కబ్జాలపై హైడ్రాకు ఫిర్యాదుల వెల్లువ, ఛాలెంజ్‌గా తీసుకొని కూల్చివేతలు
x
కుచించుకు పోయిన చెరువు: సర్వే ఆఫ్ ఇండియా చిత్రం

కబ్జాలపై హైడ్రాకు ఫిర్యాదుల వెల్లువ, ఛాలెంజ్‌గా తీసుకొని కూల్చివేతలు

హైదరాబాద్ శివార్లలోని పలు చెరువుల కబ్జాలపై హైడ్రాకు ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో హైడ్రా ఛాలెంజ్‌గా తీసుకొని కూల్చివేతలు సాగిస్తోంది.


హైదరాబాద్ నగరంతోపాటు శివారు ప్రాంతాల్లో చెరువుల శిఖం భూములను ఆక్రమించి నిర్మించిన భవనాలను హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా)(HYDRA) కూల్చివేస్తుండటంతో ప్రజల్లో ఈ సంస్థపై నమ్మకం పెరిగింది. దీంతో ప్రజలు, పర్యావరణ పరిరక్షకుల నుంచి చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాల కబ్జాలపై హైడ్రాకు కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు వస్తున్నాయి. హైడ్రాకు కబ్జాలపై వస్తున్న ఫిర్యాదుల సంఖ్య పెరిగిందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.


చెరువుల కబ్జాలపై చర్యలు తీసుకోవాలని హైడ్రాకు ఫిర్యాదు
హైదరాబాద్ నగరంలోని పలు చెరువులు కబ్జాల పాలయ్యాయని చెరువుల పరిరక్షణ ఉద్యమ నాయకురాలు డాక్టర్ లుబ్నా సర్వత్ హైడ్రా ఛైర్మన్ ఏ రేవంత్ రెడ్డి, కమిషనర్ ఏవీ రంగనాథ్ లకు ఫిర్యాదు చేశారు. సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ లో ఉన్న చెరువులు నేడు కబ్జాల వల్ల అంతర్ధానం అయ్యాయని డాక్టర్ లుబ్నా ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఎన్నెన్నో చెరువుల కబ్జా
బండ్లగూడ సూరంచెరువు, షాహీన్ నగర్ ఎర్రకుంట చెరువు, జల్ పల్లి పల్లెచెరువు, బాలాపూర్ చెరువు, షుకూర్ సాగర్, గుర్రం చెరువులతోపాటు పలు నాలాలు కబ్జాల పాలయ్యాయని డాక్టర్ లుబ్నా సర్వత్ ఫిర్యాదులో పేర్కొన్నారు. చెరువులు,నాలాల కబ్జాల వల్ల నదీం కాలనీ, మహ్మద్అలీనగర్ తదితర కాలనీలు జలమయం అవుతున్నాయని, సత్వరం కబ్జాలను తొలగించాలని ఆమె కోరారు.

సరస్సులను పరిరక్షించండి
రాజేంద్రనగర్, బండ్లగూడ ప్రాంతాల్లోని కొన్ని చెరువులను అత్యవసరంగా పరిరక్షించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి,హైడ్రా కమిషనర్ ఎవి రంగనాథ్‌లను కోరుతూ సామాజిక కార్యకర్త డాక్టర్ లుబ్నా సర్వత్ లేఖ రాశారు. ఆ సరస్సుల్లో అక్రమ, అనధికారిక నిర్మాణాలను తొలగించడంలో తక్షణం జోక్యం చేసుకోవాలని కోరారు.

ముంపు నుంచి కాపాడండి
ఎర్రకుంట,సూరం చెరువుతోపాటు నాలా ఆక్రమణల పాలవడంతో మరో సరస్సు మధ్య ఉన్న నబీల్ కాలనీ, హబీబ్ కాలనీ, మహ్మద్ నగర్ తదితర కాలనీలు ముంపునకు గురయ్యాయని ఆమె తెలిపారు.సూరంచెరువుపై లోకాయుక్తలో, పల్లె చెరువుపై హైకోర్టులో కేసు ఉందని ఆమె హైడ్రా దృష్టికి తీసుకువచ్చారు.పల్లె చెరువులోని ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌ (ఎఫ్‌టీఎల్‌), బఫర్‌ జోన్‌లో ప్లాటింగ్‌, నిర్మాణాలు జరుగుతున్నాయని, సూరం చెరువులో ఎలాంటి అనుమతులు లేకుండా ఎత్తైన భవనాలు నిర్మించారని ఆమె ఆరోపించారు.


హైడ్రా వరుస కూల్చివేతలు
- గండిపేట చెరువు ప్రాంతంలో అక్రమంగా నిర్మించిన భవనాలు, విల్లాలు, అపార్టుమెంట్లను హైడ్రా ఎన్‌ఫోర్స్‌మెంట్ టీం బుల్డోజర్లతో కూల్చివేసింది. గండిపేట సరస్సు ఫుల్ ట్యాంక్ లెవెల్, బఫర్ జోన్ లో నిర్మించిన భవనాలను అధికారులు నేలమట్టం చేశారు.
- అంబర్ పేట బతుకమ్మ కుంటను ఆక్రమించిన వారిని వదలమని, అక్రమ నిర్మాణాలను తొలగిస్తామని రంగనాథ్ చెప్పారు. బతుకమ్మకుంట స్థలాన్ని రక్షించాలని మాజీ ఎంపీ వి.హనుమంతరావు, మాజీ కార్పొరేటర్‌ జ్ఞానేశ్వర్‌గౌడ్‌ ఫిర్యాదు చేశారు.
- అక్రమంగా నిర్మించిన భవనాలను కూల్చివేస్తుండగా అడ్డుకున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై హైడ్రా కేసు పెట్టింది.జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 69 నందగిరిహిల్స్ లో పార్క్‌ వద్ద గోడను కూల్చివేశారనే ఆరోపణలపై దానంతో పాటు ఆయన అనుచరులపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
- చిత్రపురి కాలనీలో అక్రమంగా నిర్మించిన ఏడు భవనాలను మణికొండ మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. 7 అక్రమ విల్లాలను నేలమట్టం చేశారు.
- మొయినాబాద్ లో హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణాలను గుర్తించి కూల్చి వేశారు.


ఐపీఎస్ ఏవీ రంగనాథ్ తీరే వేరు...
గతంలో ఐపీఎస్ అధికారిగా పలు జిల్లాల్లో పనిచేసిన ఏవీ రంగనాథ్ ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా ముక్కుసూటిగా పనిచేస్తారనే పేరుంది. గతంలో కొత్తగూడెం ఆపరేషన్స్ ఓఎస్డీడీగా ఛత్తీస్ ఘడ్ సరిహద్దుల్లో మావోయిస్టులను అణచివేసేందుకు పలు కీలక ఆపరేషన్లు చేపట్టారు.అనంతరం నల్గొండ జిల్లా ఎస్పీగా కూడా పనిచేశారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు జాయింట్ కమిషనరుగా రంగనాథ్ పనిచేసినపుడు రోడ్లపై అక్రమంగా వాహనాల పార్కింగ్ నిరోధానికి ఆపరేషన్ రోప్ చేపట్టారు.ఆ తర్వాత వరంగల్ పోలీసు కమిషనరుగా పలు కీలక కేసులను ఛేదించారు. సీఎం రేవంత్ రెడ్డి తాను ఛైర్మన్ గా ఏర్పాటైన హైడ్రాకు ఐజీ స్థాయి అధికారి అయిన రంగనాథ్ ను ఎంచుకున్నారు.

హైడ్రా పరిధి రీజనల్ రింగ్ రోడ్డు వరకు విస్తరించేనా?
కేటీఆర్ లీజుకు తీసుకున్న జన్వాడ ఫాం హౌస్ హైడ్రా పరిధిలోకి రాదని హైడ్రా అధికారి ఒకరు చెప్పారు. హైడ్రా పరిధి ఔటర్ రింగ్ రోడ్డు వరకే ఉంది. దీంతో రీజనల్ రింగ్ రోడ్డు వరకు హైడ్రా పరిధిని విస్తరించాలని అధికారులు ప్రతిపాదించారు. దీంతోపాటు 111 జీఓ పరిధిని కూడా హైడ్రా పరిధిలోకి తీసుకువచ్చి చెరువుల కబ్జాలను తొలగించాలని నిర్ణయించారు.

సీఎం,చీఫ్ సెక్రటరీలకు హైడ్రా కమిషనర్ నివేదిక
హైడ్రా అక్రమ కట్టడాల కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ హైడ్రా ఛైర్మన్ అయిన సీఎం రేవంత్ రెడ్డికి, తెలంగాణ చీఫ్ సెక్రటరీ ఎ శాంతికుమారిలకు నివేదిక సమర్పించారు. హైడ్రా చేపట్టిన కూల్చివేతలపై ఎప్పటికప్పుడు సీఎం, చీఫ్ సెక్రటరీలకు సమాచారం అందిస్తున్నానని రంగనాథ్ చెప్పారు.

కబ్జాదారులను జైలుకు పంపిస్తాం...
చెరువులు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసిన వారిపై కేసులు పెట్టి, వారిని జైలుకు పంపిస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.ప్రభుత్వ స్థలాలు, చెరువులు, పార్కుల కబ్జాదారులు ఎంతటి వారైనా వదిలేది లేదన్నారు.వరదలు వచ్చినపుడు వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడటంతో పాటు విపత్తులు రాకుండా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలను తొలగించడంతో పాటు ఇకముందు కబ్జాలు కాకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు.


Read More
Next Story