ఫలించిన హైదరాబాద్ మహిళ ‘బురద పోరాటం’
x
నిహారిక నిరసనతో రోడ్డు పూడ్చిన అధికారులు...

ఫలించిన హైదరాబాద్ మహిళ ‘బురద పోరాటం’

నాగోల్‌లో గుంతల రోడ్డుకు మరమ్మతులు చేయాలని డిమాండ్ చేస్తూ ఓ మహిళ బురదలో కూర్చుని చేసిన నిరసన ...అధికారులు పరుగులు పెట్టించింది


అడగందే అమ్మైనా అన్నం పెట్టదు అంటారు...కానీ మరి ప్రజాప్రతినిధులు, అధికారులను సమస్యలు తీర్చమని అడిగినా ప్రయోజనం ఉండదని తేలిపోయింది. గోటేటి నిహారిక బురదనీటిలో కూర్చొని వినూత్న నిరసన తెలిపిన ఫలితమే...ఎన్నికల కోడ్ ముగియకుండానే అధికారులు ఆఘమేఘాలమీద వచ్చి నాగోల్‌లో యువతి బురద నీటిలో కూర్చొని నిరసన తెలిపిన గుంతల రోడ్డును తాత్కాలికంగా పూడ్చివేశారు. ప్రస్థుతానికి గుంతల్లో కంకర నింపి తాత్కాలికంగా సమస్యను పరిష్కరించారు.


నిహారిక వినూత్న నిరసన
తేదీ 23-05-2024 : కుంట్లూరుకు చెందిన గోటేటి నిహారిక రోజూ కుంట్లూరు నుంచి నాగోల్ కు ప్రయాణిస్తుంటుంది. ఆమె పిల్లలు కూడా ఇదే రోడ్డుపై స్కూలుకు వెళుతుంటారు. గుంతలతో రోడ్డు అధ్వానంగా మారడంతో నిహారిక పిల్లలు ఒకసారి ఈ గుంతలో పడ్డారు. రోడ్డుపై గుంతలు పూడ్చాలని కోరుతూ నిహారిక జీహెచ్ఎంసీ అధికారులకు విన్నవించింది. అయినా అధికారుల్లో చలనం లేకపోవడంతో విసిగి వేసారిన నిహారిక రోడ్డుపై నిలచిన బురదనీటిలో కూర్చొని నిరసన తెలిపారు.

సోషల్ మీడియాలో వైరల్ అయిన నిరసన
రోడ్డు మరమ్మతుల కోసం గోటేటి నిహారిక చేపట్టిన నిరసనతో ఇప్పుడీమె పేరు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.రోజూ ఈ రోడ్డుపై చాలా మంది వెళుతుంటారు. అధ్వానంగా ఉన్న రోడ్డు అని గొణుక్కోవడం మినహాయించి ఎవరూ పట్టించుకోలేదు. నిహారిక మాత్రం రోడ్డెక్కింది. బురదనీరున్న గుంతలో బైఠాయించి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డు పట్టుకుంది...పోలీసులు నచ్చచెప్పినా వినలేదు. చివరికి కౌన్సిలర్ వచ్చి నిధులు మంజూరయ్యాయి...ఎలక్షన్ కోడ్ పూర్తి కాగానే పని ప్రారంభిస్తామని చెబితేగానీ నిరసన విరమించలేదు.

పాపులర్ అయిన నిహారిక
సాధారణ గృహిణి అయిన నిహారిక గతంలో జర్నలిస్టుగా పనిచేయడంతో ధైర్యంగా ముందుకు వచ్చి నిరసన చేపట్టింది. ప్రస్థుతం రెప్లోటిఫీ ఇన్ ఫ్రా సొల్యూషన్స్ సంస్థను నెలకొల్పి దానికి సీఈఓగా పనిచేస్తున్న నిహారిక అధ్వానంగా మారిన రోడ్డు సమస్యపై అవగాహన ఉండటంతో ధైర్యంగా పోరాడింది. అంతే రాత్రికి రాత్రే అలా సోషల్ మీడియాలో నిహారిక పాపులర్ అయ్యింది.

రోడ్డుపై నిరసన తెలుపుతున్న గోటేటి నిహారిక

మహిళల మద్ధతు
ఆనంద్‌నగర్ కాలనీలో గుంతలమయమైన రోడ్లను మరమ్మతులు చేయాలని అధికారులను డిమాండ్ చేస్తూ నాగోల్‌ ప్రధాన రహదారిపై ఓ మహిళ చేసిన నిరసనకు పలువురు మహిళలు మద్ధతు ప్రకటించారు.‘‘ మేం రోడ్డు పన్ను, మున్సిపల్ టాక్స్ వగైరా చెల్లిస్తున్నాం, మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించరా? అంటూ మహిళలు ప్రశ్నించారు. మరో ఏడుగురు నివాసితులు నిహారికతో కలిసి ‘‘మాకు సురక్షితమైన రహదారి కావాలి. మీరు చేయరా?’’అంటూ నిలదీశారు.

గుంతల రోడ్లపై ప్రమాదాలు...
హైదరాబాద్ నగర రోడ్లు గుంతలతో వాహనచోదకులు తరచూ ప్రమాదాల పాలవుతున్నారు. వీవీఐపీలు తరచుగా రాకపోకలు సాగించే రోడ్లు మినహా, చాలా వరకు నగర రోడ్లు అత్యవసర మరమ్మతుల కోసం ఎదురుచూస్తున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న 9,013 కిలోమీటర్ల రోడ్లలో 6,167 కిలోమీటర్లు సీసీ రోడ్లు ఉన్నాయి.నగరంలో బీటీ రోడ్లు 2,846 కిలోమీటర్ల మేర ఉన్నాయి.పలు బీటీ రోడ్లపై కంకర తేలి అధ్వానంగా మారాయి. తాను గుంతలు లేని నగర రోడ్డును చూడలేదని బైకర్ రాపోలు సతీష్ చెప్పారు. నగర రోడ్లు గుంతలు, కంకర తేలడంతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ద్విచక్ర వాహనాలు ప్రతి రోజూ రోడ్లపై స్కిడ్ అవుతున్నాయని సతీష్ ఆవేదనగా చెప్పారు. అధ్వాన రోడ్లపై జరుగుతున్న ప్రమాదాలతో మరణాలు సంభవించినప్పటికీ, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మాత్రం ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు.

బాచుపల్లి రోడ్డు ప్రమాదంలో బాలిక మృతి
హైదరాబాద్ నగరంలో రోడ్లను బాగు చేయాలని కోరుతూ ప్రజలు, కాలనీ సంక్షేమ సంఘాలు వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదు. చంపాపేట్ లో రోడ్లు మరీ అధ్వానంగా మారాయి. జనసమ్మర్ధం అధికంగా ఉన్న బాచుపల్లిలో రోడ్డు అధ్వాన్నంగా ఉండడంతో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండో తరగతి చదివే బాలిక ప్రాణాలు కోల్పోయింది. వర్షాల కారణంగా బాచుపల్లి, చంపాపేట్, ఎల్‌బీ నగర్‌లోని రోడ్లు అస్తవ్యస్తంగా మారాయని నగర ప్రజలు చెప్పారు.

ప్రధాన రహదారిపై ప్రయాణం నరకం
ఉప్పల్ నుంచి నారపల్లి వరకు ఉన్న ప్రధాన రహదారి గుంతలమయంగా మారింది. వర్షం కారణంగా రోడ్డుపై నీరు నిలబడి పరిస్థితి మరింత దిగజారింది. అధ్వానంగా మారిన రోపై బైక్ రైడ్ నరకంగా మారిందని మరో బైకర్ పంజాల శ్రీనివాస్ చెప్పారు.‘‘రోడ్లు అధ్వాన్నంగా మారాయి. రోడ్లపై గుంతలు ఏర్పడి కంకర తేలింది. స్కిడ్‌ అవడంతో బైక్‌ల నుంచి పడిపోతున్నాం, బహదూర్‌పురా క్రాస్‌రోడ్స్‌లో వర్షం కురుస్తూ రోడ్డు నీళ్లతో నిండిపోవడంతో నా మోటర్ బైక్ కింద పడింది. నేను వర్షపునీటిలో మునిగిపోయాను, నాకు తీవ్ర గాయాలయ్యాయి’’ అని పాతబస్తీకి చెందిన రమేష్ చెప్పారు.

ప్రమాదాలు జరుగుతున్నా, పట్టించుకోరా?
అధ్వాన రోడ్లపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం విస్తుగొలిపేలా ఉంది. సికింద్రాబాద్‌లోని రెజిమెంటల్ బజార్‌లోని సెయింట్ ఫ్రాన్సిస్ రోడ్డు గుంతలు పడి ఉంది. పిల్లల్ని స్కూలుకు తీసుకువెళ్లాలంటేనే అధ్వానంగా మారిన రోడ్లతో భయమేస్తుందని స్థానిక నివాసి ఇందిర చెప్పారు. గుంతలమయమైన రోడ్లు మృత్యువుగా మారకుండా జీహెచ్‌ఎంసీ యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాల్సిన సమయం ఆసన్నమైంది.

నగర రోడ్లపై 3,900 గుంతలు...
హైదరాబాద్ నగరంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రోడ్లపై 3,900కు పైగా గుంతలు ఏర్పడ్డాయని జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ అధికారులే గుర్తించారు. నగరంలో గుంతలతో నిండిన రోడ్లు ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా అనేక లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, రోడ్లు గుంతలతో ప్రయాణికులకు ప్రమాదకరంగా మారాయి. రోడ్లపై పడిన గుంతలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ త్వరలో పూడ్చి, రోడ్డు మరమ్మతు పనులను చేపట్టనుందని జీహెచ్‌ఎంసీ ఇంజినీరింగ్ అధికారి ఒకరు తెలిపారు.

వర్షాలకు కొట్టుకుపోయిన రోడ్లు
ఇటీవల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లు కొట్టుకుపోయి అధ్వానంగా మారాయి. చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ దగ్గర రోడ్డు చాలా ప్రమాదకరంగా మారింది. మల్లాపూర్, నాచారం, కవాడిగూడ, ఆరం ఘడ్, మెహదీపట్నం, కొత్త ఫ్లైఓవర్‌ల నిర్మాణంలో ఉన్న పలు ప్రాంతాల్లో రోడ్లు, బైలేన్‌లు అధ్వానంగా మారాయి. మూసారాంబాగ్, బేగంపేట్, ఇందిరా నగర్, లంగర్ హౌజ్, మలక్‌పేట్, సైదాబాద్, చాదర్‌ఘాట్, బండ్లగూడ, ఫలక్‌నుమా, కార్వాన్, జియాగూడ, అంబర్‌పేట్, పురానా పుల్, బహదూర్‌పురా, కిషన్ బాగ్ ప్రాంతాల రోడ్లపై గుంతలు ఏర్పడ్డాయి. రోడ్డు అధ్వానంగా ఉంటే జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేయాలని జీహెఛ్ఎంసీ అధికారులు సూచించారు.


Read More
Next Story