మెరుగైన వైవాహిక జీవితం కోసం ‘ఆదాబ్ జిందగీ’
x
కాబోయే వధూవరులకు కౌన్సెలింగ్ కోసం ఆదాబ్ జిందగీ కార్యక్రమం ప్రారంభం

మెరుగైన వైవాహిక జీవితం కోసం ‘ఆదాబ్ జిందగీ’

మెరుగైన వైవాహిక జీవితాల కోసం వధూవరులకు కౌన్సెలింగ్ చేసేందుకు సఫా స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చింది.హైదరాబాద్‌లో కొత్తగా ఆదాబ్ జిందగీ కార్యక్రమాన్ని ఆరంభించింది.


పెళ్లి అంటే రెండు మనసులే కాదు, రెండు కుటుంబాల కలయిక. జీవిత భాగస్వాములు పరస్పరం గౌరవించుకుంటూ, కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ, కాపురం సాఫీగా, అన్యోన్యంగా దాంపత్య జీవితం సాగాలని అందరూ కోరుకుంటారు.

- పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు. కానీ నేడు పెళ్లయి ఏడాది కాలం కూడా గడవకముందే కొన్ని పెళ్లిళ్లు పెటాకులవుతున్నాయి. ఈ పరిస్థితిని రూపుమాపేందుకు హైదరాబాద్ నగరానికి చెందిన ‘సఫా’ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ‘ఆదాబ్ జిందగీ’ పేరుతో వినూత్న కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు.
- కాబోయే వధూవరులకు వైవాహిక జీవితంపై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని పాతబస్తీలోని నూర్‌ఖాన్ బజార్‌లోని సఫా సంస్థ కార్యాలయంలో సోమవారం ప్రారంభించారు. ప్రఖ్యాత సామాజిక కార్యకర్త ఉజ్మా నహీద్‌తో కలిసి సఫా సంస్థ వ్యవస్థాపకురాలు, సీఈఓ రుబీనా నఫీస్ ఫాతిమా ఆదాబ్ జిందగీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

వధూవరులు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి
పెళ్లి తర్వాత దంపతుల మధ్య ఎలాంటి వివాదాలు, మనస్పర్థలు ఏర్పడకుండా ముందుగా పెళ్లికి ముందే కాబోయే వధూవరులకు కౌన్సెలింగ్ చేసేందుకు సఫా స్వచ్ఛంద సంస్థ ఆదాబ్ జందగీ పేరిట వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పెళ్లికి ముందే 15వారాల పాటు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.వధూవరులు ఒకరినొకరు అర్థం చేసుకోవాలని కౌన్సెలింగ్ లో వివరించి చెప్పనున్నారు. ఈ అవగాహన తరగతుల్లో దాంపత్య బంధంలో ఉండే సాధక బాధకాలను కాబోయే వధూవరులకు వివరిస్తామని ప్రముఖ విద్యావేత్త ఉజ్మా నాహిద్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

ప్రీ వెడ్డింగ్ కౌన్సెలింగ్
వివాహం తర్వాత వచ్చే ఇబ్బందులను ఎలా పరిష్కరించుకోవచ్చు? ఒకరినొకరు అర్థం చేసుకుని సమస్యల్ని ఎలా చక్కబెట్టుకోవచ్చు? అవగాహనాలోపంతోను,ఇగోలతో వచ్చే అభిప్రాయబేధాల్ని ఎలా పరిష్కరించుకోవచ్చు? వంటి పలు విషయాలపై ఈ ప్రీ వెడ్డింగ్ కౌన్సెలింగ్ లో కాబోయే వధూవరులకు వివరిస్తామని సఫా స్వచ్ఛం సంస్థ ఫౌండర్ సీఈవో రుబీనా నఫీస్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

ఆదాబ్ జిందగీ కార్యక్రమం అంటే ఏమిటి?
సఫా స్వచ్ఛంద సంస్థ మెరుగైన వైవాహిక జీవితాల కోసం ఆదాబ్ జిందగీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. మెరుగైన వైవాహిక జీవితాలను పెంపొందించడంపై యువతకు అవగాహన కల్పించడానికి రూపొందించిన వినూత్న కౌన్సెలింగ్ కార్యక్రమమే ‘ఆదాబ్ జిందగీ’. వైవాహిక జీవితంలోని సంక్లిష్టతలను సమర్థవంతంగా గుర్తించి కాబోయే వధూవరులకు వివరించి చెప్పి, అన్యోన్య దాంపత్యానికి ఏం చేయాలనేది వివరించి చెప్పడం ఆదాబ్ జిందగీ కార్యక్రమం లక్ష్యం అంటారు సఫా కౌన్సెలర్లు.

పెళ్లి కుటుంబ వ్యవస్థకు పునాది
ముస్లిం మతాచారం ప్రకారం వివాహం అంటే స్త్రీ, పురుషుల మధ్య మత సమ్మతి పొందిన ఒక ఒప్పందం. స్త్రీ పురుషులు న్యాయ బద్ధమైన వైవాహిక జీవితం గడపడం ముస్లిం వివాహపు ముఖ్య ఉద్ధేశం. పెళ్ళి వైవాహిక జీవితం, కుటుంబ వ్యవస్థకు పునాది. ఆదాబ్ జిందగీ ప్రోగ్రామ్ లో కాబోయే వధూవరులకు అవగాహన కల్పించడం, సమర్థవంతమైన కమ్యూనికేషన్, సంఘర్షణల పరిష్కారం, ఆర్థిక నిర్వహణ, సాన్నిహిత్యం వంటి కీలకమైన అంశాలను ప్రస్తావిస్తారు. వధూవరులకు వివాహం చేసుకునే ముందు సామరస్యపూర్వకమైన, స్థిరమైన వివాహానికి సిద్ధం చేసేందుకే ఆదాబ్ జిందగీ కౌన్సెలింగ్ కార్యక్రమం చేపట్టామని సఫా సభ్యురాలు మెహర్ అఫ్రోజ్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

మే 24న ఆదాబ్ జిందగీ పైలట్ ప్రాజెక్టు
కాబోయే వధూవరులకు ఆదాబ్ జిందగీ కౌన్సెలింగ్ కార్యక్రమాన్ని ఈ నెల 24వతేదీన పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టనున్నారు. సమాజంలో ఆరోగ్యకరమైన, శాశ్వతమైన వివాహాలను ప్రోత్సహించడంలో ఈ కౌన్సెలింగ్ ముఖ్య ఉద్ధేశమని రుబీనా నఫీస్ ఫాతిమా చెప్పారు. వైవాహిక శ్రేయస్సును ప్రోత్సహించడం, జంటలు బలమైన, శాశ్వతమైన సంబంధాలను ఏర్పరచుకోవడంలో ఈ చొరవ కీలకమని ఆమె పేర్కొన్నారు. ఇస్లాం మతానికి మూలమైన ఖురాన్, హదీసుల దృక్కోణాల నుంచి వివాహం యొక్క ప్రాముఖ్యతను ఉజ్మా నహిద్ వివరించారు.

రెండు దశాబ్దాలుగా స్వచ్ఛంద సేవలు
హైదరాబాద్ నగరంలో సఫా స్వచ్ఛంద సంస్థ రెండు దశాబ్దాలుగా మహిళల సాధికారత, విద్య, ఉపాధి, ఆరోగ్యం, పేదరిక నిర్మూలన కోసం పనిచేస్తోంది. రోష్ని క్లబ్, ఆవాజ్,యువ జోష్ క్లబ్ ద్వారా, విద్య, ఆరోగ్యం, పర్యావరణం మరియు ఇతర సామాజిక సమస్యల వంటి విభిన్న అంశాలకు సంబంధించి యువతకు అవగాహన కల్పించడానికి, మహిళలు, యువత, పిల్లలను శక్తివంతం చేసేందుకు సఫా విశేష కృషి చేస్తోంది. సఫా సేవల్లో భాగంగా ఆదాబ్ జిందగీ మరో వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది.
- సఫా స్వచ్ఛంద సంస్థ కొత్తగా చేపట్టిన ఆదాబ్ జిందగీ కార్యక్రమం విజయవంతం అయి దంపతుల జీవితాల్లో వెలుగులు నింపాలని మనమూ ఆశిద్దాం.


Read More
Next Story