుంబానికి అండగా నిలిచిన ఓ దివ్యాంగుడు పారా అథ్లెటిక్స్ లో పతకాలు సాధిస్తాడని భావించి ఉండరు. ఏకంగా బంగారు పతకమే సాధించి మనమంతా గర్వపడేలా చేశాడు. అతనే మరియప్పన్ తంగవేలు..

టోక్యో పారా ఒలింపిక్స్ రజత విజేత మరియప్పన్ తంగవేలు మంగళవారం జపాన్‌లోని కోబ్‌లో జరిగిన ప్రపంచ పారా అథ్లెటిక్స్ లో రికార్డు సృష్టించాడు. హైజంప్‌లో 1.88 మీటర్ల దూరం ఎగిరి గోల్డ్ మెడల్ సాధించాడు. గత ఎనిమిదేళ్లలో అతనికి దక్కిన తొలి స్వర్ణం ఇదే.

28 ఏళ్ల మరియప్పన్ 2016 రియో పారాలింపిక్స్‌లో T42 క్లబ్ హైజంప్‌లో స్వర్ణం, 2021లో టోక్యోలో జరిగిన పోటీల్లో T63 క్లబ్‌లో రజతం సాధించాడు. గతేడాది హాంగ్‌జౌ పారా ఆసియా క్రీడల్లో T63 క్లబ్‌లో రజతం అందుకున్నాడు.

ఇక అమెరికన్లు ఎజ్రా ఫ్రెచ్ , సామ్ గ్రూ వరుసగా 1.85 మీటర్లు, 1.82 మీటర్ల జంప్‌ చేసి వరసగా రజతం, కాంస్యం సాధించారు.

మరియప్పన్ నేపథ్యం ఇది..

తమిళనాడులోని సేలం జిల్లాకు చెందిన మరియప్పన్‌ది పేద కుటుంబం. తండ్రి కుటుంబాన్ని వదిలేయడంతో తల్లి కూరగాయలు అమ్మి పిల్లలను పోషించింది.

తల్లికి అండగా..

ఐదేళ్ల వయసులో మరియప్పన్ స్కూల్‌కు నడుచుకుంటూ వెళుతుండగా..మద్యం మత్తులో ఉన్న బస్సు డ్రైవర్ అతనిని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో మరియప్పన్ కుడి కాలుకు శాశ్వత వైకల్యం సంభవించింది. క్రీడారంగానికి పరిచయం కాకముందు పేపర్ బాయ్‌గా, నిర్మాణ కార్మికుడికి పనిచేసి తల్లికి అండగా నిలిచారు.

మరియప్పన్‌కు ప్రశంశలు..

తమిళనాడు పరిశ్రమల శాఖ మంత్రి డిఆర్‌పి రాజా మరియప్పన్ ఎక్స్ వేదికగా అభినందించారు.

“జపాన్‌లోని కోబ్‌లో జరిగిన ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో పురుషుల హైజంప్ పోటీలో మా మారియప్పన్ తంగవేలు స్వర్ణం సాధించాడు. అభినందనలు' అని పోస్ట్ చేశాడు.

పతకాల పంటలో భారత్ మూడో స్థానం..

ప్రస్తుత పారాఒలింపిక్స్ ఛాంపియన్ సుమిత్ యాంటిల్ కూడా F64 క్లబ్ జావెలిన్ త్రో ప్రపంచ టైటిల్‌ సాధించగా.. మహిళల F51 క్లబ్ పోటీలో ఏక్తా భయన్ 20.12 మీటర్ల దూరం విసిరి స్వర్ణం గెలుచుకుంది. ఇప్పటిదాకా పతకాల జాబితాను పరిశీలిస్తే ఇండియా మూడో స్థానంలో నిలిచింది. మన దేశ క్రీడాకారులు ఇప్పటి వరకు 4 స్వర్ణాలు, 4 రజతాలు, 2 కాంస్యాలు గెలిచారు. చైనా 15 స్వర్ణాలు, 13 రజతాలు 13 కాంస్యాలతో మొదటి స్థానంలో, బ్రెజిల్ 14 స్వర్ణాలు, 6 రజతాలు, 5 కాంస్యాలతో రెండో స్థానంలో నిలిచింది.

Read More
Next Story