పదేళ్ల పసికూన తెలంగాణకు రెండో సీఎం
x
LB Stadium (Wikipedia)

పదేళ్ల పసికూన తెలంగాణకు రెండో సీఎం

మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపకాంతులతో ఎల్.బి. స్టేడియం ముస్తాబైంది. అందరికీ పిలుపులు వెళ్లాయి. సోనియాగాంధీ మొదలు కేసీఆర్ వరకు, అమరవీరుల కుటుంబాల వరకు.. అందరికీ


భారతీయ భౌగోళిక చిత్రపటంలో యువ రాష్ట్రంగా ఉన్న తెలంగాణలో తొలిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. పదేళ్ల పసికూన తెలంగాణకు రెండో సంరక్షకునిగా అనుముల రేవంత్ రెడ్డి గురువారం మధ్యాహ్నం 1.04 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అట్టహాసంగా సాగే ఈ కార్యక్రమానికి ఎల్బీ స్టేడియం ముస్తాబైంది. అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఆహ్వానాలు వెళ్లాయి. రాజ్ భవన్ మొదలు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ సహా ఇరుగు పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ సీఎంలు, హితులు, స్నేహితులు, రాజకీయ కురువృద్ధులు, తెలంగాణ అమరవీరుల కుటుంబాల సభ్యులు, ఉద్యమ నేతలు, వామపక్ష, ప్రజాతంత్ర శక్తుల వరకు పిలుపులు వెళ్లాయి. ప్రమాణ స్వీకారం అనంతరం చేసే తొలి ఫైలు కూడా సిద్ధమైంది. అధికారుల హడావిడి మొదలైంది.

కాంగ్రెస్ ఇచ్చిన సోనియమ్మ మెచ్చిన తెలంగాణలో దశాబ్ద కాలం తర్వాత హస్తం పార్టీ అధికార పీఠాన్ని అధిష్టించనుంది. 2023 నవంబర్ 30న జరిగిన ఎన్నికల్లో మార్పు కావాలి కాంగ్రెస్ రావాలనే నినాదంతో మార్మోగిన తెలంగాణకు మూడో ముఖ్యమంత్రిగా రెండో వ్యక్తి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.

ఢిల్లీలో రేవంత్, హైదరాబాద్ లో భట్టి..

అసెంబ్లీలోని 119 నియోజకవర్గాల్లో 64 చోట్ల గెలవడానికి పాటుపడిన రేవంత్ రెడ్డినే ముఖ్యమంత్రి పదవికి కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది. ఆవెంటనే అనేక పరిణామాలు చకచకా జరిగిపోయాయి. ఉప ముఖ్యమంత్రులెందరు, ఎవరనే దానిపై పేచీ నెలకొన్నా అన్నీ సమసిపోయాయి. అధిష్టానం పిలుపుతో ఢిల్లీ వెళ్లిన రేవంత్ పలువురు కాంగ్రెస్ నేతలతో మంతనాలు జరిపారు. మంత్రివర్గ కూర్పు, ఇతర అంశాలపై స్పష్టత తెచ్చారు. . బుధవారం ఉదయం కాంగ్రెస్ సీనియర్ నేత వేణుగోపాల్, పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గేని కలిసి ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. మరోపక్క భట్టి విక్రమార్క హైదరాబాద్ లో ఉండి అందర్నీ పేరుపేరునా ఆహ్వానించేలా ఏర్పాట్లు చూస్తున్నారు.

సోనియాకు ప్రత్యేక పిలుపు

సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమై ధన్యవాదాలు తెలిపారు. ప్రమాణ స్వీకారానికి రావాలని కోరారు. సుమారు 50 నిమిషాల పాటు రేవంత్ గాంధీ త్రయంతో చర్చలు జరిపారు. మంత్రివర్గ కూర్పు, ప్రమాణ స్వీకారం తరువాత అమలు చేయాల్సిన పథకాలు వంటి అంశాలపై రాహుల్ తో రేవంత్ చర్చించారు. రేవంత్ తో భేటీ తరువాత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

రాహుల్ ట్వీట్ లో ఏముందంటే..

రాహుల్ గాంధీ ట్వీట్ లో.. ‘తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న రేవంత్ రెడ్డికి అభినందనలు. ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చి ప్రజా సర్కార్ ని నిర్మిస్తుందన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని, తెలంగాణలో ప్రజల ప్రభుత్వం ఏర్పాటవుతుందని రాహుల్ చెప్పారు. సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలను కలిసి రేవంత్ పుష్పగుచ్చం అందించిన ఫొటోలను రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

డీకే శివకుమార్ తో ఏం మాట్లాడారంటే...

కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ తో పాటు..మాణిక్ ఠాగూర్ తోనూ రేవంత్ భేటీ అయ్యారు. ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకావాలని కోరారు.

ఎల్.బీ.స్టేడియం ముస్తాబు...

రేవంత్ ప్రమాణస్వీకారోత్సవానికి తెలంగాణ సీఎస్ ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. వర్షం రావొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికార యంత్రాంగం అదనపు ఏర్పాట్లు చేస్తోంది. గురువారం మధ్యాహ్నాం 1.04 గంటలకు జరుగనున్న ప్రమాణస్వీకారం ఏర్పాట్లను సీఎస్,డీజీపీ పరిశీలించారు. రేవంత్ తో పాటు పలువురు మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు.

ఎందరెందరికో పిలుపులు...

కర్ణాటక సీఎం ఎంకే స్టాలిన్, డిప్యూటీ సీఎం, మంత్రులకు ఆహ్వానాలు పలికారు. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడుకు ఆహ్వాహానాలు పలికారు. హైకోర్టు చీఫ్ జస్టిస్, సినీ నటుటు, మేధావులకు కూడా ఆహ్వానాలు పలికారు. ఇంతమంది ప్రముఖుల మధ్య రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణస్వీకారం కార్యక్రమానికి కావాల్సిన ఏర్పాట్లను తెలంగాణ సీఎస్ శాంతి కుమారి, డీజేపీలు పరిశీలిస్తున్నారు.

అమరవీరుల కుటుంబాలకు ఆహ్వానం..

రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా 300 మంది అమరవీరుల కుటుంబాలకు టీ పీసీసీ ఆహ్వానం పంపింది. మరో 250 మంది తెలంగాణ ఉద్యమకారులను ఆహ్వానించారు. కాంగ్రెస్ నేతలు చిదంబరం, మీరా కుమారి, సుశీల్ కుమార్, కురియన్, తెలంగాణ అమరవీరుల కుటుంబాలు, కోదండరామ్, గాదె ఇన్నయ్య, హరగోపాల్,కంచ ఐలయ్యతో పాటు మరికొందరు ఉద్యమకారులకు ఆహ్వానాలు వెళ్లాయి.

ఎంపీ పదవికి రాజీనామా

కాబోయే తెలంగాణ సీఎం, సీఎల్పీ నేత రేవంత్‌రెడ్డి కొద్దిసేపటి క్రితమే పార్లమెంట్‌కి చేరుకున్నారు. స్పీకర్ ఓం బిర్లాను కలిసి ఎంపీ పదవికి రాజీనామా చేశారు. గురువారం సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఎంపీ పదవికి రేవంత్‌రెడ్డి చేశారు. బుధవారం రాత్రికి ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కి రానున్నారు.

రేపు ట్రాఫిక్ ఆంక్షలు

సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న రేవంత్ ఇంటి వద్ద భద్రతను పెంచారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగే ఎల్.బీ.స్టేడియం పరిసర ప్రాంతాల్లో నిఘా పెరిగింది. గురువారం ఉదయం పదింటి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. వచ్చిపోయే వాహనాలను రూట్ మళ్లిస్తున్నారు. వాహనదారులు గమనించి రూట్ మార్చుకోవాలని సూచించారు పోలీసులు.

రజనీకి తొలి ఉద్యోగం...

అక్టోబర్ 17న తనవద్దకు వచ్చిన రజని అనే దివ్యాంగురాలికి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉద్యోగం కల్పిస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. ఆమెకు ఇచ్చిన మాట ప్రకారం.. సీఎంగా తన ప్రమాణస్వీకారానికి రావాలని రజనీని ఆహ్వానించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తి అయ్యాక రజనీ ఉద్యోగ నియామక పేపర్స్ పై సంతకం చేసి రజనీకి ఇవ్వనున్నారు.

Read More
Next Story